అదిరిపోద్ది సంక్రాంతి అంటున్న అనిల్ రావిపూడి.. నెక్ట్స్ సినిమా టైటిల్ అదేనా.. హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్ట్స్ సినిమాపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. వరసగా విజయాలు వస్తున్న తరుణంలో ఒక్క తప్పటడుగు పడినా కూడా అసలుకే మోసం వస్తుంది.
Anil Ravipudi Movie Making Strategy With Star Heros
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్ట్స్ సినిమాపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. వరసగా విజయాలు వస్తున్న తరుణంలో ఒక్క తప్పటడుగు పడినా కూడా అసలుకే మోసం వస్తుంది. అందుకే తన ట్రాక్ రికార్డు కాపాడుకునే పనిలో ఉన్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నప్పటికీ.. తదుపరి సినిమా ఏది? హీరో ఎవరు? అనే విషయంలో ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అనిల్ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో లాక్ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్. పైగా అనిల్ కూడా నెక్ట్స్ సినిమా గురించి మరికొన్ని రోజుల్లోనే చెప్తాను అంటున్నాడు. ఇప్పటికే నెక్ట్స్ సినిమా కోసం ఐడియా కూడా ఓకే అయిపోయిందని.. కూర్చుని కథ రాయడమే తరువాయి అంటున్నాడు ఈ దర్శకుడు. ఒక్కసారి కథ సిద్ధమైతే హీరో దొరికేస్తాడు. ముందుగా అనిల్ రావిపూడికి నిర్మాతలు సాహు గారపాటి, వెంకట సతీష్ కిలారులతో సినిమా చేసే కమిట్మెంట్ ఉంది.
ఈ ప్రాజెక్ట్ చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఈ కథకు న్యాయం చేసే సరైన హీరో కోసం అనిల్ ఇంకా అన్వేషణలో ఉన్నాడు. ఈ బ్యానర్‌లో సినిమా సెట్ కావాలంటే సరైన హీరో దొరకాల్సిందే, అప్పుడే ఈ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేసే ఆలోచన కూడా బలంగా ఉంది. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. వెంకటేష్ కంటే పెద్ద స్టార్ ఎవరైనా అందుబాటులోకి వస్తే, ఆ పెద్ద హీరోతో సినిమా ముందుగా మొదలవుతుంది. అలా కుదరని పక్షంలో వెంకటేష్ తోనే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ మళ్ళీ జతకట్టాలని ప్లాన్స్ ఉన్నప్పటికీ.. బాలయ్య 2026 వరకు ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి వాయిదా పడింది.
ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కూడా అనిల్ సినిమా చేసే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన అనిల్.. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఆయన ఖాళీగా ఉండి తనకు అవకాశం ఇస్తే కచ్చితంగా చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు వెంకటేష్, రానా హీరోలుగా ఓ మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నాడు అనిల్. పైగా ఇప్పటికే ఇండస్ట్రీలో ఓ నిర్మాత అదిరిపోద్ది సంక్రాంతి అనే టైటిల్ రిజిష్టర్ చేయించాడు. ఇది అనిల్ రావిపూడి కోసమే అనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. మొత్తానికి అనిల్ రావిపూడి చేతిలో పలు ఆప్షన్లు ఉన్నా, ఏ ప్రాజెక్ట్ ముందుగా మొదలవుతుందనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అటు సీక్వెల్, ఇటు కొత్త హీరోల వేట, మరోవైపు పవన్ కళ్యాణ్ వంటి భారీ స్టార్ తో సినిమా… ఇలా ఏది ఫైనల్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.











