వ్యూహం మార్చిన మాస్ రాజా.. పారితోషికం తగ్గించుకుని లాభాల్లో వాటా దిశగా రవితేజ..!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లో సరికొత్త అడుగు వేస్తున్నాడు. ఇటీవల వరుస పరాజయాలు పలకరించడంతో.. సినిమాల ఎంపికలోనూ, నిర్మాణ వ్యయంలోనూ మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు

Post Published By: dialnews
Updated : 15 February 2026, 5:21 PM IST

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లో సరికొత్త అడుగు వేస్తున్నాడు. ఇటీవల వరుస పరాజయాలు పలకరించడంతో.. సినిమాల ఎంపికలోనూ, నిర్మాణ వ్యయంలోనూ మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కేవలం సినిమాలు చేయడమే కాకుండా, నిర్మాతలకు భారం కాకూడదనే ఉద్దేశంతో రిస్క్ కంట్రోల్ పద్ధతిని పాటిస్తున్నారు. బడ్జెట్ హద్దులు దాటకుండా, సినిమా లాభదాయకంగా ఉండేలా రవితేజ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రవితేజ మార్కెట్ వేల్యూ ప్రకారం ఆయన రెమ్యూనరేషన్ రూ. 20 నుండి 25 కోట్ల వరకు ఉంది. దీనికి సినిమా మేకింగ్ ఖర్చులు, ఇతర నటీనటుల పారితోషికాలు కలిపితే బడ్జెట్ సులభంగా రూ. 40-50 కోట్లు దాటేస్తోంది.

ప్రమోషన్లు, ఇతర ఖర్చులు కలుపుకుంటే సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లకు చేరువవుతోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో.. హిట్ టాక్ వస్తే తప్ప అంతటి భారీ మొత్తం వెనక్కి రావడం కష్టంగా మారింది. అందుకే బడ్జెట్ అదుపులో ఉంటేనే ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందని, లేదంటే రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చర్చ జరుగుతోంది.
దీనికి తోడు, గతంలో నిర్మాతలకు భరోసాగా నిలిచిన డిజిటల్, శాటిలైట్ హక్కుల మార్కెట్ ఇప్పుడు భారీగా పడిపోయింది. ఓటీటీ సంస్థలు ఆచితూచి కొనుగోళ్లు జరుపుతుండటంతో.. నాన్-థియేట్రికల్ బిజినెస్‌పై ఆధారపడలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు సేఫ్ జోన్‌లో ఉండాలంటే బడ్జెట్ కంట్రోల్ తప్పనిసరి. ఈ వాస్తవాన్ని గ్రహించిన రవితేజ, తన ఫిక్స్‌డ్ రెమ్యూనరేషన్‌ను తగ్గించుకుని, సినిమా విజయం సాధించాక వచ్చే లాభాల్లో వాటా తీసుకునే విధానానికి మొగ్గు చూపుతున్నారు.

ఈ కొత్త విధానం వల్ల సినిమా ప్రారంభంలోనే నిర్మాతపై ఆర్థిక భారం తగ్గుతుంది. సినిమా హిట్ అయితే హీరోకి కూడా భారీగానే ముడుతుంది.. ఒకవేళ తేడా కొట్టినా నిర్మాతకు నష్టం పరిమితంగా ఉంటుంది. రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతల పాలిట వరంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం రవితేజతో ఆగిపోలేదు.. ఇండస్ట్రీలోని ఇతర హీరోలు కూడా ఇదే బాటలో నడిచే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, నటసింహం బాలకృష్ణ వంటి స్టార్ల సినిమాలకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బడ్జెట్ లెక్కలు తారుమారవుతుండటంతో.. వీళ్లు కూడా పారితోషికం విషయంలో వెనక్కి తగ్గి, లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి టాలీవుడ్ హీరోలు మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకోవడం.. ఇండస్ట్రీకి శుభపరిణామం అని చెప్పవచ్చు.

Published : 
  • 15 February 2026, 5:21 PM IST