ఒకసారి మెల్లిగా ఒకసారి దీర్ఘంగా…!

గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోవాలన్నా, నిరంతరం షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఎంతో అవసరం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత

Post Published By: dialnews
Updated : 2 May 2026, 8:55 PM IST

గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోవాలన్నా, నిరంతరం షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఎంతో అవసరం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఫిట్‌నెస్ మరియు మెంటల్ హెల్త్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఇటీవల ఆమె తన సోషల్ మీడియా వేదికగా, తన జీవితాన్ని మార్చేసి తనలో కొత్త శక్తిని నింపిన 8 మార్నింగ్ రొటీన్ పనుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చాలామందికి ఉదయం కళ్లు తెరవగానే మొబైల్ ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. కానీ సమంత మాత్రం నిద్ర లేవగానే కనీసం ఒక గంట పాటు మొబైల్‌కు దూరంగా ఉంటారు. లేవగానే మెసేజ్‌లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్లు చూడటం వల్ల ఒత్తిడి పెరుగుతుందని, అది రోజంతా మీ మూడ్‌పై ప్రభావం చూపుతుందని ఆమె చెబుతున్నారు. నిద్ర లేవగానే సమంత చేసే మొదటి పని గోరువెచ్చని నీటిని తాగడం. ఇలా చేయడం వల్ల శరీరంలోని అంతర్గత వ్యవస్థలు ఉత్తేజితమవుతాయి. ఇంకా మంచి ఫలితాల కోసం ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం, చిటికెడు పసుపు లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ వంటివి కలుపుకోవచ్చని ఆమె సూచిస్తున్నారు.

మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సమంత ప్రతిరోజూ ఉదయం కనీసం ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకుంటారు. ఈ ప్రక్రియ వల్ల నాడుల వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, రోజంతా ఒత్తిడి దరిచేరకుండా ఉంటుందని చెప్తోంది. సహజసిద్ధమైన సూర్యరశ్మి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం కనీసం 10 నిమిషాల పాటు ఎండలో గడపాలని సమంత చెబుతున్నారు. దీనివల్ల శరీరానికి అవసరమైన విటమిన్-డి లభిస్తుంది అని తన అభిప్రాయం. ఫిట్‌నెస్ అంటే సమంతకు ప్రాణం. ఆమె తన వ్యాయామాన్ని ఇంట్లో లేదా జిమ్‌లో ఉదయం 11 గంటల లోపే పూర్తి చేస్తారు. ఇలా చేయడం వల్ల శరీరానికి రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుంది, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది మరియు రోజంతా హుషారుగా ఉండటానికి తోడ్పడుతుంది.

నిద్ర లేచిన ఒకటి నుంచి రెండు గంటల లోపే పోషకాలు మెండుగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహం రాకుండా చేస్తుంది మరియు అతిగా ఆకలి వేసే సమస్యను తగ్గిస్తుంది. చాలామందికి పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ సమంత దీనికి పూర్తి వ్యతిరేకం. అల్పాహారం తీసుకున్న తర్వాతే కెఫీన్ తీసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగితే వాటిలోని కెఫీన్ వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చివరగా, ఆ రోజు తాను ఏం సాధించాలో సమంత ఒక నోట్ బుక్‌లో రాసుకుంటారు. ఏ రోజుకు ఆ రోజు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆమె అంటారు. దీనివల్ల నిరంతరం స్ఫూర్తి లభిస్తుందని, పనిలో ఏకాగ్రత పెరుగుతుందని సమంత తన అనుభవాన్ని పంచుకున్నారు.

Published : 
  • 2 May 2026, 8:55 PM IST