దాడులతో దద్దరిల్లుతున్న దుబాయ్… చిక్కుకుపోయిన పీవీ సింధు…!

ఇరాన్ ప్రతీకార దాడులతో దుబాయ్ దద్దరిల్లుతోంది. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రఖ్యాత బుర్జ్ అల్ అరబ్ హోటల్, పోర్ట్ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.

Post Published By: dialnews
Updated : 2 March 2026, 12:55 PM IST

ఇరాన్ ప్రతీకార దాడులతో దుబాయ్ దద్దరిల్లుతోంది. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రఖ్యాత బుర్జ్ అల్ అరబ్ హోటల్, పోర్ట్ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు ధృవీకరించారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో విమానయానానికి తాత్కాలిక అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇరాన్ సంధించిన మిస్సైళ్ల వల్ల ఎయిర్ పోర్ట్ దెబ్బతింది.ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చిన మిస్సైళ్లు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడినట్లు దుబాయ్ మీడియా తెలిపింది. రాత్రిపూట దాడుల వల్ల ఓ టెర్మినల్ సైతం ప్రభావితమైందని రాయిటర్స్ వివరించింది.

పామ్ జుమేరాలోని ఓ హోటల్ సమీపంలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. జెబెల్ అలీ పోర్ట్‌లోని ఒక బెర్త్ మంటలబారిన పడింది. ఈ పరిణామాల మధ్య భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు దుబాయ్‌లో చిక్కుకుపోయింది. విమానాశ్రయానికి సమీపంలో పేలుడు సంభవించినప్పుడు తాను అక్కడే ఉన్నానని వెల్లడించింది. ఇరాన్ దాడుల కారణంగా ఏర్పడిన ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ క్షణాలు తనకు ఎంతో భయంకరంగా గడిచాయని చెప్పుకొచ్చింది. ఎయిర్ పోర్ట్ కు అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిగిందని గుర్తు చేసుకుంది. పేలుడు జరిగిన వెంటనే దట్టమైన పొగ ఆవరించిందని, వెంటనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని ట్వీట్ లో రాసుకొచ్చింది.

ఈ సంక్షోభ సమయంలో దుబాయ్ విమానాశ్రయం స్టాఫ్, దుబాయ్ అధికారులు, భారత హైకమిషన్ నుంచి తమకు తక్షణ సహాయం అందిందని పీవీ సింధు తెలిపింది. వారి కృషి వల్ల తమ టీమ్ సురక్షితమైన ప్రదేశానికి తరలి వెళ్లినట్లు వెల్లడించింది. తమకు నిరంతర సహాయం అందించి సురక్షితంగా ఉంచినందుకు దుబాయ్‌లోని భారత హైకమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెబుతూ సింధు ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, పరిస్థితులు త్వరగా చక్కబడాలని కోరుకుంటోన్నట్లు చెప్పింది. సింధు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి బర్మింగ్‌హామ్‌కు వెళ్తాల్సి ఉంది. దుబాయ్ ఆమెకు ట్రాన్సిట్ స్టాప్. మంగళవారం ప్రారంభం కావాల్సిన టోర్నమెంట్ కోసం వెళ్తున్న ఆమె విమాన ప్రయాణాలు నిలిచిపోవడంతో దుబాయ్‌లో చిక్కుకుపోయింది. ఈ సంఘటనలతో ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానయాన కేంద్రం పూర్తిగా స్తంభించిపోయింది.

Published : 
  • 2 March 2026, 12:55 PM IST