భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ఏదంటే ఎవరైనా చెప్పే పేరు 'దృశ్యం'. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి ప్రేక్షకులను మెప్పించిన ఈ సిరీస్, ఇప్పుడు మూడో భాగంతో పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రంలో మోహన్ లాల్ కుమార్తెగా నటించిన ఎస్తేర్ అనిల్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తెలుగు రీమేక్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'దృశ్యం' చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్‌లో నటించిన మీనా, ఎస్తేర్ అనిల్ తెలుగులోనూ అవే పాత్రలను పోషించారు. అయితే, తెలుగు 'దృశ్యం 1' చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను ఎస్తేర్ గుర్తుచేసుకుంది.
'దృశ్యం' మొదటి భాగంలో ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్. ఆ సన్నివేశంలో నటుడు సహదేవన్, మోహన్ లాల్‌ను బలంగా కొట్టే సీన్ ఉంటుంది. దెబ్బ తిని కింద పడిపోయిన తర్వాత, మోహన్ లాల్ తన భార్యాపిల్లల వైపు చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వుతారు. "నాకు ఏమీ కాలేదు.. మీరు ధైర్యంగా ఉండండి" అని తన కళ్లతోనే భరోసా ఇచ్చే ఆ నవ్వు ఎంతో హార్ట్ బ్రేకింగ్ గా, ఇంటెన్స్‌గా ఉంటుంది. తెలుగులో శ్రీప్రియ దర్శకత్వంలో ఈ సీన్ షూట్ చేస్తున్నప్పుడు, వెంకటేష్‌కు ఆ షాట్ గురించి వివరించారట. అప్పుడు వెంకీ చాలా నిజాయితీగా స్పందిస్తూ.. "అమ్మా.. నేను అలా చేయలేను. అది మోహన్ లాల్ గారికి మాత్రమే సాధ్యం.
ఆయన ఒక అద్భుతమైన నటుడు. నేను మాత్రం నాకు వచ్చినట్లుగా నేను చేస్తాను" అని చెప్పారట. ఒక స్టార్ హీరో అయి ఉండి, మరో ఇండస్ట్రీకి చెందిన తోటి హీరో నటనను అంతలా ప్రశంసించడం వెంకటేష్ గొప్పతనానికి నిదర్శనమని ఎస్తేర్ అనిల్ కొనియాడింది. తన పరిమితులను ఒప్పుకుంటూనే, ఒరిజినల్ నటుడి ప్రతిభను గౌరవించడం నిజంగా గ్రేట్ అని ఆమె చెప్పుకొచ్చింది.
వెంకటేష్ కూడా తెలుగులో తనదైన శైలిలో నటనను పండించి 'దృశ్యం' చిత్రాన్ని తెలుగులో భారీ విజయం సాధించేలా చేశారు. కానీ తెర వెనుక జరిగిన ఈ చిన్న సంభాషణ ఆయన ఎంతటి నిరాడంబరమైన వ్యక్తో తెలియజేస్తోంది. మరోవైపు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దృశ్యం 3' మే 21న మలయాళంలో విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఎస్తేర్ అనిల్ పంచుకున్న ఈ జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో 'వెంకటేష్' అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.