Top story:వైసిపి నుంచి చెవిరెడ్డి అవుట్..? పెద్దిరెడ్డి అనుకున్నది సాధించినట్లే..?

అధికారం ఉన్నా, లేకపోయినా, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వర్గ పోరు అనేది కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా వైసిపి బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో కూడా, అక్కడ వర్గపోరుతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు.

Post Published By: dialnews
Updated : 24 February 2026, 9:42 AM IST

అధికారం ఉన్నా, లేకపోయినా, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వర్గ పోరు అనేది కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా వైసిపి బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో కూడా, అక్కడ వర్గపోరుతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గాలు.. చిత్తూరు జిల్లా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో అత్యంత బలమైన నాయకులుగా ఉన్న, ఈ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.. అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ మధ్య సయోధ్య కుదిరిచ్చేందుకు, కొంతమంది ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు అనేది జిల్లాలో ఉన్న మాట.

ఇక జగన్ కూడా వీళ్ళిద్దరిని అలాగే ఉంచి, రాజకీయం చేయడం మొదలుపెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందనే ప్రచారం అప్పట్లో జరిగింది. నగరిలో ఆర్కే రోజా ఇబ్బంది పడటానికి కూడా, పెద్దిరెడ్డి డామినేషన్ ప్రధాన కారణం అనే మాట కూడా జిల్లాలో వినపడేది. ఇక లిక్కర్ కుంభకోణం బయటికి వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా రెస్ట్ అయ్యారు. రాజకీయంగా ఇది వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇద్దరు బెయిల్ పై బయటే ఉన్నారు.

అయితే మిధున్ రెడ్డి కంటే చెవిరెడ్డి ఎక్కువ కాలం జైల్లో గడిపారు. దాదాపు 250 రోజులపాటు ఆయన జైల్లోనే ఉన్నారు. మిధున్ రెడ్డిని త్వరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వైయస్ జగన్.. చెవిరెడ్డి విషయంలో అంత చొరవ చూపలేదు అనే మాట కూడా వినపడింది. దీనితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా లిక్కర్ కేసు విషయంలో, సీరియస్ గానే ప్రభుత్వానికి సహకరించినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా కీలక ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాతనే చెవిరెడ్డి బెయిల్ పై విడుదలైనట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు చెవిరెడ్డి విషయంలో జగన్ మరో షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్ పదవిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇక చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతలు కూడా మరో నాయకుడికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. చెవిరెడ్డి స్థానంలో మరో నాయకుడిని అక్కడ రంగంలోకి దించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్కౌట్ చేశారని.. ఆ నాయకుడికి జగన్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయని, త్వరలోనే చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి గాని నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. అటు టిడిపికి పెద్దగా నియోజకవర్గంలో ఇబ్బందికర వాతావరణం కూడా కలిగించడం లేదు. అందుకే ఇక్కడ వైసిపి అధిష్టానం కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ బాధ్యతలను త్వరగా అప్పగిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేనాటికి, నియోజకవర్గంలో ప్రభావం చూపించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే దీని వెనుక కీలక పరిణామాలు జరిగాయనేది వైసిపి వర్గాల్లో వినపడుతున్న మాట.

లిక్కర్ కేసు కు సంబంధించి కీలక నిందితులకు, బెయిల్ ఇవ్వకూడదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఇంప్లీడ్ పిటిషన్ కూడా దాఖలు చేయడం ఓ సంచలనం. అందులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు ఉన్నాయి. కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెయిల్ కూడా ఉంది. వాళ్లు బెయిల్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ వాళ్లకు బెయిల్ ఇవ్వద్దని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా వైసిపి వర్గాలు కూడా షాక్ అయ్యాయి. జగన్ ప్రభుత్వంలో వాళ్లు అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు. వారికి బెయిల్ ఇప్పించేందుకు జగన్ ఢిల్లీ స్థాయిలో కూడా కష్టపడుతున్నారనే ప్రచారం జరిగింది.

అలాంటి సమయంలో చెవిరెడ్డి వేసిన పిటీషన్ కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. అందుకే వైసీపీలో పూర్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దూరం పెట్టేందుకు జగన్ సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. 2024 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. పార్టీకి బ్యాగ్రౌండ్ వర్క్ కూడా గట్టిగానే చేశారు చెవిరెడ్డి. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి అండగా ఉంటూ వస్తున్న చెవిరెడ్డి.. జగన్ కు దూరమైతే ఆయనతో పాటుగా జిల్లాలో మరికొంతమంది నాయకులు కూడా దూరమయ్యే.. సంకేతాలు ఉండవచ్చు. ఏది ఎలా ఉన్నా చెవిరెడ్డి విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట ఏదో ఒక రూపంలో నెగ్గిందనే భావన జిల్లాలో బలంగా వినపడుతోంది.

Published : 
  • 24 February 2026, 9:42 AM IST