ఇదే 4DX టెక్నాలజీ.!

బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి నేటి ఐమాక్స్, 4DX వరకు సినిమా ప్రయాణం ఎన్నో అద్భుతమైన మార్పులను చూసింది. ఒకప్పుడు రీల్స్‌తో మొదలైన ప్రయాణం.. సినిమాస్కోప్, విస్టావిజన్, ఈస్ట్‌మన్ కలర్, 35mm ఫిల్మ్, 70mm ఫిల్మ్, 2D, 3D లీగ్‌లను దాటుకుంటూ నేడు సరికొత్త

Post Published By: dialnews
Updated : 4 July 2026, 8:40 PM IST

బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి నేటి ఐమాక్స్, 4DX వరకు సినిమా ప్రయాణం ఎన్నో అద్భుతమైన మార్పులను చూసింది. ఒకప్పుడు రీల్స్‌తో మొదలైన ప్రయాణం.. సినిమాస్కోప్, విస్టావిజన్, ఈస్ట్‌మన్ కలర్, 35mm ఫిల్మ్, 70mm ఫిల్మ్, 2D, 3D లీగ్‌లను దాటుకుంటూ నేడు సరికొత్త సాంకేతికతలతో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో సినిమా రంగంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్న టెక్నాలజీలలో '4DX' అత్యంత అధునాతనమైనదిగా నిలుస్తోంది. చాలామందికి 3D సినిమాల వరకు బాగా తెలుసు కానీ, ఈ 4DX ఫార్మాట్ గురించి ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల్లో అవగాహన పెరుగుతోంది. అసలు ఈ టెక్నాలజీ వెనుక ఉన్న విశిష్టత ఏంటి? ఇది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది? అనే విషయాలు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం కలగకమానదు.

సాధారణంగా 3D సినిమా అంటే థియేటర్లలో ప్రత్యేకమైన కళ్లద్దాలు పెట్టుకోవడం ద్వారా స్క్రీన్‌పై ఉన్న వస్తువులు మన మీదికి వస్తున్నట్లు కనిపిస్తాయి. ఇది కేవలం విజువల్ పరంగా ఒక త్రిల్ ఇస్తుంది. కానీ 4DX టెక్నాలజీ అలా కాదు. 4DX విషయానికి వస్తే, ఇది కేవలం కంటికి కనిపించే విజువల్స్ మాత్రమే కాదు, అంతకు మించి ఒక సరికొత్త శారీరక అనుభూతిని అందిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు స్క్రీన్‌పై జరిగే ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడు స్వయంగా అనుభూతి చెందేలా ఈ టెక్నాలజీ డిజైన్ చేయబడింది. ఇది ప్రేక్షకుడిని నేరుగా ఆ సినిమా ప్రపంచంలోకే తీసుకెళ్లి కూర్చోబెడుతుంది.

సినిమాలో వచ్చే యాక్షన్ సీట్లకు, ఫైట్స్ లేదా రేసింగ్ సీన్లకు తగ్గట్టుగా థియేటర్లలోని సీట్లు కూడా కదులుతాయి. సినిమాలో వర్షం పడితే థియేటర్లలో ఉన్న ప్రేక్షకులపై నిజంగానే నీటి చినుకులు పడతాయి. సీన్లలో గాలి వీచడం, బాంబులు పేలినప్పుడు పొగ రావడం వంటివి లైవ్‌లో జరుగుతాయి. సినిమాలో చూపించే వాతావరణాన్ని బట్టి రకరకాల సువాసనలు, లేదా సీన్‌ను బట్టి దుర్వాసనలు కూడా థియేటర్‌లో వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రేక్షకుడు కేవలం సినిమాను చూసేవాడిగా కాకుండా.. ఆ సినిమాలో జరుగుతున్న కథలో తానే స్వయంగా ఒక పాత్రలా ఉన్నాననే అద్భుతమైన భ్రమను ఈ ఫార్మాట్ కలిగిస్తుంది. దీనినే 'ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్' అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం జపాన్ వంటి దేశాల్లో ఈ టెక్నాలజీ ఇప్పటికే విస్తృతంగా ఆచరణలో ఉంది. ఇంతటి అద్భుతమైన ఎఫెక్ట్స్ ఇచ్చే 4DX సినిమాలను ఏవైనా ప్రత్యేకమైన 4DX కెమెరాలతో షూట్ చేస్తారా? అంటే.. అదేం లేదు.

సినిమాలను నార్మల్ కెమెరాలతోనే షూట్ చేస్తారు. కానీ, సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత 'పోస్ట్ ప్రొడక్షన్' టైమ్‌లో దీనికి సంబంధించిన అసలు పని మొదలవుతుంది. ముఖ్యంగా ఎడిటింగ్ సమయంలో 4డిఎక్స్ ఎఫెక్ట్స్ నిపుణులు రంగంలోకి దిగుతారు. వారు సినిమాలో ఉన్న ప్రతి సన్నివేశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. స్క్రీన్‌పై వచ్చే యాక్షన్‌కు తగ్గట్టుగా ప్రేక్షకుడు థియేటర్ సీట్లో కూర్చుని ఆ పాత్రను ఎలా ఫీల్ అవ్వాలో ప్లాన్ చేస్తారు. అందుకోసం థియేటర్ పరికరాలను కంట్రోల్ చేసేలా ప్రత్యేక కోడింగ్ చేస్తారు. ఈ కోడింగ్ ద్వారానే థియేటర్‌లోని సీట్లు కదలడం, గాలి రావడం, నీళ్లు చల్లడం వంటివన్నీ స్క్రీన్‌పై సీన్‌తో సింక్ అవుతాయి. అందుకే ప్రేక్షకులకు 4DX ఎక్స్‌పీరియన్స్ చాలా త్రిల్లింగ్‌గా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ఫార్మాట్ లో వచ్చే సినిమాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Published : 
  • 4 July 2026, 8:40 PM IST