టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవ్వడం మరియు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచింది. మొదట ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు.
అయితే, యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా వాయిదా పడటంతో, ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సినిమాను ఒక వారం ముందే, అంటే మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.సెన్సార్ బోర్డ్ నుండి వస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, సినిమా అవుట్‌పుట్ చాలా పవర్‌ఫుల్‌గా వచ్చిందని టాక్ వినిపిస్తోంది.
అయితే, సెన్సార్ బోర్డు ఇటీవల సినిమాల టైటిల్స్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో కొన్ని సినిమాల పేర్లలో 'బల్వంత్' వంటి పదాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లే, 'ఉస్తాద్ భగత్ సింగ్' టైటిల్ విషయంలో కూడా చిన్నపాటి చర్చలు నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాకపోతే, మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుని క్లీన్ సర్టిఫికేట్‌తో లేదా ఆశించిన సర్టిఫికేట్‌తో సినిమాను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ ఏమిటంటే.. పాటలు డీఎస్పీ ఇవ్వగా, బిజీయం మాత్రం తమన్ అందిస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల కాంబినేషన్ సినిమాకు అతిపెద్ద ఎస్సెట్ కాబోతోంది.
డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రంపై స్పందిస్తూ.. ఇది కేవలం పాలిటిక్స్ ఆధారంగా సాగే సినిమా కాదని, పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ అని క్లారిటీ ఇచ్చారు. సినిమా ప్రారంభంలోనే ఈ చిత్రానికి 'భగత్ సింగ్' అనే పేరు ఎందుకు పెట్టామో ప్రేక్షకులకు అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. శ్రీలీల మరియు రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి, 'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ పనులు ముగించుకుని, మార్చి 19న బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయడానికి సిద్ధమవుతోంది.