నేటి కాలంలో సోషల్ మీడియా అనేది కేవలం వినోదానికి మాత్రమే కాదు, సెలబ్రిటీలకు ఒక ప్రధాన ఆదాయ వనరుగా కూడా మారిపోయింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ప్రవేశపెట్టిన 'పెయిడ్ సబ్స్క్రిప్షన్' ఫీచర్ ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో హాట్ టాపిక్. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో సెలబ్రిటీలు తమ ఫోటోలు మరియు వీడియోలను అభిమానులకు షేర్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో వారు పోస్ట్ చేసే 'బోల్డ్' కంటెంట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, ట్రోలింగ్ కూడా జరుగుతున్నాయి.ఇప్పటికే విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, ఆషు రెడ్డి వంటి తారలు ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా విష్ణు ప్రియ షేర్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
నెటిజన్ల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం కేసుల వరకు వెళ్లింది. అయినప్పటికీ, "ఇది మా వ్యక్తిగత ఇష్టం" అంటూ సెలబ్రిటీలు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. తాజాగా ఈ వివాదాస్పద లిస్టులోకి నటి గాయత్రీ గుప్త కూడా చేరింది. గతంలో 'కొబ్బరి మట్ట', 'గ్యాంగ్స్టర్స్', 'దయా', 'స్టోరీ డిస్కషన్స్ 2' వంటి ప్రాజెక్టులతో మెప్పించిన ఆమె, ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్‌లో ఉండే గాయత్రీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఇన్‌స్టా సబ్స్క్రిప్షన్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ.. "నేను ఈ మధ్యనే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ ఫీచర్ స్టార్ట్ చేశాను. అందులో కొంచెం బోల్డ్ కంటెంట్ పెడుతున్నాను. అందులో తప్పేముంది?" అని నేరుగా ప్రశ్నించింది. గాయత్రీ గుప్త ఇలా బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉందని వెల్లడించింది. "పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చే డబ్బులతో నా సినిమాను నేనే ప్రొడ్యూస్ చేసుకోవాలని అనుకుంటున్నాను" అని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు రాకపోవడంతో, ఆర్థిక స్వయం సమృద్ధి కోసం ఆమె ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో గాయత్రీ గుప్త చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె తెగింపును మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా, తనదైన శైలిలో సమాధానమిస్తూ గాయత్రీ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.