అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ, సోషల్ మెసేజ్‌తో కూడిన మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో యాక్షన్ అనిపించుకోబోతున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఊహాగానాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, మే నెలలో ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
"మాస్ యాక్షన్ మీట్స్ క్లాస్ డైరెక్షన్" అంటూ పోస్టర్లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణను కొరటాల శివ ఒక పవర్‌ఫుల్ మాఫియా డాన్ పాత్రలో చూపించబోతున్నారట. బాలయ్య మార్క్ గంభీరమైన డైలాగ్ డెలివరీకి, కొరటాల శివ రాసే పదునైన సంభాషణలు తోడైతే థియేటర్లలో సీట్లు మిగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, సెకండ్ హాఫ్‌లో వచ్చే భారీ యాక్షన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్య విశ్వరూపం చూపించబోతున్నాడని టాక్.
కొరటాల శివ సినిమాల్లో కేవలం యాక్షన్ మాత్రమే ఉండదు, అందులో ఒక బలమైన సామాజిక సందేశం మరియు కుటుంబ అనుబంధాలు ఉంటాయి. ఈ చిత్రాన్ని కూడా ఆయన అదే శైలిలో సిద్ధం చేశాడని మువీ టీం కాన్ఫిడెంట్ గా ఉంది. కేవలం రక్తం చిందించే యాక్షన్ కాకుండా, గుండెకు హత్తుకునే భావోద్వేగాలు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. బాలయ్య గత చిత్రాల్లోని ఊరమాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటూనే, కొరటాల తనదైన క్లాస్ టచ్ ఇవ్వబోతున్నాడట. వచ్చే ఏడాది విడుదలకానున్న ఈ సినిమా గురించి సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఊపందుకుంటున్నాయి.