Top story: పాక్‌కు క్యూ కట్టిన చైనా, టర్కీ సైనిక విమానాలు.. పాకిస్తాన్‌కు డేంజర్ వెపన్స్ సరఫరా నిజమేనా?

పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, కరాచీలోని మస్రూర్ స్థావరంలో అసాధారణ సైనిక కదలికలు నమోదయ్యాయి. సాధారణంగా ఏ దేశపు ఎయిర్‌బేస్‌లలో అయినా అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిర్దిష్ట విరామాలతో సాగుతాయి.

Post Published By: dialnews
Updated : 22 August 2026, 6:30 PM IST

పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, కరాచీలోని మస్రూర్ స్థావరంలో అసాధారణ సైనిక కదలికలు నమోదయ్యాయి. సాధారణంగా ఏ దేశపు ఎయిర్‌బేస్‌లలో అయినా అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిర్దిష్ట విరామాలతో సాగుతాయి. కానీ, ఇక్కడ చైనా, టర్కీలకు చెందిన భారీ సైనిక రవాణా విమానాలు నిరంతరాయంగా ఒకదానివెనుక మరొకటి ల్యాండ్ అవుతూ, తిరిగి టేకాఫ్ అవుతూ అత్యంత రద్దీగా కనిపించినట్టు నివేదికలు తెలిపాయి. ఈ పరిణామాలను భారత ఇంటెలిజెన్స్ విభాగాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇది కేవలం ద్వైపాక్షిక పర్యటనలకు సంబంధించిన వ్యవహారం కాదని, యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఒక భారీ లాజిస్టికల్ ఆపరేషన్ తరహాలోనే ఈ కదలికలు ఉన్నాయని రక్షణ రంగ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఈ మిలిటరీ రవాణఆ విమానాల ద్వారా భారీ ఎత్తున రక్షణ సంబంధిత మెటీరియల్, క్లిష్టమైన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, అధునాతన నిఘా పరికరాలు.. కాంబాట్ డ్రోన్లను పాకిస్తాన్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్ల పాత్ర అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో, చైనా, టర్కీ తయారు చేసిన అత్యాధునిక అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్‌ను పాక్ తన వద్ద నిల్వ చేసుకుంటోంది. అయితే, ఈ వేగవంతమైన ఎయిర్‌లిఫ్ట్ వెనుక పాకిస్తాన్ తన సైనిక బలాన్ని త్వరితగతిన ఆధునీకరించే కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఒకవైపు ఈ అసాధారణ ఎయిర్‌లిఫ్ట్ కొనసాగుతుండగానే, మరోవైపు క్షిపణి ప్రయోగానికీ పాక్ సిద్ధపడింది. పాకిస్తాన్ తన స్వదేశీ 'ఫతా సిరీస్ రాకెట్ లేదా క్షిపణి ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తూ అధికారికంగా నోటమ్ జారీ చేసింది.

ఇలా ఒకవైపు చైనా, టర్కీల నుంచి భారీగా సైనిక సామగ్రిని దిగుమతి చేసుకుంటూనే, మరోవైపు సరిహద్దులకు సమీపంలో క్షిపణి ప్రయోగాలను చేపట్టడం ముమ్మాటికీ ఇండియాను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కవ్వింపు చర్యేనని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలకు పునాదిగా మారిన మరో కీలక అంశం... ఆగస్టు 7నాటి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్. పాకిస్తాన్, టర్కీ, సౌదీ మధ్య కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ముగ్గురిలో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా, దానిని మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామన్నది ఈ ఒప్పందంలోని ప్రధాన నిబంధన. పాశ్చాత్య, ఆసియా రక్షణ విశ్లేషకులు దీనిని సరికొత్త 'ఇస్లామిక్ నాటోగా పేర్కొంటున్నారు. ఈ కూటమి భవిష్యత్తులో భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక ఉమ్మడి శక్తిగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయా అన్న కోణంలో లోతైన విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌లో అదే జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొన్నేళ్లుగా పాకిస్తాన్‌కు టర్కీ ఒక ప్రధాన రక్షణ భాగస్వామిగా అవతరించింది. ముఖ్యంగా ఏరోస్పేస్, నేవల్ సిస్టమ్స్, డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాల బంధం బాగా బలపడింది. టర్కీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ 'కాన్' ప్రాజెక్టులో ఇప్పటికే దాదాపు 200 మంది పాకిస్తానీ ఏరోస్పేస్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. పాకిక్‌ను అధికారికంగా ఈ ఫైటర్ జెట్ ప్రాజెక్టులోకి భాగస్వామిగా చేర్చుకునేందుకు ఎర్డోగన్ ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టింది. దీనిద్వారా అత్యాధునిక స్టెల్త్ సాంకేతికత సొంతం చేసుకుని, భవిష్యత్ గగనతల పోరులో భారత్‌కు సవాలు విసరాలని పాక్ ఎత్తుగడలు వేస్తోంది. ఇక్కడ పాకిస్తాన్‌కు దశాబ్దాలుగా మద్దతిస్తున్న చైనా పాత్ర మరింత ఆందోళనకరంగా మారింది. పాక్ వైమానిక దళానికి అవసరమైన యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, గగనతల నిఘా రాడార్లను చైనానే సమకూరుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ తమ ఏవియేషన్ ఇండస్ట్రీ నిపుణులు పాకిస్తాన్ సైన్యానికి క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారాన్ని అందించారని చైనా అధికారికంగానే అంగీకరించింది. భారత సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్తతలు చెలరేగేలా, పాకిస్తాన్‌ను ఒక పావుగా వాడుకోవడమే బీజింగ్ దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తోంది.

నిజానికి.. ఎన్ని దేశాలు ఏకమైనా భారత్‌ను టచ్ చేసే సీన్ ఉండదు. ఎందుకంటే,భారత రక్షణ వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు రష్యా నుంచి సమకూర్చుకున్న అత్యాధునిక ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు భారత ఆకాశానికి తిరుగులేని రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. వీటికి తోడు రాఫెల్ యుద్ధ విమానాలు, స్వదేశీ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు శత్రువుల ఎలాంటి క్షిపణి దాడినైనా, ఎంతటి అధునాతన డ్రోన్ దాడులనైనా సెకన్ల వ్యవధిలోనే గగనతలంలోనే నేలమట్టం చేసే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గతేడాది ఆపరేషన్ సిందూర్‌లో వచ్చిన రిజల్టే ఇందుకు ఉదాహరణ. సిందూర్ నాటి పరాజయాన్ని గుర్తుంచుకునే పాకిస్తాన్ సైతం చైనా, టర్కీ నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. కానీ, ఎన్ని శక్తులు చేతులు కలిపినా, తెరవెనుక ఎన్ని ఆయుధాలు పోగుచేసినా, సరిహద్దుల్లో రక్షణ కవచాన్ని ఛేదించి భారత భూభాగాన్ని టచ్ చేయడం అసాధ్యం. ఎందుకంటే సరిహద్దుల్లో ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొని, శత్రువులకు దిమ్మతిరిగే రీతిలో సమాధానం చెప్పేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది.

 

Published : 
  • 22 August 2026, 6:30 PM IST