షాకింగ్:డిప్యూటీ స్పీకర్ RRR స్థలమే కబ్జా… పొలిటికల్ పెద్దల హ్యాండ్ ఉందా..?

విశాఖపట్నంలో భూమాఫియా ఏ రేంజ్‌లో రెచ్చిపోతుందో చెప్పడానికి ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ బయటపడింది. సామాన్యుల స్థలాలు, పేదల ఇళ్లు కబ్జా అవ్వడం మనం రోజూ చూస్తూనే ఉంటాం.

Post Published By: dialnews
Updated : 27 June 2026, 6:10 PM IST

విశాఖపట్నంలో భూమాఫియా ఏ రేంజ్‌లో రెచ్చిపోతుందో చెప్పడానికి ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ బయటపడింది. సామాన్యుల స్థలాలు, పేదల ఇళ్లు కబ్జా అవ్వడం మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ.. ఏకంగా రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న ఒక పవర్‌ఫుల్ లీడర్ స్థలాన్నే కబ్జా చేస్తే? అదీ కూడా రూపాయి రెండు రూపాయలు కాదు.. ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువైన ల్యాండ్‌ను నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో మింగేస్తే ఎలా ఉంటుంది? అవును.. మీరు వింటున్నది నిజం. ఫైర్‌బ్రాండ్ లీడర్ రఘురామకృష్ణరాజు సొంత స్థలాన్నే వైజాగ్ ల్యాండ్ మాఫియా నొక్కేసింది. ఈ సంచలన స్కామ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అసలు ఆ స్థలం ఎక్కడుంది? కేటుగాళ్లు ఎలా ఫోర్జరీ చేశారు? ఈ కబ్జా వ్యవహారం ఎలా బయటపడింది?

ముందుగా ఈ స్థలం ఎక్కడుందో చూద్దాం. విశాఖపట్నంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ప్రైమ్ ఏరియా.. మధురవాడ ఐటీ సెజ్ పరిధిలోని మారుతీనగర్ లేఅవుట్. ఇక్కడ వుడా అప్రూవ్డ్ లేఅవుట్‌లో సర్వే నంబర్ 374/1 లో రఘురామకృష్ణరాజు గారికి 333.33 గజాల విలువైన ప్లాట్ ఉంది. దీని హిస్టరీ లోకి వెళ్తే.. 1989లోనే ఈ స్థలాన్ని రఘురామకృష్ణరాజు గారు లీగల్‌గా కొనుగోలు చేశారు. అప్పల నర్సమ్మ అనే ఆవిడకు జీపీఏ హోల్డర్ అయిన భూపతి వెంకటకృష్ణరాజు నుంచి రఘురామ గారు ఈ స్థలాన్ని కొని, డాక్యుమెంట్ నంబరు 6725/89 తో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ ఏరియాలో గజం భూమి ధర దాదాపు 70 వేల రూపాయల పైనే ఉంది. అంటే ఈ 333 గజాల ప్లాట్ విలువ ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం కనీసం 2 కోట్ల రూపాయల పైమాటే.

అయితే ఇక్కడే ల్యాండ్ మాఫియా తమ మార్క్ తెలివితేటలు ప్రదర్శించింది. రఘురామకృష్ణరాజు ఈ స్థలాన్ని కొన్న కేవలం ఐదు నెలలకే.. అంటే 1989లోనే.. నిందితులు ఇదే స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించారు. సుబ్రహ్మణ్యంరాజు అనే వ్యక్తి పేరుతో మొదటి దొంగ రిజిస్ట్రేషన్ కానిచ్చేశారు. ల్యాండ్ మాఫియా అంతటితో ఆగలేదు.. ఆ తర్వాత మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా ఈ స్థలాన్ని చేతులు మారుస్తూ వచ్చారు. 1993లో సత్యనారాయణమ్మ అనే ఆమె పేరు మీదకు, ఆ తర్వాత 2001లో గణపతిరాజు సాయిభాస్కర్ అనే వ్యక్తి పేరు మీదకు ఈ స్థలాన్ని బదిలీ చేసేశారు. అంటే ఒరిజినల్ ఓనర్ అయిన రఘురామకృష్ణరాజు గారికి తెలియకుండానే.. తెరవెనుక దాదాపు 20 ఏళ్లుగా ఈ స్థలం కాగితాల్లో చేతులు మారిపోతూ వచ్చింది.

ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ఈ మాఫియా బ్యాచ్.. ఈ ఏడాది మే 25, 26 తేదీల్లో ప్రాక్టికల్‌గా రంగంలోకి దిగింది. రఘురామ గారి స్థలంలో రక్షణ గోడ కట్టడం కోసం పునాదులు తీయడం స్టార్ట్ చేశారు. అయితే, అదృష్టవశాత్తూ ఆ సమయంలో రఘురామకృష్ణరాజు స్నేహితుడు లక్ష్మణ మూర్తిరాజు ఆ ఏరియాలో ఉండి ఈ విషయాన్ని గమనించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అక్కడ గోడ కడుతుండటంతో ఆయనకు డౌట్ వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు గారి దృష్టికి తీసుకెళ్లారు.

తన స్థలంలో వేరేవాళ్లు గోడ కట్టడం ఏంటని షాక్ అయిన రఘురామ గారు.. వెంటనే హైదరాబాద్ నుండి తన ఒరిజినల్ డాక్యుమెంట్లు పంపి అంతర్గతంగా పూర్తి విచారణ జరిపించారు. ఆ విచారణలో తేలిన నిజం చూసి ఆయన మైండ్ బ్లాంక్ అయింది. ఆ దొంగ డాక్యుమెంట్లలో ఉన్నది తన సంతకం కాదని.. తన సంతకాన్ని దారుణంగా ఫోర్జరీ చేసి, నకిలీ కాగితాలు సృష్టించి ఈ కబ్జాకు పాల్పడ్డారని ఆయన లీగల్ టీమ్ నిర్ధారించింది. ఏకంగా డిప్యూటీ స్పీకర్ స్థలాన్నే టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారం కాస్తా తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై రఘురామకృష్ణరాజు గారి పేరుతో విశాఖపట్నంలోని పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 20న అధికారికంగా కంప్లైంట్ అందింది.

"నా ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలిస్తే నా సంతకం ఫోర్జరీ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.. ఈ ఫిర్యాదును రిజిస్టర్ చేసి, దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలి" అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఈ ల్యాండ్ గ్రాబింగ్, ఫోర్జరీ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రికార్డులను, ఈ ఫోర్జరీ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. చూశారుగా.. ప్రభుత్వంలో అంతటి కీలక పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ స్థలానికే రక్షణ లేకపోతే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఈ భారీ భూ కుంభకోణం వెనుక విశాఖకు చెందిన ఏయే పెద్దల హస్తం ఉంది? పోలీసులు ఈ కేటుగాళ్లను ఎలా పట్టుకుంటారు అనేది చూడాలి.

Published : 
  • 27 June 2026, 6:10 PM IST