కొన్నిసార్లు మనకు తెలియని విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏం జరిగినా క్షణాల్లోనే అంతా వైరల్ అవుతుంది కానీ అప్పుడలా కాదు కదా.. అలాంటి సంఘటనే కమల్ హాసన్ జీవితంలో జరిగింది. అది 1986, సెప్టెంబరు 29 ఉదయం.. చెన్నైలోని తన ఇంటి నుంచి ముంబై ప్రయాణానికి బయలుదేరిన కమల్ హాసన్.. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఆల్వార్‌పేటలోని తన ఆఫీసుకు ఫోన్ చేశారు. అటువైపు ఉన్న మేనేజర్ ఆశ్చర్యపోతూ.. అప్పుడే బొంబాయి చేరుకున్నారా సార్? అని ప్రశ్నించారు. దానికి కమల్ హాసన్ బదులిస్తూ.. నేను బొంబాయికి కాదు, పరలోకానికి చేరుకోవలసిన వాడిని. జరగాల్సిన విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మన అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాం అని ఎయిర్‌పోర్ట్ నుండే సమాధానం ఇచ్చాడు. కారు పంపిస్తానన్న మేనేజర్ మాటను సున్నితంగా తిరస్కరిస్తూ, కమల్ టాక్సీలోనే ఇంటికి బయలుదేరాడు.
సరిగ్గా కమల్ ఫోన్ చేయడానికి గంట ముందు ఒక భయానక సంఘటన జరిగింది. మద్రాసు మీనంబాకం విమానాశ్రయం నుండి 185 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో బొంబాయికి బయలుదేరిన విమానం.. గాల్లోకి లేచిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. విమానంలో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం ముంచుకొచ్చింది. అయితే పైలట్ అత్యంత చాకచక్యంతో వ్యవహరించి విమానాన్ని అత్యవసరంగా క్రాష్ ల్యాండ్ చేయించారు. ఆ పైలట్ సమయస్ఫూర్తి వల్ల విమానంలోని ప్రయాణికులందరూ పెను ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఆ ప్రమాదానికి గురైన విమానంలో కమల్ హాసన్‌తో పాటు నటీమణులు శ్రీప్రియ, అంజలీ నాయుడు కూడా ఉన్నారు. మంటలు, పొగలతో నిండిన ఆ భయంకరమైన క్షణాల్లో కమల్ తన ప్రాణాల గురించి మాత్రమే ఆలోచించలేదు. తోటి ప్రయాణికులకు ధైర్యం చెబుతూ.. ఎమర్జెన్సీ ద్వారం ద్వారా వాళ్ళని క్షేమంగా బయటకు పంపడంలో సహాయపడ్డాడు. వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ ఆపద సమయాల్లో మనుషులకు అండగా నిలిచి ఆయన నిజమైన హీరో అనిపించుకున్నాడు.
విమానాశ్రయం నుంచి టాక్సీలో ఇంటికి వెళ్తున్నప్పుడు.. డ్రైవర్ ఆసక్తిగా ప్రమాద వివరాలు అడగడంతో కమల్ వివరించడం మొదలుపెట్టాడు. తన వెనుక సీట్లో కూర్చున్నది ఒక ప్రముఖ నటుడని, పైగా ఆయన అంతటి ప్రమాదం నుంచి బయటపడి ఆ వివరాలు చెబుతున్నాడని ఆ డ్రైవర్ ఉత్కంఠకు లోనయ్యాడు. ఆ ఆసక్తిలో, గర్వంలో డ్రైవర్ ఏమరుపాటుగా ఉండి టాక్సీని తీసుకెళ్లి నేరుగా ఒక స్తంభానికి గుద్దేశాడు. దీంతో కమల్ నవ్వుతూ.. బాబూ.. నాకు ప్రమాదం మీద ప్రమాదం జరుగుతోంది. విమాన ప్రమాదం ఎలాగూ అంతర్జాతీయ వార్తల్లోకి వస్తుంది.. నువ్వు కూడా పేపర్లో ఎక్కుదామనుకున్నావా? అని డ్రైవర్ భుజం తట్టి, ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి క్షేమంగా చేరుకున్నాక.. తనను పలకరించిన వాళ్ళతో మాట్లాడుతూ.. ఈ ఒక్క రోజే నేను రెండు పునర్జన్మలు ఎత్తానంటూ చమత్కరించాడు కమల్. ఉదయం విమాన ప్రమాదం నుండి, ఆ వెంటనే టాక్సీ ప్రమాదం నుండి క్షేమంగా బయటపడిన కమల్ హాసన్ నిజంగా మృత్యుంజయుడే. విధి నిర్వహించిన ఈ పరీక్షలో ఆయన తన ధైర్యంతో మృత్యువును జయించి నిలిచాడు.