ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అందరి దృష్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ముఖ్యంగా గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. బెజవాడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమిలోని కీలక నేతలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు "బొండా సిద్ధార్థ్" పేరు ఇప్పుడు మేయర్ అభ్యర్థిత్వ రేసులో హాట్ టాపిక్ గా మారింది. తన కుమారుడికి మేయర్ సీటు కేటాయించాలని కోరుతూ బొండా ఉమా ఏకంగా అధిష్టానం వద్దే పంచాయితీ పెట్టారు. అసలు అమరావతిలో ఏం జరుగుతోంది..? బొండా సిద్ధార్థ్ రేసులోకి రావడం వెనుక ఉన్న సమీకరణాలు ఏంటి..?
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ రాజకీయాల్లో బొండా ఉమామహేశ్వరరావుకు బలమైన పట్టు ఉంది. అయితే ఈసారి ఆయన తన రాజకీయ వారసుడిగా కుమారుడు బొండా సిద్ధార్థ్‌ను విజయవాడ మేయర్ సీటు ద్వారా మున్సిపల్ రాజకీయాల్లోకి లాంచ్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే బొండా ఉమా పొలిటికల్ గా వేగంగా అడుగులు వేస్తున్నారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన ఆయన.. తాజాగా ఉండవల్లి నివాసంలో ఐటీ మంత్రి నారా లోకేష్‌ను పర్సనల్‌గా కలిశారు. ఈ భేటీలో తన కుమారుడు సిద్ధార్థ్ కూడా పాల్గొన్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా సిద్ధార్థ్ పేరును పరిశీలించాలని, తమకు ఆ అవకాశం కల్పించాలని బొండా ఉమా అధికారికంగా లోకేష్ ముందు ప్రపోజల్ పెట్టారు.
అయితే ఈ సీటు అడగడం వెనుక బొండా ఉమా ఒక పక్కా పొలిటికల్ కాలిక్యులేషన్‌ను అధిష్టానం ముందు ఉంచారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం. గతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రను చూసుకుంటే.. తెలుగుదేశం పార్టీ తరఫున కాపు సామాజిక వర్గానికి మేయర్ గా పోటీ చేసే అవకాశం పెద్దగా దక్కలేదు. ఈ పాయింట్‌నే బొండా ఉమా నారా లోకేష్ వద్ద ప్రస్తావించారు. ఈసారి గనుక కాపు సామాజిక వర్గానికి చెందిన బొండా సిద్ధార్థ్‌కు అవకాశం ఇస్తే.. అటు సామాజిక సమీకరణాలు బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపుల్లో పార్టీపై మరింత నమ్మకం పెరుగుతుందని, భారీ మెజారిటీతో మేయర్ సీటును గెలిపించుకుంటామని అధిష్టానానికి హామీ ఇచ్చారు.
బొండా ఉమా తన కుమారుడి ప్రొఫైల్‌ను వివరించిన తీరుపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. బొండా సిద్ధార్థ్ పొలిటికల్ ప్రొఫైల్, గతంలో పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్న విధానాన్ని చూసి లోకేష్ ఇంప్రెస్ అయ్యారట. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన వారికి, యువతకు కచ్చితంగా తగిన ప్రాధాన్యత ఇస్తామని లోకేష్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అయితే విజయవాడ మేయర్ సీటుపై కూటమిలో మరికొంతమంది సీనియర్ నేతలు కూడా కన్నేశారు. పైగా జనసేన పార్టీ కూడా విజయవాడలో సీట్ల షేరింగ్ విషయంలో ఎలాంటి డిమాండ్స్ పెడుతుందనేది ఇంకా క్లారిటీ రాలేదు.
కాబట్టి అధిష్టానం అందరితో మాట్లాడి, అంతిమంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా గ్రేటర్ విజయవాడ మేయర్ అభ్యర్థిత్వం కోసం బొండా ఉమామహేశ్వరరావు ముందే అలర్ట్ అయి తన కుమారుడి కోసం గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి బొండా సిద్ధార్థ్‌కు విజయవాడ మేయర్ అభ్యర్థిగా కూటమి అవకాశం ఇస్తుందా? లేదా బెజవాడ పాలిటిక్స్‌లో సరికొత్త ట్విస్ట్‌లు ఏమైనా చోటుచేసుకుంటాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.