Top story:మౌనమేలనోయి…. పవన్? పవన్ కళ్యాణ్ మౌనం వ్యూహమా? భయమా?

జనసేన పార్టీలోనూ..... కూటమి ప్రభుత్వంలోనూ రోజురోజుకీ బయట పడుతున్న సంక్షోభాలు, సమస్యల పై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2026 | 10:00 AMLast Updated on: Jan 31, 2026 | 10:00 AM

Why This Silence Pawan Is Pawan Kalyans Silence A Strategy Or A Sign Of Fear

జనసేన పార్టీలోనూ….. కూటమి ప్రభుత్వంలోనూ రోజురోజుకీ బయట పడుతున్న సంక్షోభాలు, సమస్యల పై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఒకప్పటిలా ఆయన ఫైర్ ఫైర్స్ ద ఫైర్…. ఐ యాం ద ఫైర్… అంటూ ఎందుకు చెలరేగి పోవడం లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది అనుకుంటున్నారా?
లేక ఏం మాట్లాడితే ఏమొస్తుందో ఎందుకులే అని తప్పించుకుంటున్నారా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

కూటమి సర్కారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ దూసుకెళ్లిపోతున్నారు. అటు పెట్టుబడుల వేటలో గాని…. పాలన వ్యవహారాల్లో గాని, పార్టీ కార్యక్రమాల్లో గాని ఎటు చూసినా చంద్రబాబు లోకేష్ లే కనబడుతున్నారు. కానీ జనసేన అధినేత డీసీఎం పవన్ కళ్యాణ్ మాత్రం జరుగుతున్న పరిణామాలు, పార్టీ నేతల వ్యవహారాలతో ఎందుకో అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ తర్వాత ద్వితీయ శ్రేణిలో లో సరైన నాయకత్వం లేకపోవడం…. ఏ సంక్షోభం వచ్చినా… వెంటనే పరిష్కరించే సమర్థులు కరువైపోవడంతో…. ఎక్కడ సమస్యలను అక్కడే పడేసి కాలమే పరిష్కరించుకుంటుందిలే అని పవన్ వదిలేసినట్లుంది.ఇటీవల జనసేన నేతలపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి.7 …..8 మంది ఎమ్మెల్యేలు ఓపెన్ కరప్షన్ చేస్తున్నారని విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. దానిపై పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించలేదు. సరి కదా ఆ ఎమ్మెల్యేలపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని గట్టి వార్నింగు ఇవ్వలేదు.

పార్టీలో ముఖ్య నేతలు కొందరు అధినేతకు తలనొప్పిగా మారిపోయారు. కాళహస్తి కి చెందిన వినూత దంపతులు ఏకంగా మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. తమని టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ కేసులో ఇరికించాడంటూ బహిరంగం గానే ఆరోపించారు వినూత. దానిపై పవన్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.ఇక తిరుపతిలో కిరణ్ రాయల్ అక్రమ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక మహిళ కిరణ్ తనతో ఉన్న వీడియోలు ,ఆడియోలతో బహిరంగంగానే ప్రెస్ మీట్ లు పెట్టి జనసేన ఇమేజ్ను డామేజ్ చేసింది. అదంతా వైసిపి కుట్ర అని జనసేన ఖండించింది గాని పార్టీ నాయకుడి పొరపాట్లు దాచలేకపోయింది.అలాగే జనసేన మరో యువ నాయకుడు జానీ మాస్టర్ కూడా లైంగిక వేధింపులు కేసులో అరెస్టయి జైలు పాలయ్యాడు. దానిపైన పవన్ కళ్యాణ్ పదవి విప్పి మాట్లాడలేదు.

ఇప్పుడు తాజాగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బట్టల్లేని బాత్రూం వీడియోలు, ప్రభుత్వ ఉద్యోగిని తో అక్రమ సంబంధాలు…. అబార్షన్ల ఆరోపణలు… రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఇంత జరిగిన ఎమ్మెల్యే పై పార్టీ గాని ప్రభుత్వం గాని ఎటువంటి చర్య తీసుకోకపోవడం విమర్శలకు దారి తీసింది. అన్నింటికన్నా దారుణం అసలు ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు పెదవి విప్పకపోవడం. మీడియా ప్రశ్నించిన కూడా పవన్ తప్పించుకొని వెళ్లిపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది.

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలోనూ పవన్ కళ్యాణ్ దెబ్బ తిన్నాడు. లడ్డుకివాడే నెయ్యిలో పంది కొవ్వు, చేప నూనె, జంతు కళేబరాలు నుంచి తీసిన కొవ్వు కలిశాయని గతంలో తీవ్రమైన స్థాయిలో ఆరోపణలు చేశాడు పవన్. అందుకోసం తానే స్వయంగా కాస్ట్యూమ్స్ మార్చుకొని…. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆలయాల సంప్రోక్షణ కూడా చేశాడు. చివరికి సిబిఐ చార్జిషీట్లో…. తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని… నివేదిక రావడంతో
పవన్ ఇరకాటంలో పడ్డాడు.వివాదాల మాట నుంచి రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో టిడిపి జనసేన సఖ్యతగా ఉన్నాయా, కలిసి పనిచేస్తున్నాయా అంటే అక్కడ సమస్యలు ఎదురవుతున్నాయి. జనసేన నేతలకు తగిన గౌరవం గాని పదవులు కానీ దక్కటం లేదని పార్టీ లీడర్లు గగ్గోలు పెడుతున్నారు.

దీనిపైన పవన్ ఎక్కడ స్పందించడం లేదు. దీంతో పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కూటమి సర్కార్ని అధికారంలోకి తీసుకురావడానికి మేము ఎన్నో త్యాగాలు చేశాం…. చివరికి మాకు ఏం మిగిలింది? అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. టిడిపి అధిష్టానంతో పవన్ సఖ్యతగా ఉండవచ్చు…. కానీ కింది స్థాయిలో టిడిపి తో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించకుండా…. పవన్ మౌనంగా ఉండడం వ్యూహమా..? భయమా అన్నది కార్యకర్తలకు అర్థం కావడం లేదు. టిడిపితో కలిసి ఉండడం తప్ప మరో మార్గం లేదు అనే ధోరణిలో పవన్ వ్యవహరిస్తున్నారని వాదన జనసేనలో బాగా వినిపిస్తోంది.

ఇక ఇచ్చిన హామీలు విషయంలో కూడాపవన్ పెదవి విప్పకపోవడం జనానికి విస్మయం కలిగిస్తుంది. సుగాలి ప్రీతినీ రేప్ చేశారంటూ ఎన్నికల ప్రచారంలో చెలరేగిపోయిన పవన్ ప్రభుత్వంలో ఉండి కూడాఆ కేసును ఇప్పటికీ పరిష్కరించలేకపోయారు. నుంచి 30 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయారని ఆరోపించిన పవన్ తాను డిప్యూటీ సీఎం గా ఉండి ….ఒక్క అమ్మాయిని వెనక్కి తీసుకురాలేకపోయారు. ఇలాంటివి చాలా ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. అన్నిటికీ మౌనమే వ్యూహంగా పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ జర్నీని నెట్టుకొచ్చేస్తున్నారు.