సంక్రాంతి బాక్సాఫీస్ మొగుడు.. దశాబ్దాలు మారినా తరగని మెగాస్టార్ మేనియా.. ఒకే ఒక్కడు..!

తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండివంటల పండగ మాత్రమే కాదు.. అది బాక్సాఫీస్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2026 | 07:40 PMLast Updated on: Jan 24, 2026 | 7:40 PM

Intersting Facsts About Chiranjeevi

తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండివంటల పండగ మాత్రమే కాదు.. అది బాక్సాఫీస్ దగ్గర జరిగే ఒక భారీ యుద్ధం. ఈ సమరంలో ఎన్ని సినిమాలు తలపడినా, అంతిమంగా విజేతగా నిలిచేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. 1985లో వచ్చిన ‘చట్టంతో పోరాటం’ సినిమాతో మొదలైన ఈ సంక్రాంతి సెంటిమెంట్.. నేటికీ టాలీవుడ్‌ను శాసిస్తూనే ఉంది. సంక్రాంతి రేసులో చిరు సినిమా ఉందంటే చాలు, థియేటర్ల దగ్గర పండగ కళ నెల రోజుల ముందే వచ్చేస్తుంది. ముఖ్యంగా 80వ దశకంలో చిరంజీవి హవా ఓ రేంజ్‌లో ఉండేది. 1987లో ‘దొంగ మొగుడు’, 1988లో ‘మంచి దొంగ’, 1989లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ కొట్టి, తానే అసలైన ‘సంక్రాంతి మొగుడు’ అని అప్పుడే నిరూపించుకున్నారు. ఆ మూడు సినిమాలు మెగాస్టార్‌ను మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేశాయి.

90వ దశకంలోకి అడుగుపెట్టాక చిరంజీవి బాక్సాఫీస్ జాతర పతాక స్థాయికి చేరింది. 1993లో ఊర మాస్ లుక్‌తో వచ్చిన ‘ముఠా మేస్త్రి’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తే, 1994లో ‘ముగ్గురు మొనగాళ్లు’గా వచ్చి అభిమానులను ఎంతగానో అలరించారు. అయితే చిరంజీవి కెరీర్ కాస్త మందగించిందేమో అని విమర్శకులు అనుకుంటున్న సమయంలో, 1997 సంక్రాంతికి ‘హిట్లర్’ సినిమాతో వచ్చి తన విశ్వరూపాన్ని చూపించారు. అప్పటివరకు కేవలం మాస్ హీరోగానే చూసిన ప్రేక్షకులకు, అన్నయ్య సెంటిమెంట్‌తో కన్నీళ్లు పెట్టించి ఆడవాళ్ళ మనసులో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత 1999లో వచ్చిన ‘స్నేహం కోసం’, 2000లో ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచిన ‘అన్నయ్య’ సినిమాలు సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి చిరుని ఒక పెన్నిధిగా మార్చేశాయి. ఈ విజయాలు చిరంజీవిని కేవలం స్టార్‌గానే కాకుండా, ఇంటి మనిషిగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయి.

మిలీనియం మారినా.. కొత్త హీరోలు వచ్చినా బాస్ జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2004లో గ్రాఫిక్స్ వండర్ ‘అంజి’తో ఒక భారీ ప్రయోగం చేశారు. కమర్షియల్ హంగులను పక్కనపెట్టి చేసిన ఈ రిస్క్ అప్పట్లో ఫలితాన్ని ఇవ్వకపోయినా.. నేటికీ ఆ సినిమాకు, అందులోని గ్రాఫిక్స్‌కు ఒక స్పెషల్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇక రాజకీయ ప్రస్థానం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ, 2017 సంక్రాంతికి ‘ఖైదీ నెంబర్ 150’తో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేశారు. దాదాపు 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ, అప్పటివరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. ఆ సినిమా విజయం చూశాక.. బాస్ ఈజ్ బ్యాక్ అని అభిమానులు గర్వంగా చెప్పుకునేలా చేసింది. ఇక ఇటీవలే 2023లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వింటేజ్ చిరుని గుర్తుచేస్తూ, థియేటర్లలో పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఆ ఏడాది సంక్రాంతికి ఏకచక్రాధిపత్యం వహించింది. అసలు సంక్రాంతి రేసులో చిరంజీవి ట్రాక్ రికార్డ్ గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆయన ఎంచుకునే కథల్లో పండగకు కావాల్సిన కమర్షియల్ హంగులన్నీ పుష్కలంగా ఉంటాయి. మాస్ ఎలిమెంట్స్, గుండెను తాకే సిస్టర్ సెంటిమెంట్, కడుపుబ్బా నవ్వించే కామెడీ, స్టైలిష్ డ్యాన్స్.. ఇలా అభిమానులు కోరుకునే ఫుల్ మీల్స్ ప్యాకేజీని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయడంలో చిరు దిట్ట. అందుకే పోటీలో ఎంతమంది ఉన్నా, ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినా, పండగ విన్నర్ మాత్రం మెగాస్టారే అవుతుంటాడు.

ఇప్పుడు 2026 సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు మరో సంచలనంతో మన ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ రేంజ్ ఏంటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. దశాబ్దాలు మారుతున్నా.. కొత్త జనరేషన్లు వస్తున్నా, సంక్రాంతికి చిరు సినిమా ఉంటే ఆ కిక్కే వేరు అని ఈ సినిమా మరోసారి నిరూపించింది. కేవలం హిట్లు కొట్టడమే కాదు, ఇండస్ట్రీకి కొత్త ఊపిరిని, కలెక్షన్ల వర్షాన్ని అందించడంలో చిరంజీవి సంక్రాంతి రిలీజ్‌లు ఎప్పుడూ ముందుంటాయి. అందుకే తెలుగు చలనచిత్ర చరిత్రలో సంక్రాంతి అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే సంక్రాంతి అనే మాట సువర్ణాక్షరాలతో లిఖించబడింది.