దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'క్వీన్' అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు త్రిష కృష్ణన్. గ్లామర్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరీర్ ఐదేళ్లు ఉంటేనే గొప్ప విషయం. అలాంటిది ఏకంగా రెండు దశాబ్దాలుగా అగ్ర హీరోయిన్గా రాణించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మే 4న త్రిష తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. త్రిష సినీ ప్రయాణం 1999లో 'జోడి' చిత్రంతో మొదలైంది. ఆ సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ, తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక తెలుగులో ప్రభాస్ సరసన నటించిన 'వర్షం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, బుజ్జిగాడు వంటి వరుస విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.
కొన్నాళ్ల పాటు ఫేడవుట్ అయిపోయిందనుకున్న తరుణంలో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' ఆమె దశను మార్చేసింది. అందులో 'కుందవై' పాత్రలో త్రిష నటన, ఆమె రాజసం చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా త్రిష కెరీర్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర', సూర్యతో కరుప్పు వంటి పాన్ ఇండియా సినిమాలతో త్రిష బిజీగా ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష సంపాదనలోనూ దూసుకుపోతోంది. త్రిష నికర ఆస్తి విలువ సుమారు 90 కోట్ల నుండి 100 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు సుమారు 8 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఏడాదికి 10 నుండి 15 కోట్ల వరకు సంపాదిస్తోంది.
త్రిష కేవలం సంపాదించడమే కాదు, తెలివిగా పెట్టుబడులు కూడా పెడుతోంది. చెన్నైలో ఆమెకు 10 కోట్ల విలువైన లగ్జరీ హౌస్ ఉండగా, హైదరాబాద్‌లో కూడా 8 కోట్ల విలువైన బంగ్లా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక త్రిషకు కార్లంటే చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో ఉన్న మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్,BMW 5 సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్, మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ కార్లు చాలా అరుదైనవే కాకుండా కాస్ట్లీ కూడా. ఎంత క్రేజ్ ఉంటే అంతగా వివాదాలు చుట్టుముట్టడం సినిమా ఇండస్ట్రీలో సహజం. త్రిష తన కెరీర్లో వ్యక్తిగత జీవితం గురించి, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం వంటి అంశాల వల్ల పలుమార్లు వార్తల్లో నిలిచింది. 43 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ, స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్‌గా మారడం త్రిష ప్రత్యేకత. ఆమెలోని అంకితభావం, గ్లామర్‌ను కాపాడుకునే క్రమశిక్షణే ఆమెను ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో నిలబెట్టాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన పాత్రలతో అలరించాలని కోరుకుంటూ సినీ అభిమానులు హ్యాపీ బర్త్ డే టు సౌత్ క్వీన్ త్రిష అంటూ కామెంట్స్ రూపంలో విషెస్ తెలియజేస్తున్నారు.