రామ్ చరణ్ పెద్దికి రంజాన్ గండం.. రెహ‌మాన్ దెబ్బ.. ఏప్రిల్ 30 టార్గెట్ రీచ్ అవుతారా..?

రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు పెద్ది సినిమా కోసమే వేచి చూస్తున్నారు. ఆ సినిమాను అనుకున్న టైమ్ కంటే కాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నా కూడా.. పోస్ట్ పోన్ గ్యాప్ ఎక్కువగా లేదు కదా అని సర్దుకుంటున్నారు.

Post Published By: dialnews
Updated : 10 February 2026, 8:27 AM IST

రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు పెద్ది సినిమా కోసమే వేచి చూస్తున్నారు. ఆ సినిమాను అనుకున్న టైమ్ కంటే కాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నా కూడా.. పోస్ట్ పోన్ గ్యాప్ ఎక్కువగా లేదు కదా అని సర్దుకుంటున్నారు. కానీ ఇప్పుడు మరో న్యూస్ వాళ్లను బాగా కంగారు పెడుతుంది. ఈ సినిమాపై మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా ఫస్టాఫ్ లాక్ చేసేశారని, క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తి చేసి ఎడిటింగ్ కూడా ఫినిష్ చేశారని తెలుస్తుంది. అవుట్‌పుట్ విషయంలో చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కెరీర్‌లో బిగ్టెస్ట్ హిట్ అయ్యే అన్ని లక్షణాలు పెద్ది సినిమాకు ఉన్నాయని నమ్ముతున్నారు మేకర్స్. పైగా చరణ్ కూడా బుచ్చిబాబు మేకింగ్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. రంగస్థలంను కూడా మించిపోతుందని హామీలు ఇస్తున్నాడు. నటుడిగా తనను మరో మెట్టు ఎక్కించే సినిమా ఇది అవుతుందని నమ్ముతున్నాడు మెగా వారసుడు.

అన్నీ ఉన్నాయి కానీ సినిమా పనులు ఎంత వేగంగా జరుగుతున్నా.. మ్యూజిక్ సిట్టింగ్స్ దగ్గరే ఒక చిన్న ఇబ్బంది వచ్చి పడింది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇక్కడే మేకర్స్‌కి టెన్షన్ మొదలైంది. రంజాన్ మాసం సమీపిస్తుండటంతో, రెహమాన్ షెడ్యూల్స్ దొరకడం ఇప్పుడు కష్టంగా మారింది. సాధారణంగా రంజాన్ సమయంలో ఆయన వర్క్ చేయడానికి అస్సలు ఇష్టపడరు, పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రంజాన్ నెల వచ్చిందంటే వర్క్‌కు సెలవిచ్చేస్తుంటారు. అందుకే ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు రంజాన్ కంటే ముందే తమ వర్క్స్ పూర్తి చేస్తుంటారు. ఫిబ్రవరి 18 నుంచే రంజాన్ మొదలు కాబోతోంది.

ఇక్కడే పెద్ది సినిమా మేకర్స్‌కు కంగారు పట్టుకుంది. రెహమాన్ చేతిలో కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకవేళ రంజాన్ మొదలైతే, ఆయన తిరిగి వర్క్ మోడ్‌లోకి రావడానికి కచ్చితంగా నెల రోజులు పడుతుంది. ఈ గ్యాప్ వస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు పెద్ద బ్రేక్ పడినట్టే. అందుకే ఈ లోపే వీలైనంత వరకు రీ-రికార్డింగ్ పనులు పూర్తి చేయించే పనిలో చిత్ర బృందం బిజీగా ఉంది. నిర్మాతలు ఈ సినిమాను ఏప్రిల్ 30న గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తేదీకి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే, ఇప్పుడు ఏ మాత్రం సమయం వృథా చేయకుండా వేగంగా పని చేయాల్సిందే. రెహమాన్ నుండి రీ-రికార్డింగ్ కంటెంట్ ఎంత త్వరగా వస్తే, ఫైనల్ మిక్సింగ్ అంత త్వరగా పూర్తవుతుంది. ప్రస్తుతానికి పెద్ది టీమ్ రేయింబవళ్లు కష్టపడుతోంది. కానీ షెడ్యూల్ ఏ మాత్రం అటూ ఇటైనా సినిమా వాయిదా పడక తప్పదు అనే టాక్ వినిపిస్తోంది. రంజాన్ బ్రేక్ కంటే ముందే రెహమాన్ మ్యాజిక్ పూర్తవుతుందా? లేక రిలీజ్ డేట్ మారుతుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Published : 
  • 10 February 2026, 8:27 AM IST