హార్ముజ్ వేదికగా మరోసాని తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా దిగ్బంధనం దెబ్బకు ఇరాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పటికే ఉత్పత్తి చేసిన చమురును ఎగుమతి చేసుకోలేక, నిల్వ సామర్థ్యం సరిపోక టెహ్రాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇదే అదునుగా ఇరాన్‌పై దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవ్వాలని ట్రంప్ తన సైన్యానికి ఆదేశాలివ్వడం పశ్చిమాసియాలో పెను ప్రకంపనలు పుట్టిస్తోంది. దీనికి ఇరాన్ సైతం అంతే దీటుగా బదులిచ్చింది. అమెరికా నౌకలను తగలబెట్టేస్తామని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగింది. ఈ పరిణామాలే మరోసారి చమురు మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. కానీ, ఇరాన్‌పై దీర్ఘకాలిక ముట్టడికి అగ్రరాజ్యం ఎందుకు సిద్ధమవుతున్నట్టు? ఈ చర్యలపై ఇరాన్ ఎందుకింతగా ఫైర్ అవుతోంది? హార్ముజ్‌లో అసలు సిసలు ఆట ఇప్పుడే మొదలైంది అనుకోవచ్చా?
అమెరికాతో యుద్ధంలో ఇరాన్ ఒక్కటంటే ఒక్కసారి కూడా వెనుకడుగు వేయలేదు. ట్రంప్ ప్రభుత్వమే చర్చలకు పిలుపునిచ్చినా 'మా డిమాండ్లకు ఒప్పుకుంటేనే చర్చలకొస్తామని కుండబద్దలు కొట్టేసింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను వదులుకోబోమనీ, హార్ముజ్‌పై పట్టు విడిచిపెట్టేది లేదనీ, ఆఖరికి యుద్ధం కారణంగా జరిగిన నష్టాలనీ మీరే భర్తీ చేయాలని తేల్చిచెప్పింది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఇరాన్ ప్రస్తుతం డిమాండింగ్ పొజిషన్లో లేదు. కమాండింగ్ సీన్ అసలే లేదు. ఎందుకంటే, అమెరికా దిగ్బంధన వ్యూహం టెహ్రాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అమెరికా నేవీ దిగ్బంధం కారణంగా హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో ఇరాన్ పరిస్థితి క్లిష్టంగా మారింది. అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధనం వల్ల చమురును విదేశాలకు ఎగుమతి చేయలేకపోతోంది. దీంతో బయటకు తీసిన చమురు అంతా దేశంలోని స్టోరేజీ ట్యాంకుల్లో, భారీ చమురు నౌకల్లో నిల్వ చేయాల్సిన పరిస్థితి. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో ఆ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దిగ్బంధన ప్రభావంతో ఇరాన్ భారీగా నష్టపోతోంది.
అమెరికా దిగ్బంధానికి ముందు వరకూ ప్రతిరోజు సుమారు 18 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతులు జరిగితే ప్రస్తుతం అది దాదాపు 5 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. కానీ, అసలు సమస్య ఇదొక్కటే కాదు.. ఇరాన్ ముందు ఇంతకుమించిన మరో సవాల్ ఉంది. అదే చమురు నిల్వ సామర్థ్యం.పరిశోధనా సంస్థ 'కెప్లర్' నివేదిక ప్రకారం, ఇరాన్ వద్ద కేవలం 12 నుండి 22 రోజుల నిల్వ సామర్థ్యం మాత్రమే మిగిలి ఉంది, ఇది బలవంతపు ఉత్పత్తి నిలిపివేత ప్రమాదాన్ని పెంచుతోంది. పెరుగుతున్న చమురు నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, ఇరాన్ 30 ఏళ్ల నాటి చమురు ట్యాంకర్ నాషాను కూడా పునరుద్ధరించింది. నిల్వ చేయడానికి స్థలం లేకపోతే బావుల నుంచి చమురు తీయడం ఆపేయాల్సి వస్తుంది. చమురు క్షేత్రాలను ఒక్కసారిగా మూసివేస్తే, భవిష్యత్తులో ఆ బావుల నుంచి చమురు తీయడం కష్టమవుతుంది. అదే జరిగితే ఇరాన్‌కు ఆర్థికంగా అత్యంత కీలకమైన ఇంధన రంగం దారుణంగా దెబ్బ తింటుంది. ఈ పరిణామాలనే అమెరికా తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది. ఆర్థికంగా ఒత్తిడి పెంచి ఇరాన్‌ను అణు ఒప్పందం దిశగా అడుగులేసేలా చేయాలనేది ట్రంప్ ప్లాన్. అందులో భాగంగానే ఇరాన్‌పై దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధం అవ్వాలని ట్రంప్ తన సైన్యానికి ఆదేశాలిచ్చినట్టు కనిపిస్తోంది.
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. సైనిక దాడులను తిరిగి ప్రారంభించడం, యుద్ధం నుంచి వెనక్కి వెళ్లడంతో పోలిస్తే.. ఈ దిగ్బంధనంతోనే ఇరాన్‌కు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ట్రంప్ భావిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం కొనసాగుతోన్న దిగ్బంధనాన్ని మరిన్ని రోజులు పొడిగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ట్రూత్ వేదికగా కీలక ప్రకటనా చేశాడు. ఇరాన్ పూర్తిగా పతన స్థితిలో ఉందని, హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని కోరుతోందని ట్రంప్ పేర్కొన్నాడు. 'తాము కుప్పకూలిపోయేలా ఉన్నామని కాసేపటి క్రితమే ఇరాన్ మాకు సమాచారం ఇచ్చింది. వారు తమ నాయకత్వంలో ఏర్పడిన విభేదాలను సరిచేసుకునే క్రమంలో ఉన్నారు. వీలైనంత త్వరగా హార్ముజ్ జలసంధిని తెరవాలని కోరుకుంటున్నారు' అని ట్రంప్ పేర్కొన్నాడు. కానీ, ఇరాన్ మాత్రం మరోలా రియాక్ట్ అయింది. అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
ఐఆర్జీసీ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ తిరిగి సైనిక చర్యలకు దిగితే.. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని స్పష్టం చేసింది.
అమెరికా మళ్లీ దురాక్రమణకు పాల్పడితే.. పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న ఇరాన్‌కు అనుకూల గ్రూపులు రంగంలోకి దిగుతాయని ఐఆర్జీసీ నేవీకి చెందిన ఒక సీనియర్ అధికారి హెచ్చరించాడు. అమెరికాకు చెందిన భారీ నౌకలను సముద్రంలోనే తగలబెట్టేస్తామని వ్యాఖ్యానించాడు. మరోవైపు.. అమెరికాతో సీజ్ఫైర్ జరిగినా.. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతున్నట్లే భావిస్తున్నామని ఇరాన్ ఆర్మీ ప్రతినిధి అమిర్ అక్రమినియా ప్రకటించాడు. హార్మూజ్ పూర్తిగా తమ సాయుధ దళాల నియంత్రణలోనే ఉందని చెప్పుకొచ్చాడు. ఈ ప్రకటనలు చూసిన తర్వాత అమెరికా విషయంలో ఇప్పటికీ ఇరాన్ ముండి తనాన్ని వీడలేదని అర్ధమవుతోంది. ఒకవేళ ఇరాన్‌పై దీర్ఘకాలిక ముట్టడికి అమెరికా సిద్ధమైతే టెహ్రాన్ కూడా దీటుగా బదులిచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే దిగ్బంధనం వల్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న టెహ్రాన్.. అమెరికా నౌకలపై కచ్చితంగా దాడులకు దిగుతుంది. అదే జరిగితే పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారడం ఖాయం.