మొన్న జీవి ప్రకాష్ కుమార్.. నిన్న లోకేష్ కనకరాజ్.. నేడు దేవీ శ్రీ ప్రసాద్.. ఇదే ట్రెండ్..!
సౌత్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు హీరోలు డైరెక్టర్లుగా మారడం మనం చూశాం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
సౌత్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు హీరోలు డైరెక్టర్లుగా మారడం మనం చూశాం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అద్భుతమైన కథలను వెండితెరపై ఆవిష్కరించే దర్శకులు మరియు మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు స్వయంగా హీరోలుగా మారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కేవలం టాలెంట్ మాత్రమే కొలమానంగా మారిన ఈ రోజుల్లో, మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వస్తున్న ఈ క్రియేటర్స్ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ లిస్టులో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు లోకేష్ కనకరాజ్. తన సినిమాటిక్ యూనివర్స్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్.. ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఆల్రెడీ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు లోకేష్. అరుణ్ మాతేశ్వరుణ్ ఈ సినిమాకు దర్శకుడు.
అలాగే టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ కొట్టిన యువ దర్శకుడు అభిషన్ జీవంత్ కూడా హీరో అవతారం ఎత్తాడు. ఆయన విత్ లవ్ అనే సినిమాతో లీడ్ రోల్‌లో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ట్రెండ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే సినిమాతో తను అద్భుతమైన దర్శకుడినే కాదు.. అంతకు మించిన మంచి నటుడిని అని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ ఒక్క సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్, ఇప్పుడు కోలీవుడ్‌లో బిజీ హీరోగా మారిపోయాడు. దర్శకుడిగా తన విజన్ ఎంత క్లియర్‌గా ఉంటుందో.. నటుడిగా తన ఎక్స్ ప్రెషన్స్ కూడా అంతే నేచురల్‌గా ఉంటాయని ప్రదీప్ నిరూపించాడు. వరుసగా మూడు విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వరుసగా మూడుసార్లు 100 కోట్లు వసూలు చేసిన హీరోగా చరిత్ర సృష్టించాడు.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ల విషయానికి వస్తే.. జీవీ ప్రకాష్ కుమార్ ఎప్పుడో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ను, ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. సంగీత దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నా, హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇదే బాటలో ఇప్పుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కూడా చేరాడు. ఎన్నో ఏళ్లుగా తన ఎనర్జీతో స్టేజ్‌లను దడదడలాడించే డిఎస్పి.. ఎల్లమ్మ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొత్తానికి ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టుల హవా నడుస్తోంది. కథలో కంటెంట్ ఉంటే చాలు.. తెరపై కనిపించేది స్టార్ హీరోనా లేక కొత్తవారా అని చూడకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ వల్ల ఇండస్ట్రీకి ఫ్రెష్ టాలెంట్ దొరకడమే కాకుండా.. వినూత్నమైన కథలు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఈ టెక్నీషియన్లు హీరోలుగా ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి.











