అందరి చూపు హార్ముజ్‌ వైపే… ఇరాన్‌ ఈ ఒక్క పని చేస్తే అమెరికా దారికి వస్తుందా… ?

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు భగ్గుమంటున్న వేళ, అంతర్జాతీయ సమాజం చూపు మొత్తం ఒకే ఒక సముద్ర మార్గం వైపు మళ్లింది. అదే 'హార్ముజ్ జలసంధి'. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే ఈ జలసంధిని ఇప్పుడు ఇరాన్‌ మూసివేసేందుకు ప్రయత్నిస్తోంది.

Post Published By: dialnews
Updated : 5 March 2026, 10:16 AM IST

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు భగ్గుమంటున్న వేళ, అంతర్జాతీయ సమాజం చూపు మొత్తం ఒకే ఒక సముద్ర మార్గం వైపు మళ్లింది. అదే 'హార్ముజ్ జలసంధి'. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే ఈ జలసంధిని ఇప్పుడు ఇరాన్‌ మూసివేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది జరిగితే ఆ ఎఫెక్ట్‌ మొత్తం ప్రపంచం మీద పడే ఛాన్స్‌ ఉంది. ఇంతకీ ఇంత కీలకమైన ఆ జలసంధి ఎక్కడుంది ?మిడిల్‌ ఈస్ట్‌లో ఉన్న హార్ముజ్ జలసంధి మీదే ఇప్పుడు అందరి చూపు ఉంది. ఇది చమురు నిల్వలకు ప్రసిద్ధి చెందిన పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. దీనికి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలున్నాయి. ఇది కేవలం 39 కిలోమీటర్ల వెడల్పు ఉండే అతి ఇరుకైన మార్గం. ప్రపంచ ఇంధన భద్రతకు ఈ జలసంధే గుండెకాయ. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ వంటి దేశాల చమురు ఎగుమతులకు సముద్ర మార్గాన ఇదొక్కటే ముఖద్వారం.

కానీ ఇప్పుడు ఇరాన్‌ దీన్ని మూసివేయాలి అనుకుటోంది. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి తమకు సైనిక ముప్పు ఎదురైనా, తమ చమురు ఎగుమతులపై ఆర్థిక ఆంక్షలు విధించినా ఇరాన్ ప్రయోగించే బ్రహ్మాస్త్రం ఇదే. "మా చమురు ఎగుమతులు ఆగిపోతే, ప్రపంచంలో ఏ దేశానికీ చమురు వెళ్లకుండా హార్ముజ్ జలసంధిని మూసివేస్తాం" అని ఇరాన్ పదేపదే హెచ్చరిస్తూ ఉంటుంది. భౌగోళికంగా ఈ జలసంధిపై ఇరాన్‌కు బలమైన పట్టు ఉండటమే దీనికి కారణం. ప్రపంచ ముడిచమురు రవాణాలో అత్యంత కీలకమైన 'చోక్ పాయింట్' ఇదే. ప్రతిరోజూ సుమారు 20 నుంచి 21 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వినియోగించే మొత్తం చమురులో దాదాపు 20 శాతానికి పైగా ఇక్కడి నుంచే వెళ్తుంది. అంతేకాకుండా, లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌..LNG రవాణాలో పావు వంతు ఈ జలసంధి గుండానే సరఫరా అవుతుంది.

హార్ముజ్ జలసంధి మూసుకుపోతే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. బ్యారెల్ ధర ఊహించని స్థాయికి వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయి, తీవ్ర ఆర్థిక మాంద్యం వస్తుంది. దీని వల్ల అత్యధిక భారం పడేది ఆసియా ఖండం మీదే. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే చమురులో 80 శాతానికి పైగా చైనా, జపాన్, దక్షిణ కొరియా, భారత్ లాంటి ఆసియా దేశాలకే వెళుతుంది. కాబట్టి ఆసియా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతాయి. ఇదే జరిగితే భారత్‌కు తీవ్ర నస్టం. ఎందుకంటే ఇండియా తన చమురు అవసరాల కోసం 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడింది. అందులో సుమారు 60 శాతం పశ్చిమాసియా నుంచే వస్తుంది. హార్ముజ్ మూసుకుపోతే భారత్‌కు చమురు సరఫరా ఆగిపోయి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటాయి. సరుకు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు అమాంతం పెరుగుతాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి, సామాన్యుడి బతుకు భారంగా మారుతుంది.

దురదృష్టవశాత్తూ హార్ముజ్ జలసంధికి సరైన ప్రత్యామ్నాయ సముద్ర మార్గం లేదు. పర్షియన్ గల్ఫ్ నుంచి ఓడలు బయటకు రావడానికి వేరే దారి లేదు. దీన్ని అధిగమించేందుకు సౌదీ అరేబియా, UAEలు కొన్ని చమురు పైప్‌లైన్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. కానీ, ఆ పైప్‌లైన్‌ల సామర్థ్యం చాలా తక్కువ. దాంతో పాటు ఈ జలసంధి అధిక భాగం ఒమన్‌లో ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా మూసివేయడం చాలా కష్టం. ఒమన్‌, UAE మీదుగా నౌకలు ప్రయాణించవచ్చు. కానీ సముద్రం గుండా వెళ్లే కోట్ల బ్యారెళ్ల చమురును ఆ పైప్‌లైన్‌లు ఏమాత్రం భర్తీ చేయలేవు. అందుకే ఈ జలసంధి మూసివేత అనేది ప్రపంచ దేశాలకు ఒక పీడకల లాంటిది.

 

Published : 
  • 5 March 2026, 10:16 AM IST