నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటూ, కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఆయన కెరీర్ లోని 111వ సినిమా ఒకటి. తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'వీరసింహారెడ్డి' చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్ చల్ చేస్తోంది. బాలయ్య తన గత చిత్రాల రొటీన్ ట్రెండ్ కి ఈ సినిమాతో బ్రేక్ వేసినట్టుగా గట్టి టాక్ వినిపిస్తోంది.
గత కొన్నేళ్లుగా బాలకృష్ణ సినిమాలను గమనిస్తే.. ఆయన కంబ్యాక్ చిత్రం ‘అఖండ’ నుంచి మొన్నటి వరకు వచ్చిన సినిమాల్లో దాదాపుగా డ్యూయల్ రోల్స్ లేదా కనీసం డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే కనిపిస్తూ వచ్చారు. అఖండ’ లో అఖండ, మురళీకృష్ణగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆ తర్వాత వచ్చిన 'వీరసింహారెడ్డి' సినిమాలోనూ తండ్రి, కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో నటించి థియేటర్లలో పూనకాలు తెప్పించారు. బాలయ్య డ్యూయల్ రోల్స్ చేస్తే సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయం అనే సెంటిమెంట్ కూడా టాలీవుడ్ లో బలంగా నాటుకుపోయింది. అభిమానులు కూడా ఆయనను ఒకటి కంటే ఎక్కువ షేడ్స్ లో చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఆ తర్వాత వచ్చిన ‘భగవంత్ కేసరి’, అలాగే బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘డాకు మహారాజ్’ చిత్రాల్లో బాలకృష్ణ నేరుగా డ్యూయల్ రోల్స్ చేయనప్పటికీ.. ఒకే పాత్రలో రెండు వేర్వేరు వేరియేషన్స్ ని సెట్ చేశారు.
ఫ్లాష్ బ్యాక్ లో ఒకలా, ప్రెజెంట్ లో మరోలా కనిపించి ప్రేక్షకులను అలరించారు. అంటే, డ్యూయల్ రోల్ లేకపోయినా పాత్రలో రెండు భిన్నమైన షేడ్స్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇలా గత నాలుగు చిత్రాలుగా ఏదో ఒక రూపంలో డ్యూయల్ రోల్స్ లేదా డ్యూయల్ షేడ్స్ తోనే సినిమాలు వస్తూ ఉండటంతో, ఇది ఒక రొటీన్ ట్రెండ్ లా మారిపోయింది.అయితే, ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 111వ సినిమాలో బాలయ్య ఈ రొటీన్ ట్రెండ్ కి పూర్తిగా బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఎలాంటి డ్యూయల్ రోల్స్ గానీ, భిన్నమైన వేరియేషన్స్ గానీ చేయడం లేదట. కేవలం ఒకే ఒక్క షేడ్ లో, సింగిల్ క్యారెక్టర్ లోనే బాలయ్య ఈసారి కనిపించనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. సినిమా మొత్తం ఒకే క్యారెక్టరైజేషన్ తో సాగుతుందని సమాచారం.
ఎలాంటి ఫ్లాష్ బ్యాక్ లు, లుక్ ఛేంజ్ లు లేకుండా ఒకే షేడ్ లో మెప్పించడం అనేది బాలయ్య నెక్స్ట్ సినిమాకి డెఫినెట్ గా ఒక కొత్త స్టెప్ అని చెప్పాలి. సాధారణంగా మాస్ సినిమాల్లో హీరోలకు రెండు షేడ్స్ ఉంటేనే ఎలివేషన్లు ఇవ్వడం సులువవుతుంది. మరి ఇవేమీ లేకుండా కేవలం ఒకే ఒక్క షేడ్ తో గోపీచంద్ మలినేని బాలయ్యను ఎలా చూపించబోతున్నారు? బాలయ్య క్యారెక్టర్ ని ఏ రేంజ్ లో డిజైన్ చేశారు? అనే దానిపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. దీనిపై మరికొద్ది రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది. ఇకపోతే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ లేదా వృద్ధి సినిమాస్ నిర్మాణ రంగంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ట్రెండ్ మార్చిన నటసింహం ఈ సరికొత్త ప్రయోగంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.