తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న వారణాసి సినిమా గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక భారీ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 24 నుంచి 26 వరకు మెక్సికోలో జరగనున్న కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్ వేడుకలో 'వారణాసి' చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను ప్రదర్శించనున్నారు. సాధారణంగా హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ఉండే క్రేజ్ ఈ చిత్రానికి ఉండబోతోందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. కీలకమైన సన్నివేశాలతో కూడిన గ్లింప్స్ మొదలైన వాటిని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఈ ఈవెంట్‌కు కార్తికేయ నేరుగా హాజరుకానుండగా, జక్కన్న రాజమౌళి ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా అక్కడి అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సినిమా అడవి నేపథ్యంగా సాగే ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ అని రాజమౌళి ఇప్పటికే క్లూ ఇచ్చారు. భారతీయ పురాణాలకు, ఆధునిక సాంకేతికతకు ముడిపెడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'వారణాసి' అనే టైటిల్ వింటుంటేనే ఈ సినిమాలో ఆధ్యాత్మిక కోణం లేదా పురాతన రహస్యాల ఛేదన ఉంటుందని అర్థమవుతోంది. హాలీవుడ్ క్లాసిక్ 'ఇండియానా జోన్స్' తరహాలో మహేష్ బాబు క్యారెక్టర్ గ్లోబ్ ట్రాటింగ్ సాహసికుడిగా కనిపిస్తారని సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ మరియు ఇతర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్స్ జరుగుతున్నాయి.
మహేష్ బాబు ఈ సినిమా కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే కాకుండా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో IMAX ఫార్మాట్లో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. రాజమౌళి తన గత చిత్రాలైన బాహుబలి, RRR లతో నెలకొల్పిన రికార్డులను ఈ సినిమాతో తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భారతీయ సినిమా సత్తాను గ్లోబల్ వేదికపై చాటి చెప్పేందుకు రాజమౌళి అమ్ములపొది నుంచి వస్తున్న మరో బ్రహ్మాస్త్రం ఈ 'వారణాసి'. మెక్సికో కామిక్ కాన్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం మహేష్ బాబు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరి జక్కన్న ఈసారి ఎలాంటి విజువల్ వండర్‌ను మనకు చూపిస్తారో వేచి చూడాలి.