తెలుగు చిత్రపరిశ్రమ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో రికార్డులను తిరగరాస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వందల కోట్ల భారీ బడ్జెట్లతో 'పాన్-ఇండియా', 'పాన్-వల్డ్' ప్రాజెక్టులు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. అయితే, ప్రతి భారీ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించలేకపోతుండటం ట్రేడ్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. గతంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్', 'కల్కి 2898 ఏడీ', 'పుష్ప 2' వంటి చిత్రాలు బాక్సాఫీస్ కలెక్షన్లలో కొత్త చరిత్రను సృష్టించాయి. ఈ చిత్రాల సాధించిన విజయం టాలీవుడ్ మార్కెట్ పరిధిని అమాంతం పెంచేసింది. అయితే ఆ తర్వాత విడుదలైన కొన్ని భారీ అంచనాల చిత్రాలు మాత్రం ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి.
'గేమ్ ఛేంజర్', 'వార్ 2', 'రాజాసాబ్', 'పెద్ది' వంటి క్రేజీ కాంబినేషన్ల పై మేకర్స్ పెట్టుకున్న అంచనాలను, ఆడియన్స్ ఆశలను చేరుకోవడంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. ఎంతటి పెద్ద స్టార్ లేదా బడ్జెట్ ఉన్నా, కంటెంట్ సరిగా లేకపోతే ఆడియన్స్ ఆదరించరనే విషయం మరోసారి స్పష్టమైంది.ఇదే సమయంలో బాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ మొదలైంది. 'ధురంధర్' అనే చిత్రం ఎలాంటి పాన్-ఇండియా హంగామా లేకుండా, కేవలం ఒకే భాషలో విడుదలై ఆల్-టైమ్ రికార్డులు నెలకొల్పింది. గ్రిప్పింగ్ నెరేషన్, బలమైన కథాంశం ఉంటే ప్రాంతీయ భాషా చిత్రమైనా 1400 కోట్ల నుంచి 1800 కోట్ల మార్కును సులభంగా తాకగలదని ఈ సినిమా నిరూపించింది.
ఈ పరిణామాలు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు, మేకర్స్‌కు కీలక పాఠాన్ని నేర్పాయి. ఆడియన్స్ కేవలం గ్రాఫిక్స్, స్టార్ కాస్టింగ్ కంటే కథలోని లోతును ఆశిస్తున్నారు. బడ్జెట్ హంగుల కంటే ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసే బలమైన ఎమోషన్స్, సరికొత్త స్క్రీన్‌ప్లే అత్యంత ముఖ్యం. టాలీవుడ్ సామర్థ్యాన్ని కేవలం ఒకటి రెండు సినిమాల ప్రదర్శనతో తక్కువ అంచనా వేయలేమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మన దర్శకులు, నిర్మాతలు ఇప్పటికే ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పారు. ప్రస్తుత మార్కెట్ లోతుపాట్లను బేరీజు వేసుకుంటూ, రాబోయే ప్రాజెక్ట్‌లను సరైన ప్లానింగ్‌తో తెరకెక్కర్థిస్తే టాలీవుడ్ మళ్లీ విజయపథంలో పయనించడం ఖాయం.