విజయ్ దళపతి సినిమాల్లో స్టార్‌గా ఎదగడం ఒకెత్తు అయితే.. ప్రజానాయకుడిగా మారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మరో ఎత్తు. ఈ అసాధారణ ప్రయాణం వెనుక ఒక తండ్రి పట్టుదల, ఒక దర్శకుడి ముందుచూపు, అంతకుమించి ఒక వ్యూహకర్త నైపుణ్యం దాగి ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ నేడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారంటే, దానికి పునాది వేసింది, ఆ ఇటుకలను పేర్చింది నిస్సందేహంగా ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రశ్రేణి దర్శకుడిగా పేరుగాంచారు. ఆయన సుమారు 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ సామాజిక ఇతివృత్తాలతో కూడిన సినిమాలను తెరకెక్కించారు.
చిరంజీవితో 'చట్టానికి కళ్లు లేవు' లాంటి హిట్లు అందించిన ఘనత ఆయనది. అయితే, ఆయన కెరీర్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్ మాత్రం తన కుమారుడు విజయ్‌ను స్టార్‌గా మార్చడమే. విజయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ 9 సినిమాలను డైరెక్ట్ చేశారు. 1992లో వచ్చిన 'నాళైయ తీర్పు' తో మొదలై 'సెందూరపాండి', 'రసిగన్', 'దేవా', 'విష్ణు' వంటి చిత్రాల ద్వారా విజయ్‌ను మాస్ ఆడియన్స్‌కు చేరువ చేశారు. విజయ్‌ను ఒక కమర్షియల్ హీరోగా నిలబెట్టడానికి చంద్రశేఖర్ తన వృత్తిని సైతం పణంగా పెట్టారు. విజయ్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయన కంటే ఆయన తండ్రికే బలంగా ఉండేది. విజయ్ పేరు మీద అభిమాన సంఘాలను బలోపేతం చేసి "విజయ్ మక్కల్ ఇయక్కం" అనే పేరుతో వాటిని సేవా సంస్థలుగా మార్చింది చంద్రశేఖరే. పేదలకు ఉచితంగా ఆహారం అందించడం, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పుస్తకాల పంపిణీ, రక్తదాన శిబిరాలు వంటివి చంద్రశేఖర్ పర్యవేక్షణలోనే ఏళ్ల తరబడి సాగాయి.
ఒక రకంగా ఈ VMI కారణంగానే విజయ్ ఇవాళ సీఎం కాగలిగారు. 2011లో అన్నాడీఎంకేకు మద్దతు తెలపడంలో చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. విజయ్‌ను కేవలం నటుడిగానే కాకుండా, వ్యవస్థపై స్పందించే ఒక నాయకుడిగా తన సినిమాల ద్వారా మలిచారు. విజయ్ సినిమాలపై పొలిటికల్‌గా ఏ ఇబ్బంది వచ్చినా విజయ్ కంటే ముందు ఆయన తండ్రి రియాక్ట్ అయ్యేవాడు. విజయ్‌కి పొలిటికల్‌గా ఎక్కడా చెడ్డ పేరు రాకుండా అన్నీ తాను ముందుండి నడిపించేవాడు. అయితే రాజకీయ ప్రయాణంలో తండ్రీకొడుకుల మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చిన సందర్భం ఒకటుంది. 2020లో చంద్రశేఖర్ తన కుమారుడి అనుమతి లేకుండానే 'అఖిల భారత దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం' పేరుతో రాజకీయ పార్టీని ఎన్నికల సంఘం వద్ద నమోదు చేశారు.
దీనిపై విజయ్ తీవ్రంగా స్పందించారు. తన పేరును, ఫోటోను రాజకీయాల కోసం వాడుకోవద్దని తండ్రిపైనే కోర్టులో కేసు వేశారు. విజయ్ ఒత్తిడి మేరకు మరియు అభిమానుల్లో గందరగోళం తలెత్తడంతో.. చంద్రశేఖర్ ఆ పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో వారి మధ్య మాటలు కూడా లేవని వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత కొంత కాలానికి విజయ్ సొంతంగా TVK పేరుతో పార్టీ స్థాపించారు. కొడుకును సీఎంగా చూడాలనే ఆశతో ఉన్న చంద్రశేఖర్ ఆ పార్టీకోసం అహర్నిషలూ కష్టపడ్డారు. ఏళ్ల నుంచి గ్రామస్థాయిలో ఆయన పెంచిన VMI సంస్థ TVKకు బ్యాక్‌బోన్‌గా నిలించింది. ఆ బలమే టీవీకే రూపంలో తమిళనాడులో విజయకేతనం ఎగురవేసింది. ఎట్టకేలకు తమిళనాడుకు సీఎంని చేసింది.