బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన పత్రాలు బ్రిటన్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్న పార్టీ సీనియర్ నేత మాండెల్సన్‌ను USలో రాయబారిగా నియమించిన ప్రధాని కీర్ స్టార్మర్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. సుమారు 15 ఏళ్ల క్రితం సున్నితమైన ప్రభుత్వ సమాచారాన్ని ఎప్‌స్టీన్‌కు అందించారనే ఆరోపణలపై మాండెల్సన్‌పై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఆరోపణలు నిరూపితమైతే ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ వ్యవహారమే స్టార్మర్ మెడకు చుట్టుకుంటోంది. ఆయన ప్రధాని పదవికీ ఎసరుతెచ్చేలా కనిపిస్తోంది. ఇక్కడే సీన్‌లో భారత బద్ధ వ్యతిరేకి షబానా ఎంట్రీ ఇచ్చింది.
కీర్ స్టార్మర్ ఒకవేళ ప్రధాని పదవికి రాజీనామా చేస్తే, లేబర్ పార్టీలో తదుపరి లీడర్‌ను ఎన్నుకుంటారు. అందులో కనీసం 81మంది ఎంపీల మద్దతు పొందినవారు బ్రిటన్ తదుపరి పీఎంగా ఛార్జ్ తీసుకుంటారు. ఆ లిస్టులో టాప్‌లో వినిపిస్తున్న పేరే షబానా మహమూద్. ఆమెను ప్రధానిగా ఎన్నుకుంటే, బ్రిటన్ మొట్టమొదటి ముస్లిం ప్రధానిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది. ఐతే, ప్రధాని పదవి కోసం షబానాతో పాటు మరికొంతమంది ప్రముఖులు పోటీలో ఉన్నారు. మాజీ డిప్యూటీ పీఎం, పార్టీలో బలమైన కేడర్ గల నేత ఏంజెలా రేనర్, హెల్త్ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్, లేబర్ పార్టీ మాజీ నేత, ఎనర్జీ సెక్రటరీ ఎడ్ మిలిబాండ్‌నుంచి షబానాకు గట్టి పోటీ ఉంది. కానీ, మెజారిటీ నేతలు మాత్రం షబానాకే పదవి దక్కే అవకాశంఉందని అభిప్రాయపడుతున్నారు. 45 ఏళ్ల షబానా స్వతహాగా న్యాయవాది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఈమె తల్లిదండ్రులు జుబైదా, మహమ్మద్ అహ్మద్‌కి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్‌లో మూలాలు ఉన్నాయి. బర్మింగ్‌హామ్‌లో షబానా పుట్టింది. 2002లో ఆక్స్‌ఫర్డ్‌లోని లింకన్ కాలేజీ నుంచి లాయర్ పట్టా అందుకున్నారు. తర్వాత ఇన్స్ ఆఫ్ కోర్టు స్కూలు ఆఫ్ లాలో బార్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి బారిస్టర్ కూడా అయ్యారు. 2010లో యూకేలో తొలిసారి ఎంపీలుగా గెలిచిన ముగ్గురు ముస్లిం మహిళల్లో షబానా ఒకరు.
లేబర్ పార్టీలోని రైట్ వింగ్ వాదిగా, స్పష్టమైన ప్రసంగాలతో ఆకట్టుకునే నాయకురాలిగా, అన్ని వర్గాలను సమన్వయం చేయగల డార్క్ హార్స్‌గా షబానాకు పేరుంది. షబానా మహమూద్ వలసల విషయంలో అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వలస వచ్చిన వారు బ్రిటన్‌లో శాశ్వత నివాసం పొందేందుకు ఉన్న కాలాన్ని 5 ఏళ్లనుంచి 10 ఏళ్లకు పెంచడంలో ఆమె పాత్ర ఉంది. షబానా కఠిన వైఖరి వల్ల మితవాద ఓటర్లను ఆకట్టుకోవచ్చని, అదే సమయంలో పాలస్తీనా మద్దతుదారులతో పార్టీకి ఉన్న దూరాన్ని తగ్గించవచ్చని లేబర్ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం
కీర్ స్టార్మర్ కేబినెట్‌లో షబానా ప్రస్తుతం హోంశాఖ చూసుకుంటున్నారు. అయితే స్టార్మర్ రాజీనామా డిమాండ్స్ దృష్ట్యా షబానా ఆసక్తికర ట్వీట్ చేశారు. 'బ్రిటిష్ ప్రజలు.. 18 నెలల క్రితమే ప్రధానికి 5 సంవత్సరాలు పాలించే అధికారం అప్పగించారు. లేబర్ ప్రభుత్వాలు తరచూ ఏర్పడవు. అలాంటి ప్రభుత్వంలో సేవ చేయడం ఒక గౌరవం, ఒక్క క్షణం కూడా వృథా చేయకూడదు. ప్రధానికి నా పూర్తి మద్దతుంది. దేశాన్ని మెరుగైన దిశలో మార్చేందుకు ముందుకు సాగుదామని ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ప్రస్తుతం భారత్, యూకే సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. గతేడాది జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇరు దేశాల దోస్తీని నెక్స్ట్ లెవెల్‌కు చేర్చింది. కానీ, షబానా మహమూద్ బ్రిటన్ ప్రధాని అయితే పరిస్థితులు మారిపోవచ్చు. ఎందుకంటే, ఆమె ముందు నుంచీ భారత వ్యతిరేక విధానాలనే అవలంభిస్తోంది. ముఖ్యంగా కశ్మీర్ వివాదంలో పదే పదే తలదూర్చే ప్రయత్నం చేసింది. 2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు, ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. లండన్‌లోని భారత హైకమిషన్ ముందు జరిగిన నిరసన ప్రదర్శనల్లో కూడా ఆమె పాల్గొన్నారు. ఆమె కశ్మీర్‌ను 'India-occupied Kashmir' అని సంబోధించడం గతంలో పెద్ద వివాదానికి దారితీసింది. ఇది భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అప్పట్లో తీవ్రంగా రియాక్ట్ అయింది. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ఆమె పలుమార్లు బ్రిటన్ పార్లమెంటులో డిమాండ్ చేసింది. అంతేకాదు, 2015లో ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటనకు వెళ్లినప్పుడు, కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా సుమారు 30 మంది ఎంపీలతో కలిసి ఆమె ఒక లేఖ రాసింది. అలాంటి నేత బ్రిటన్‌కు ప్రధాని అయితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.