ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత.. ఏమేం చేశారంటే..!
తెలుగు సినీ, టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు నల్లూరి సుధీర్ కుమార్ జనవరి 29 ఉదయం కన్నుమూశారు.
తెలుగు సినీ, టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు నల్లూరి సుధీర్ కుమార్ జనవరి 29 ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. రేడియో, టెలివిజన్, సినిమా.. ఇలా మూడు విభిన్న మాధ్యమాల్లో సంగీత దర్శకుడిగా రాణించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ కుమార్ మరణం పట్ల పరిశ్రమ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సుధీర్ కుమార్, చిన్నప్పటి నుంచే సంగీతంపై ఉన్న మక్కువతో పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుని అక్కడే స్థిరపడ్డారు.
ఆయన కెరీర్ ప్రధానంగా దూరదర్శన్ స్వర్ణయుగంలో వెలుగు వెలిగింది. ముఖ్యంగా 1986 నుండి 2000 మధ్య కాలంలో దూరదర్శన్‌లో ప్రసారమైన అనేక సీరియళ్లకు, లలిత గీతాలకు ఆయన స్వరాలు సమకూర్చారు. ఆ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన, బిజీగా ఉండే సంగీత దర్శకులలో ఆయన ఒకరిగా నిలిచారు. కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా వెండితెరపై కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. అగ్ని ప్రవేశం, కూతురు, అమ్మో అల్లుడా వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన టీవీ సీరియల్స్‌కు సంగీతం అందించిన సుధీర్ కుమార్, తన అద్భుతమైన పనితీరుకు నిదర్శనంగా అనేక అవార్డులను మరియు రివార్డులను సొంతం చేసుకున్నారు.
ఆయన సంగీతం సమకూర్చిన అనేక సీరియల్ టైటిల్ సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచే ఉన్నాయి. సుధీర్ కుమార్ అకాల మరణం పట్ల తెలుగు సినీ, టీవీ ప్రముఖులు, గాయనీ గాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, దూరదర్శన్ రోజుల్లో ఆయన సృష్టించిన మ్యూజికల్ హిట్‌లను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన స్వరపరిచిన పాటల ద్వారా సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అభిమానులు పేర్కొంటున్నారు.









