తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ ఇప్పుడు షేక్ చేస్తోంది. శనివారం నాడు మేడ్చల్ వేదికగా కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సేనను ప్రకటించారు. ఒకప్పుడు బీఆర్ఎస్‌కు ఊపిరిగా ఉన్న 'టీఆర్ఎస్' బ్రాండ్‌ను ఇప్పుడు కవిత తన ఖాతాలో వేసుకోవడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి..? ఈ ప్రకటన వెనుక కేవలం కవిత ఆశయాలు మాత్రమే ఉన్నాయా..? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రచించిన ఒక భారీ 'పొలిటికల్ మాస్టర్ ప్లాన్' ఉందా..? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే కవిత కాంగ్రెస్ కు బి-టీమ్‌గా మారిపోయారని, రేవంత్ రెడ్డికి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నిర్ణయం కేసీఆర్ పార్టీకి ఎంతటి నష్టాన్ని చేకూర్చబోతోంది..? కాంగ్రెస్ దీన్ని ఎలా అనుకూలంగా మార్చుకోబోతోంది..? రాజకీయాల్లో పేరుకు ఉన్న పవర్ మామూలుది కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయిన పేరు టీఆర్ఎస్. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఆ పార్టీ తన 'తెలంగాణ అస్తిత్వాన్ని' కొంత కోల్పోయిందనే అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. ఇప్పుడు కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని పేరు పెట్టడం వల్ల, పొడి అక్షరాలు మళ్ళీ టీఆర్ఎస్ అనే వస్తాయి. ఇది సామాన్య ఓటర్లలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం ఉంది.
పాత టీఆర్ఎస్ పట్ల సానుభూతి ఉన్న శ్రేణులు, కేసీఆర్ పట్ల గౌరవం ఉన్నా.. ప్రస్తుత బీఆర్ఎస్ వైఖరి నచ్చని వారు కవిత వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. ఇది బీఆర్ఎస్ పునాదులనే కదిలించే మాస్టర్ ప్లాన్ లాంటిది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఓట్లు చీలిపోవడం అంటే, అది అధికార కాంగ్రెస్‌కు అయాచిత వరమే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గతంలో బీఆర్ఎస్ వైపు వెళ్లేవి. ఇప్పుడు కవిత కొత్త పార్టీ రావడంతో ఆ ఓట్లు రెండుగా చీలిపోతాయి. దీనివల్ల అతి తక్కువ మెజారిటీతో గెలిచే స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సులభంగా బయటపడొచ్చు అనే మాట వినపడుతోంది.మరో కోణంలో ఆలోచిస్తే.. రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని 'వ్యూహకర్త' అని ఎందుకు అంటారో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్. ఆ పార్టీ ఓటు బ్యాంకును చీల్చకపోతే.. రేవంత్ రెడ్డికి ప్రశాంతత ఉండదు. 'తెలంగాణ రాష్ట్ర సేన' పేరుతో కవితను రంగంలోకి దింపడం ద్వారా.. బీఆర్ఎస్ లో ఉన్న పాత టీఆర్ఎస్ సానుభూతిపరులను ఆకర్షించడం రేవంత్ ప్లాన్ కావచ్చనే మాట వినపడుతోంది. విపక్ష ఓట్లు ఎంతగా చీలిపోతే, అధికార పక్షానికి అంత లాభం. కవిత విడిపోయేలా ప్రోత్సహించడం ద్వారా కేసీఆర్, కేటీఆర్ బలాన్ని సగానికి తగ్గించే వ్యూహం ఇందులో కనిపిస్తోంది.
గత కొన్ని నెలలుగా కవిత వైఖరి గమనిస్తే.. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్కడా ఘాటైన విమర్శలు చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నా కవిత మౌనంగా ఉండటం చాలా అనుమానాలకు దారితీసింది. తనపై ఉన్న పాత కేసుల నుంచి రక్షణ పొందడానికి లేదా తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితో ఆమె 'అండర్ గ్రౌండ్ డీల్' కుదుర్చుకున్నారా..? అనే విమర్శలు బీఆర్ఎస్ నేతలే చేస్తున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్ కేడర్ లో గందరగోళం మొదలవుతుంది. ఇది పరోక్షంగా రేవంత్ రెడ్డికి 'రెడ్ కార్పెట్' పరిచినట్లే.రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రకారం.. కవిత పార్టీ ఒకవేళ 5 నుండి 10 శాతం ఓట్లు చీల్చినా, బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు పూర్తిగా మాయమవుతాయి.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండకుండా.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కవిత అని మార్చడం ద్వారా కాంగ్రెస్ గెలుపును సులభం చేయడం ఈ ప్లాన్ లోని అసలు కిటుకుగా కనపడుతోంది. రేవంత్ రెడ్డి పథకాలు ఒకవైపు, కవిత 'ఆడబిడ్డ' సెంటిమెంట్ మరోవైపు కలిస్తే.. బీఆర్ఎస్ కు మహిళా ఓట్లు అస్సలు పడకుండా చేయవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.ఏది ఎలా ఉన్నా.. 'తెలంగాణ సెంటిమెంట్' ఇప్పుడు కవిత వైపు ఉందా లేదా కేసీఆర్ వైపు ఉందా అనే సందిగ్ధతను సృష్టించి కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెంచే ఛాన్స్ కనపడుతోంది. ఏడు నెలల క్రితం బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత, తన అన్న కేటీఆర్ నాయకత్వంతో వచ్చిన విబేధాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ తన మూలాలను మర్చిపోయిందని, తెలంగాణ ఆకాంక్షల కోసం మళ్ళీ ఒక ప్రాంతీయ పార్టీ అవసరమని ఆమె వాదిస్తున్నారు. మేడ్చల్ లో ఆమె చేసిన ప్రసంగం చూస్తుంటే.. నిరుద్యోగులు, మహిళల అండతో కొత్త విప్లవం తేవాలని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తోంది.