పశ్చిమాసియా...క్షిపణులు, డ్రోన్ల దాడులతో కల్లోలంగా మారింది. ప్రపంచ ఇంధన మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హత్యతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధి మూసివేతతో...భారత్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోసారి రష్యా నుంచి ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుందా ? ట్రేడ్ డీల్‌ను పక్కన పెడుతుందా ? ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.ఇరాన్-అమెరికా వార్...ప్రపంచానికి తలనొప్పులుగా మారింది. యుద్ధం మరో నెల రోజుల పాటు కొనసాగుతుందన్న ట్రంప్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇటు అమెరికా-ఇజ్రాయెల్, అటు ఇరాన్...ఎవరు తగ్గడం లేదు. పరస్పరం ప్రతీకార దాడులతో రెచ్చిపోతున్నాయి. అక్కడి యుద్ధం మిగిలిన ప్రపంచానికి కొత్త సమస్యలు సృష్టిస్తోంది.
ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో...అనేక దేశాలకు చమురు కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది. మెజార్టీ దేశాలకు హర్ముజ్ జలసంధి మీదుగానే చమురు రవాణా జరుగుతోంది. ఇప్పటికే 7వందలకు పైగా చమురు నౌకలు నిలిచిపోయాయి. యుద్ధం కారణంగా పలు దేశాలు ప్రత్యామ్నాయాలపై ఫోకస్ చేశాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్...ఇతర మార్గాల్లో చమురు కొనుగోలుపై దృష్టి పెట్టింది. ఇంధన భద్రతను కాపాడుకోవడానికి...మళ్లీ రష్యా వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత్‌కు రష్యా చమురు తప్ప వేరే గమ్యం కనిపించడం లేదు. రష్యా నుంచి కొనుగోళ్లు పెంచితే...అమెరికా మళ్ళీ భారీ టారిఫ్‌లను విధించే అవకాశమూ లేకపోలేదు. దేశీయ అవసరాల కోసం రష్యా ఇంధనాన్ని భారత్ ట్రంప్ కార్డుగా వాడుకునే అవకాశం ఉంది.
వాణిజ్య ఒప్పందంతో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను తగ్గించింది. అమెరికా లేదా వెనిజువెలా నుంచి తీసుకోవాలని వాషింగ్టన్ షరతు విధించింది. అందులో భాగంగానే అమెరికా భారత్‌పై విధిస్తున్న టారిఫ్‌ను 50శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ప్రపంచ చమురు సరఫరాలో 20శాతం హర్మూజ్ మార్గం ద్వారానే గుండానే సాగుతుంది. భారత్ రోజూ వినియోగించే 60 లక్షల బారెళ్ల చమురులో దాదాపు 27 లక్షల బారెళ్లు ఈ మార్గం నుంచే రావాలి. భారత్ దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీలో 60శాతం, ఎల్‌పీజీలో మెజారిటీ భాగం ఈ జలసంధి ద్వారానే సరఫరా అవుతుంది. ఖతార్ వంటి దేశాల నుంచి ఉత్పత్తి నిలిచిపోవడంతో భారత్‌లో ఇప్పటికే గ్యాస్ కోతలు మొదలయ్యాయి.
పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై నియంత్రణ, ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు సరఫరాలో 10శాతం నుంచి 30శాతం వరకు కోత విధించారు. భారత్ వద్ద ఉన్న చమురు నిల్వలు 90 రోజుల లోపు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి. ఈలోపు పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోకపోతే భారత్‌లో ఇంధన లభ్యతపై పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు యుద్ధం కారణంగా...రష్యా చమురు కొనుగోళ్లను భారత్ మళ్లీ పెంచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. డిసెంబరు నెలలోనూ భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యానే నిలిచిందనే విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కానీ నవంబరుతో పోలిస్తే, ఈ నెలలో భారత్‌కు రష్యా చమురు సప్లై 25 శాతం మేర తగ్గిందని తెలిపారు.
దశాబ్దాల తరబడి ముడి చమురు కోసం పశ్చిమాసియాలోని అరబ్ దేశాలపై ఆధారపడిన భారత్...2022 నుంచే రష్యా వైపు మొగ్గు చూపుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫలితంగా ఐరోపా దేశాల నుంచి రష్యాకు ముడి చమురు ఆర్డర్లు ఆగిపోయాయి. దీంతో చౌక ధరకే చమురును పుతిన్ సర్కారు విక్రయిస్తోంది. దీన్ని అదునుగా భావించిన భారత్‌లోని చమురు శుద్ధి కర్మాగారాలు, పెద్ద మొత్తంలో రష్యా ఆయిల్ కోసం ఆర్డర్లు పెట్టింది. అందుకే రష్యా నుంచి భారత్‌కు వచ్చే చమురు దిగుమతుల వాటా 1 శాతం నుంచి 40 శాతానికి పెరిగిపోయింది.
ట్రేడ్ డీల్ తర్వాత...రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును డిసెంబరులో భారత్ గణనీయంగా తగ్గించింది. ట్రేడ్ డీల్ తర్వాత...భారత్‌కు రష్యా చమురు సప్లై సగటున రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గిందని అంచనా. నవంబరు నెలలో రష్యా నుంచి భారత్‌కు సగటున రోజుకు 1.84 మిలియన్ బ్యారెళ్ల చమురు వచ్చింది. 2022 డిసెంబరు తర్వాత రష్యా నుంచి భారత్‌కు చమురు సరఫరా ఇంతలా తగ్గడం ఇదే తొలిసారి. అయితే భారత్‌లోని చమురు శుద్ధి కర్మాగారాలన్నీ, అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా ముడి చమురు కంపెనీల నుంచి కొనుగోళ్లను ఇంకా కొనసాగిస్తున్నాయి.