నమ్మించి గొంతు కోయడంలో చైనా తర్వాతే ఎవరైనా. స్నేహమంటూనే వెన్నుపోటు వ్యూహాలు చేయడం డ్రాగన్‌కు వెన్నతోపెట్టిన విద్య. ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో ఏనుగు-డ్రాగన్ కలిసి డ్యాన్స్ చేయాల్సిన టైం వచ్చిందంటూ భారత్‌కు దగ్గరైన బీజింగ్.. అరుణాచల్‌ప్రదేశ్ వేదికగా ఇప్పుడదే చేస్తోంది. అవకాశం దొరికిన ప్రతిసారీ అరుణాచల్ ప్రదేశ్‌పై విషంచిమ్మే డ్రాగన్.. ఈసారి అంతకుమించిన కుట్రలకే పదునుపెట్టింది. ఏకంగా అణ్వాయుధాలను తయారు చేస్తూ భారత్‌పై టార్గెట్ చేస్తోంది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం..
అరుణాచల్‌ప్రదేశ్‌కు కేవలం 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిచువాన్ ప్రావిన్స్‌లో అత్యంత రహస్యంగా నిర్మించిన జిటాంగ్, పింగ్‌టాంగ్ ప్లాంట్లలో అణ్వాయుధాల తయారీని వేగవంతం చేస్తోంది. అత్యున్నత స్థాయి నిఘా వర్గాలను, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక ఈ మేరకు వెలువరించిన కథనం కలకలం రేపుతోంది. అరుణాచల్ సమీపంలో చైనా కొన్నేళ్లుగా సైనిక మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ, జనావాసాలను ఏర్పాటు చేస్తూ భారత్‌ను కవ్విస్తోంది. వాస్తవానికి వాయవ్య చైనాలోని సిచువాన్ పర్వత ప్రాంతాల్లో చైనా అణు ప్లాంట్లు కొత్తవేమీ కాదు. అమెరికా, నాటి సోవియట్‌కు దీటుగా ఎదిగే ఉద్దేశంతో 60 ఏళ్ల కిందట నిర్మించినవే. అప్పట్లో వాటిలో వేలాదిగా సైంటిస్టులు, ఇంజనీర్లు, కార్మికులను నియోగించింది. జిటాంగ్, పింగ్‌టాంగ్ ప్లాంట్లలో అణు కార్యక్రమాలను దూకుడుగా కొనసాగించింది. ఐతే 1980ల నాటికి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో అక్కడ సిబ్బందిని భారీగా తగ్గించేసింది. కానీ, 20 ఏళ్ల క్రితం చైనా వ్యూహం మార్చింది.
రెండు దశాబ్దాలుగా జిటాంగ్, పింగ్‌టాంగ్ ప్లాంట్లపై చైనా దృష్టి పెట్టింది. అంతేకాదు, న్యూక్లియర్ వార్‌హెడ్ల తయారీకి వాటికి పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఆ క్రమంలో ఆ సీక్రెట్ న్యూక్లియర్ కేంద్రాలను జిన్‌పింగ్ సర్కార్ డే బై డే విస్తరిస్తూ వస్తున్నట్టు తాజా శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా 2019 నుంచి అక్కడ కార్యకలాపాలు అనూహ్య రీతిలో వేగం పుంజుకున్నట్టు శాటిలైట్ నిఘా నిపుణుడు రెనీ బాబియార్జ్‌ను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఆ కథనంలో జిటాంగ్ న్యూక్లియర్ ప్లాంటు దగ్గర కొత్త బంకర్లు, అత్యంత బలమైన గోడలు పుట్టుకొచ్చినట్టు పేర్కొంది. అత్యంత తీవ్రమైన పేలుడుతో కూడిన ప్రయోగాలను తరచూ నిర్వహిస్తున్నట్టుగా ఆధారాలు ఉన్నాయని శాటిలైట్ నిఘా నిపుణుడు రెనీ బాబియార్జ్ పేర్కొన్నారు. వీటిని హార్వర్డ్ వర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త హుయ్ జాంగ్ కూడా ధ్రువీకరించారు. పింగ్‌టాంగ్ ప్లాంటులో యురేనియం శుద్ధి కార్యకలాపాలు సాగుతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. సో.. అణ్వస్త్రాల తయారీలో చైనా ఏదో పెద్ద ప్లాన్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది.
అణ్వస్త్రాల విషయంలో రష్యా, అమెరికా తర్వాత చైనా ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. చైనా దగ్గర కనీసం 600 వార్‌హెడ్లు ఉన్నట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ అంచనా వేస్తోంది. 2030 నాటికి దాన్ని కనీసం వెయ్యికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం రష్యా వద్ద ఏకంగా 5వేల 400 న్యూక్లియర్ వార్‌హెడ్లు ఉండగా అమెరికా దగ్గర 5వేల 200 వరకూ ఉన్నాయి. వాటితో పోలిస్తే చైనా అణు సంపత్తి తక్కువే అయినా, వాటి సంఖ్యను అది శరవేగంగా పెంచుకుంటున్న తీరు ఆందోళన కలిగించేదేనని నిపుణులు అంటున్నారు. ఇక్కడ చైనా అణుకుట్రలతో సమస్య అమెరికా, రష్యాలకు కాదు.. భారత్‌కు. చైనాతో పోల్చుకుంటే మన దగ్గర అణ్వస్త్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనపై న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే అవకాశం ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తన భూభాగంగా.. దక్షిణ టిబెట్‌గా క్లెయిమ్ చేస్తోంది. సరిహద్దుకు సమీపంలో ఇలాంటి ఆయుధాల తయారీ ఉండటం వల్ల యుద్ధం లాంటి పరిస్థితుల్లో చైనాకు పైచేయి లభించే ప్రమాదం ఉంది. మరి చైనా అణు కుట్రలను ఎదుర్కోవాలంటే?
చైనా అణు కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా అణ్వస్త్రాల అప్‌గ్రేషన్‌పై దృష్టి పెట్టింది. అగ్ని సిరీస్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అగ్ని 5 క్షిపణి పరిథిలో చైనా మొత్తం వస్తుంది. ఐతే, వీటిని మరింత ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉంది. 'క్వాడ్' వంటి గ్రూపుల ద్వారా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి చైనా దూకుడును అడ్డుకోవడానికి దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలి. నిజానికి.. చైనా అణు కుట్రలకు చెక్ పెట్టడానికి మరో వ్యూహం కూడా ఉంది. అది మరేదో కాదు అమెరికా, రష్యా నడుమ అమల్లో ఉన్న వ్యూహాత్మక అణు నిరాయుధీకరణ ఒప్పందంలోకి డర్టీ డ్రాగన్‌ను కూడా చేర్చడమే. ఈ ఒప్పందం ఇటీవలే ముగిసింది. దాన్ని తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చైనాను కూడా ఒప్పందంలోకి లాగే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో ట్రంప్ విజయం సాధిస్తే చైనా అణు కుట్రలకు చెక్ పడుతుంది.