కోహ్లీ ఇన్ స్టా అకౌంట్ మాయం… కొన్ని గంటల తర్వాత ప్రత్యక్షం…!

టీమిండియా లెజెండరీ క్రికెటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హఠాత్తుగా మాయమవ్వడం ప్రపంచవ్యాప్తంగా పెనుసంచలనం రేపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2026 | 10:35 AMLast Updated on: Jan 31, 2026 | 10:35 AM

Kohlis Instagram Account Disappeared Only To Reappear A Few Hours Later

టీమిండియా లెజెండరీ క్రికెటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హఠాత్తుగా మాయమవ్వడం ప్రపంచవ్యాప్తంగా పెనుసంచలనం రేపింది. సుమారు 274 మిలియన్ల ఫాలోవర్లతో ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన కోహ్లీ అకౌంట్.. గత అర్ధరాత్రి నుంచి యూజర్ నాట్ ఫౌండ్ అని చూపించడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే కొన్ని గంటల తర్వాత అకౌంట్ తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.కింగ్ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్ మాయమవ్వడంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడిచాయి. మెటా ప్లాట్‌ఫారమ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల అకౌంట్ తాత్కాలికంగా కనిపించకుండా పోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనా. గతంలోనూ కొందరు సెలబ్రిటీలు ఏదైనా కొత్త బ్రాండ్ లాంచ్ చేసే ముందు అకౌంట్స్ డీయాక్టివేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కోహ్లీ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు. విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ అకౌంట్ కూడా అదే సమయంలో కనిపించకపోవడం సస్పెన్స్‌ను మరింత పెంచింది.

విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కేవలం ఫోటోలు పంచుకునే వేదిక మాత్రమే కాదు, అది ఒక భారీ డిజిటల్ సామ్రాజ్యం. తాజా నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు సుమారు 12 కోట్ల నుంచి 14 కోట్ల వరకు వసూలు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రిటీల జాబితాలో విరాట్ కోహ్లీ 14వ స్థానంలో ఉన్నాడు. క్రీడా ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ వంటి దిగ్గజాల తర్వాత అత్యధిక డిజిటల్ బ్రాండ్ వాల్యూ కలిగిన క్రీడాకారుడు కోహ్లీనే. కేవలం ఒక పోస్ట్‌తో మిలియన్ల మందికి చేరువయ్యే శక్తి ఉండటంతో, పూమా, హెచ్‌ఎస్‌బీసి వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లు విరాట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న కోహ్లీ, మైదానంలోనూ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 124 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన 54వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కొద్దిరోజుల పాటు కైవసం చేసుకున్నాడు. గత 9 వన్డేల్లో 616 పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. త్వరలోనే ఐపీఎల్ 2026 కోసం భారత్‌కు రానున్నాడు.