ఇరాన్‌లో రెండు రోజుల పాటు కురిసిన బ్లాక్ యాసిడ్ వర్షం...జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏం జరుగుతుందో తెలియక నానా అవస్థలు పడ్డారు. ఇంతకీ ఏమిటీ బ్లాక్ యాసిడ్ వర్షం ? దీని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి ? ఈ ముప్పు నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయా ? ఎక్కడ చూసినా బ్లాక్ యాసిడ్ వర్షం గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.
అమెరికా, ఇరాన్ యుద్దం 12 రోజులుగా సాగుతూనే ఉంది. ఇరాన్ అణుస్థావరాలు, పెట్రో నిల్వలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నాయి. అటు ఇరాన్ సైతం అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుంటోంది. టెహ్రాన్ పరిసరాల్లోని 30కిపైగా చమురు కర్మాగారాలు, ఇంధన డిపోలపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయి. ఆ తర్వాతే అత్యంత ప్రమాదకర బ్లాక్ యాసిడ్ వర్షం కురిసింది.
ఈ వర్షం వల్ల టెహ్రాన్ నగరం, శివారు ప్రాంతాలతో పాటు అల్‌బోర్జ్ ప్రావిన్స్‌లోని ఏరియాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 48 గంటల పాటు ఆయా చోట్ల ఆకాశంలో నల్లటి పొగలు మాత్రమే కనిపించాయి. చివరకు ఊపిరి పీల్చుకునేందుకూ జనం నానా అవస్థలు పడ్డారు. ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ ప్రజలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. వర్షపు జల్లుల్లో రసాయనాలు, ఆమ్లాలు, ఇతరత్రా ప్రమాదకర రసాయనాలు పొగల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ యాసిడ్ వర్షంలో సీసం, మెర్క్యూరీ లాంటి భార లోహాలు, బిల్డింగ్ మెటీరియల్స్‌లోని అసేంద్రియ సమ్మేళనాలు కూడా చమురు పొగల్లో ఉంటాయని అంటున్నారు.
చమురు పొగల్లోని సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్‌ల వల్ల వాతావరణంలో సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఏర్పడే అవకాశం ఉంది. చమురు, వంటచెరుకు, బొగ్గు, సహజ వాయువు లాంటి శిలాజ ఇంధనాలను వినియోగించినప్పుడు వాతావరణంలోకి సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది. దీనివల్ల సాధారణ యాసిడ్ రెయిన్ పడుతుంటుంది.
30కిపైగా చమురు కర్మాగారాలు, ఇంధన డిపోలపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు బాంబులను జారవిడిచాయి. దీంతో ఆయాచోట్ల ఉన్న ఇంధన వనరులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఇవి కాలిపోయే క్రమంలో వాతావరణంలోకి దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. వీటిలో హైడ్రో కార్బన్లు, పీఎం 2.5 వంటి విషపూరిత కాలుష్య కారకాలతో పాటు పాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రో కార్బన్స్ అనే కార్సినోజెనిక్ సమ్మేళనాలు ఉంటాయి.
ఈ ప్రమాదకర రసాయనాలు, ఆమ్లాలతో కూడిన నీటి బిందువులే బ్లాక్ యాసిడ్ రెయిన్‌లో కురిసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ ద్వారా ముడి చమురు నుంచి రిఫైనింగ్ దశలోనే సల్ఫర్‌ను తొలగిస్తున్నారు. వర్షం కురిస్తే వాతావరణంలో, గాలిలో పేరుకుపోయిన కాలుష్య కారకాలన్నీ తొలగిపోతాయి. అంటే వాతావరణాన్ని క్లీన్ చేసే పనిని వర్షం చేస్తుంది. మార్చి 8, 9 తేదీల్లో ఇరాన్‌లోని టెహ్రాన్, అల్‌బోర్జ్ ప్రావిన్స్ పరిధిలోని పలు చోట్ల కొన్ని గంటల పాటు నల్లటి వర్షం కురిసింది.
బ్లాక్ యాసిడ్ వర్షంలో యాసిడ్లతో పాటు స్వల్ప, దీర్ఘకాలాల్లో మనుషులు, పర్యావరణానికి హాని కలిగించే కాలుష్య కారకాలు ఉంటాయి. ఈ వర్షంతో ఇరాన్ ప్రజలు తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ వర్షం అత్యంత ప్రమాదకరమైనదని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకటించింది. బ్లాక్ యాసిడ్ రెయిన్ వల్ల ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఎక్కువ ఇబ్బందిపడతారు.
ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు ఈ కాలుష్యం ప్రభావానికి లోనైతే, తక్కువ బరువున్న పిల్లలు జన్మిస్తారు. దట్టమైన పొగలలోని పీఎం 2.5 అల్ట్రాఫైన్ కణాలను మనుషులు పీలిస్తే, అవి నేరుగారక్త ప్రవాహంలోకి ఎంటర్ అవుతాయి. దీనివల్ల క్యాన్సర్లు, నాడీ సంబంధిత సమస్యలు, హృదయనాళ రోగాలు వస్తాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగులకు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఈ వర్షం ప్రభావంతో దీర్ఘకాలంలో ప్రజలు క్యాన్సర్ బారినపడే గండం ఉంటుంది.