మెగా ఇంట డబుల్ ధమాకా.. నెరవేరిన చిరు కోరిక.. రామ్ చరణ్ కు కవలలు..!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు, మెగా కుటుంబానికి ఇది నిజంగా పండగ రోజే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట డబుల్ ధమాకా మోగింది.

Post Published By: dialnews
Updated : 1 February 2026, 11:36 AM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు, మెగా కుటుంబానికి ఇది నిజంగా పండగ రోజే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట డబుల్ ధమాకా మోగింది. వీరి దాంపత్య జీవితంలోకి కవలలు ఒక పాప, ఒక బాబు ప్రవేశించారు. ఇప్పటికే మెగా ప్రిన్సెస్ క్లింకారా అల్లరితో సందడిగా ఉన్న కొణిదెల వారి ఇల్లు.. ఇప్పుడు ఇద్దరు కొత్త చిన్నారుల రాకతో కళకళలాడుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవికి తన వారసుడు రామ్ చరణ్ కు ఒక మగ సంతానం కలగాలనే కోరిక బలంగా ఉండేది. క్లింకారా పుట్టినప్పుడు ఎంతో సంబరపడినా, మనసులో ఎక్కడో ఒక మూల మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే మగ వారసుడు ఉంటే బాగుణ్ణు అని ఆయన భావించేవారు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో పరోక్షంగా బయటపెట్టారు కూడా.

రామ్ చరణ్ కు అబ్బాయి పుడితే చూడాలని చాలా ఏళ్లుగా ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోరిక కవలల రూపంలో తీరడంతో మెగాస్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. గతంలో చిరంజీవి తన ఇంటి గురించి చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. తన కూతుళ్లు సుస్మిత, శ్రీజల పిల్లలు, ఆ తర్వాత క్లింకారా.. ఇలా అంతా ఆడపిల్లలే ఉండటంతో.. ఇంటికి వెళ్తే లేడీస్ హాస్టల్ లా ఉంటుందని ఆయన చమత్కరించాడు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడమే కాకుండా, కొందరి నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నాయి. కానీ అది కేవలం ఒక తాతగా మనవడిపై ఉన్న మమకారంతో అన్న మాటే తప్ప, ఆడపిల్లలంటే ఇష్టం లేక కాదని మెగా సన్నిహితులు అప్పట్లో సర్దిచెప్పారు. ఇన్నాళ్లకు ఆ నిరీక్షణ ఫలించింది. రామ్ చరణ్ కు ఇప్పుడు ఒకేసారి అమ్మాయి, అబ్బాయి పుట్టడంతో చిరంజీవి కోరుకున్న ఆ మెగా వారసుడు వచ్చేశాడు. అటు క్లింకారాకు తోడుగా చెల్లి, ఇటు మెగా లెగసీని కొనసాగించే తమ్ముడు రావడంతో మెగా ఫ్యామిలీ పిక్చర్ పర్ఫెక్ట్ గా మారింది.

మూడు తరాల మెగా అభిమానులు ఈ వార్త వినగానే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. కొణిదెల వంశానికి కాబోయే కింగ్ వచ్చాడంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కవలలు పుట్టారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్లింకారా పుట్టిన మూడేళ్లకే మళ్లీ మెగా ఇంట చంటిపిల్లల ఏడుపులు వినిపించడం, అందులోనూ అబ్బాయి కూడా ఉండటంతో చిరంజీవి ఎమోషనల్ అయ్యారని సమాచారం. మొత్తానికి మెగా ఇంట్లో వారసుడి లోటు తీరిపోయిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Published : 
  • 1 February 2026, 11:36 AM IST