కొందరు హీరోలు ఇండస్ట్రీ మీద, ప్రేక్షకుల మీద తెలియకుండానే పెద్ద ముద్ర వేస్తుంటారు. అలా వేసిన హీరోనే ఉదయ్ కిరణ్.. ఈయన చనిపోయి 12 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన్ని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ఆయన నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే సినిమాను మొన్న వాలెంటైన్స్ డే సందర్భంగా రీ-రిలీజ్ చేసారు. థియేటర్లలో ఈ సినిమా పండుగ వాతావరణం తీసుకొచ్చింది. దాదాపు 25 ఏళ్ళ తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా ఉదయ్ అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఉదయ్ కిరణ్ మన మధ్య లేకపోయినా.. ఆయన నటించిన సినిమాలు, ఆయన జ్ఞాపకాలు ప్రేక్షకుల హృదయాల్లో ఎంత బలంగా ఉన్నాయో ఈ రీ-రిలీజ్ మరోసారి నిరూపించింది. ప్రధాన థియేటర్లలో సినిమా ప్రదర్శన సమయంలో అభిమానుల సందడి ఆకాశన్నంటింది. పైగా ఈ సినిమా కోసం ఆయన మేన కోడలు, మేనల్లుడు, అక్క అందరూ వీడియో బైట్స్ ఇచ్చారు. మనసంతా నువ్వే సినిమాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం కలిసొచ్చింది.
తూనీగ తూనీగ, చెప్పవే ప్రేమ వంటి ఎవర్‌గ్రీన్ పాటలు స్క్రీన్ మీద వస్తుంటే ఫ్యాన్స్ సీట్లలో కూర్చోలేకపోయారు. స్క్రీన్ ముందు డాన్సులు చేస్తూ, పేపర్లు చల్లుతూ తమ అభిమాన హీరోను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది ఒక పాత సినిమా రీ-రిలీజ్‌లా కాకుండా, స్టార్ హీరో కొత్త సినిమా విడుదలైనంత కోలాహలంగా సాగడం విశేషం. అంతేకాదు థియేటర్లలో సీన్ రీ క్రియేషన్ కూడా జరిగింది. సినిమాలో బాగా పాపులర్ అయిన సునీల్ ఇడ్లీ సీన్ రీ క్రియేట్ చేసారు ఫ్యాన్స్. మనిషన్న వాడు ఇన్ని ఇడ్లీలు తింటాడా.. ఒకటి తీసేయ్ అని సునీల్ చెప్పే డైలాగ్‌ను అభిమానులు రీ క్రియేట్ చేసారు. అంతేకాదు.. పాటలకు డాన్సులు చేస్తూ కేరింతలు వేసారు. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ అంటూ థియేటర్లలో మార్మోగిన నినాదాలు ఉదయ్ కిరణ్ స్టామినాను గుర్తుచేశాయి. ఉదయ్ కిరణ్ చనిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా, ఆయనపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని ఈ స్పందన తెలియజేస్తోంది. ఆ నవ్వు, ఆ అమాయకత్వం, ఆ నటన ఇవన్నీ ఇప్పటికీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
రీ రిలీజ్‌లోనూ చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం ఉదయ్ కిరణ్ సంపాదించుకున్న చెరగని ఇమేజ్‌కు నిదర్శనం. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. 2001లో విడుదలైన మనసంతా నువ్వే అప్పట్లో ఒక సంచలనం. కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా 16 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు రీ-రిలీజ్‌లో కూడా అదే స్థాయి ఊపును కొనసాగిస్తూ, కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతోంది. అప్పట్లో యూత్‌ని ఉర్రూతలూగించిన ఈ సినిమా, నేటి తరం ప్రేక్షకులను కూడా అంతే ఆకట్టుకోవడం విశేషం. మొత్తానికి మనసంతా నువ్వే రీ-రిలీజ్ అనేది కేవలం ఒక సినిమా ప్రదర్శన మాత్రమే కాదు, అది ఉదయ్ కిరణ్‌కు అభిమానులు ఇచ్చిన ఒక ఘన నివాళి. ఎమోషనల్ క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకుంటూ, బరువెక్కిన గుండెతో బయటకు వచ్చిన ప్రేక్షకులు.. ఉదయ్ కిరణ్ ఎప్పటికీ తమ గుండెల్లో మనసంతా నువ్వే అంటూ నిలిచిపోతాడని చాటిచెప్పారు. భౌతికంగా దూరమైనా, వెండితెరపై ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే.