మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ సీరియస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ నేతలతో చర్చలు...మరోవైపు బీజేపీ నేతలను కలవడంపై క్లాస్ పీకారు. జాగ్రత్తగా పని చేసుకోవాలని...లేదంటే మరొకర్ని అక్కడ పెట్టాల్సి వస్తుందని సుతిమెత్తగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.ఉంటవా ? పోతవా ? త్వరగా డిసైడ్ చేసుకో...ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తనంటే ఇక్కడ నడవదు. పార్టీ కోసం పని చేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉంటది. లేదంటే ప్రత్యామ్నాయం తప్పదని మల్లారెడ్డిని కేసీఆర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉంటే ఉండు...లేదంటే త్వరగా బయటకు వెళ్లిపో...అంటూ హెచ్చరించినట్లు సమాచారం. పార్టీ మార్పుపై మల్లారెడ్డిని ప్రశ్నించినా సమాధానం చెప్పకపోవడంతో ఘాటుగానే కేసీఆర్ మండిపడినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కొడుకు కోడలుతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఢిల్లీకి వెళ్లి కలిశారు. ఆ తర్వాత కోడలు ప్రీతిరెడ్డి రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్తో భేటీ అవడంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిని పిలిపించుకున్న కేసీఆర్...కాస్త కటువుగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒక వైపు కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతూనే...మరోవైపు బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లడంపై గులాబీ బాస్ క్లాస్ పీకినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఉంటవా..? బయటకు పోతవా..? అని గట్టిగా అడిగేసరికి మల్లారెడ్డి నీళ్లు నమిలినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో మల్లారెడ్డి చేసే హడావుడిపైనా కేసీఆర్ క్లాస్ పీకినట్లు సమాచారం. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం కాదు.. ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యలపై పోరాడాలి. ఒక బాధ్యతగల నాయకుడిలా హుందాగా ప్రవర్తించు.. జోకర్లా వ్యవహరించొద్దంటూ ఘాటుగా మందలించినట్టు తెలిసింది.
నియోజకవర్గాల వారీగా బూత్ స్థాయి నుంచి పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని గులాబీ కేసీఆర్ ఆదేశించారు. మేడ్చల్ అసెంబ్లీ నుంచి బూత్ స్థాయి నివేదిక అందకపోవడంపై కేసీఆర్ మండిపడినట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల నుంచి నివేదికలు ఇస్తుంటే.. మేడ్చల్ నుంచి ఎందుకు రాలేదు ? అసలు అక్కడ ఏం జరుగుతోంది ? పార్టీ బలోపేతంపై పోకస్ చేశావా ? లేదా ? అసలు బీఆర్ఎస్లో ఉండాలని అనుకుంటున్నావా ? లేదా ? ఇలాగైతే నాతో నడవదు. తర్వాత నీ ఇష్టం...ఇంకొకర్ని తీసుకురాకముందే బాధ్యతగా పని చేయి...లేదంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వస్తుందని మల్లారెడ్డిని కేసీఆర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో నేతల మద్య సమన్వయం లోపించడంపై కేసీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. విద్యాసంస్థలకు ఎదురువుతున్న ఇబ్బందుల కారణంగానే ప్రధాని మోడీ, అధికారులను కలవాల్సి వచ్చిందని మల్లారెడ్డి కేసీఆర్కు చెప్పుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని వీడబోనని స్పష్టం చేసినట్టు తెలిసింది.
2014లో రాజకీయాల్లోకి వచ్చిన మల్లారెడ్డి...మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ప్రమోట్ అయ్యారు. 2023 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మల్లారెడ్డి కుటుంబం బీజేపీలోకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటోంది. అందులో భాగంగానే కుటుంబం మోడీని కలిసింది. కోడలు ప్రీతిరెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ నేతలకు ఐదు సీట్లు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. ఆర్థికంగా, సామాజికంగా బలవంతుడు కావడంతో కాషాయ పార్టీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ మల్లారెడ్డికి ఫుల్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.