Top story:దేశానికి…కరువు కమ్ముకొస్తోందా…? ఎల్‌నినోతో జనం పిట్టల్లా రాలిపోతారా…?

ప్రపంచం ముందు మహా కరువు పొంచి ఉందా ? ఎల్‌నినో ఎఫెక్ట్‌ భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించబోతోందా ? తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ రంగం చతికిల పడుతుందా ? ఆహారం దొరక్క జనం పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉందా ?

Post Published By: dialnews
Updated : 28 April 2026, 11:28 AM IST

ప్రపంచం ముందు మహా కరువు పొంచి ఉందా ? ఎల్‌నినో ఎఫెక్ట్‌ భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించబోతోందా ? తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ రంగం చతికిల పడుతుందా ? ఆహారం దొరక్క జనం పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉందా ? 1876-77 నాటి కరువు పరిస్థితులు రిపీట్‌ అవుతాయా ? వాతావరణ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ? ఇప్పటి నుంచి మేల్కోకపోతే...జనానికి తిప్పలు తప్పవా ? మలమల మాడిపోవడం ఖాయమేనా ?ప్రపంచానికి ఎల్‌నినో రూపంలో ముప్పు ముంచుకొస్తొంది. అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినో ఏర్పడే ముప్పు ఉందన్నది పలు నివేదికల హెచ్చరిస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన విపత్తుకు సిద్ధంగా ఉండాలంటూ పర్యావరణ వేత్తలు అప్రమత్తం చేస్తున్నారు. ఈసీఎమ్​డబ్ల్యూఎఫ్​ అంచనాల ప్రకారం జూన్ నుంచి ఇది ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు.

దశల వారీగా బలపడే అవకాశాలున్నాయి. ముందుగా మే నెలలో ఎల్‌నినో ఏర్పడుతుంది. క్రమంగా ఆగస్టు నాటికి ఇది బలపడుతుందన్నది అంచనా. అదే నెలలో సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇదే జరిగితే వాతావరణ మార్పులు మరింత తీవ్రమవుతాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి. సమయానికి రుతు పవనాల జాడ కనిపించదు. అసలు వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరూ ఊహించని మార్పులు వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఏడాది అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినో ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు.

ఈ ప్రభావం భారత్‌పైనా గట్టిగానే ఉంటుందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్- ఈసీఎమ్​డబ్ల్యూఎఫ్​ సంస్థ అంచనా వేసింది. 1997లోనూ శక్తిమంతమైన ఎల్‌నినో ఏర్పడింది. ఆ సమయంలో పసిఫిక్ మహా సముద్ర జలాల ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు మించాయి. అప్పుడే భారత్‌లోని ఉత్తరాది, మధ్య రాష్ట్రాలపై ప్రభావం గట్టిగా పడింది. అయితే ఈ సారి అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉండడం వల్ల పలు రాష్ట్రాల్లో కరవు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఇందుకు తగ్గట్టుగా అప్రమత్తమై చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలని చెబుతున్నారు.

సూపర్​ ఎల్‌నినో ప్రభావంతో..1876-1877 నాటి పరిస్థితులను తలపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా కరువు విలయ తాండవం చేసింది. 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు నీళ్లు లేక.. తిండి దొరక్క ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క భారత్‌లోనే 96 లక్షల మంది దాకా కరువు కాటకాలతో బక్కచిక్కి బొక్కలు ఎండిపోయి ప్రాణాలు కోల్పోయారు. బాంబే, మైసూరు, మద్రాస్​, హైదరాబాద్​ ప్రావిన్స్‌‌‌‌లలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి.. పంటలు సరిగ్గా పండలేదు. ఆ ఎఫెక్ట్​ దేశమంతటా పడింది. తీవ్రమైన కరువు సంభవించింది. లక్షలాది మంది రైతులు, నేత కార్మికులంతా కూలీ పనులు చేసుకునేందుకు ఉత్తరాదికి వలస వెళ్లారు. ఇప్పుడు వచ్చే ఎల్‌నినో 1877 నాటి సూపర్ ఎల్‌నినో అంతటి తీవ్రంగా ఉంటుందేమోనని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఇప్పటికే ప్రపంచ యుద్ధాలతో అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ మార్కెట్లు.. మరింత పతనమ్యే ముప్పు ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వరదలు రాక ప్రపంచ వాణిజ్యం కూడా పడిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ఉష్ణోగ్రతలు పెరిగి కార్చిచ్చుల ఘటనలు పెరుగుతాయి. మూగజీవాలకూ ఇబ్బందులు వస్తాయి. ఐఎండీ అంచనాల ప్రకారం 2026 రుతుపవనాల వర్షపాతం సుమారు 92 శాతం మాత్రమే ఉండే అవకాశముంది. ±5 శాతం మార్పు ఉండొచ్చని తెలిపింది. ఇది గత 30 సంవత్సరాల సగటు కంటే తక్కువని పేర్కొంది. జూన్‌లో సాధారణ వర్షపాతం సుమారు 101 శాతం, జులైలో 95శాతం, ఆగస్టులో 92శాతం, సెప్టెంబర్​లో 89శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అంటే రుతుపవనాల ప్రారంభంలో మంచి వర్షాలు పడినా, తరువాతి నెలల్లో క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్​ తెలంగాణపై తీవ్రంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మన రాష్ట్రంలో వర్షాధార పంటలేవీ లేన్నప్పటికీ నదీ జలాలపైనే ఆధారపడ్డాం కాబట్టి ఎఫెక్ట్​ ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.

మహారాష్ట్ర, కర్నాటకలకు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. కృష్ణా, గోదావరి నదులకు వరదలు చాలా వరకు తగ్గుతాయని అంటున్నారు. ఫలితంగా మన దగ్గర ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఉండక.. ఇరిగేషన్‌‌‌‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. దీంతో నదీ జలాలపైనే ఆధారపడుతున్న మన రాష్ట్రానికి అది గట్టి దెబ్బ అని విశ్లేషిస్తున్నారు.పలు అధ్యయనాల ప్రకారం 1982-83, 1997-98, 2015-16 మధ్య కాలంలో ఈ స్థాయిలో వాతావరణ మార్పులు సంభవించాయి. మళ్లీ ఇన్నాళ్లకు సూపర్ ఎల్‌నినోతో అంతకు మించి మార్పులు చూడబోతున్నామని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వందేళ్లలో ఎప్పుడూ చూడని అత్యంత శక్తిమంతమైన సూపర్ ఎల్‌నినోగానూ అభివర్ణిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం భారత్‌పైనా అధికంగానే ఉండనుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ మేరకు వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. ఫలితంగా ఇక్కడి పంటలపై ప్రభావం పడుతుంది. అంతే కాదు భారత్‌లో ఉష్ణోగ్రతలూ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది.

రికార్డు స్థాయిలో వేడి పెరుగుతుంది. అంతర్జాతీయ వాతావరణ సంస్థల అంచనాల ఆధారంగా భారత్‌లోని ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ కొన్ని కీలక విషయాలు వెల్లడించింది. ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా భారత్‌లో ఈసారి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవచ్చు. జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ ముగిసేంత వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. భారత్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియాలోనూ కరవు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా పంట దిగుబడులపై ప్రభావం పడుతుంది. ఆర్థికంగా, ఆహార భద్రతా పరంగా సమస్యలు వస్తాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే ఏడాది మొదటి వరకూ ఈ ఎల్‌నినో ప్రభావం ఉంటుంది. అంటే అప్పటి వరకూ ఇబ్బందులు తప్పకపోవచ్చు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై అల్లాడే పరిస్థితులు వస్తాయి. 2027 అనేది చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు.

పసిఫిక్ మహా సముద్రంలోని జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కడాన్నే ఎల్‌నినో అంటారు. ఎల్‌నినో అనేది ఓ స్పానిష్ పదం. ఇంగ్లీష్‌లో ది బాయ్ అనేది దీనికి అర్థం. ప్రతి 2 లేదా 7 సంవత్సరాల కు ఓసారి పసిఫిక్ మహా సముద్రంలో ఈ ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది. 2023-24 మధ్య కాలంలో ఈ ప్రభావం కనబడింది. ఇప్పుడు మరోసారి ఎల్‌నినో ఏర్పడనుంది. ఇది వచ్చినప్పుడు వాతావరణ పరిభాషలో వార్మ్ ఫేజ్ అంటారు. సముద్ర జలాలు వేడెక్కే దశ అన్నమాట. సాధారణంగా పసిఫిక్ మహా సముద్రం పరిసరాల్లో తూర్పు నుంచి పశ్చిమానికి బలమైన గాలులు వీస్తుంటాయి. అంటే అమెరికా వైపు నుంచి అటు ఆసియా వైపు వెళ్తాయి. ఈ గాలి ఓ బ్లోయర్‌లా పని చేసి సముద్ర జలాల ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతను లాగేసుకుంటాయి. ఎప్పుడైతే ఈ గాలులు వీచడం ఆగిపోతుందో అప్పుడే ఎల్‌నినో ఏర్పడిందని అంటారు. ఫలితంగా సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కుతాయి. రానురాను ఇవి చిక్కగా మారతాయి. సముద్రపు లోతులో నుంచి చల్లని నీరు పైకి ఉబికి వచ్చే అప్‌వెల్లింగ్ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. ఈ కారణంగానే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

ఎల్‌నినో తీవ్రత దశల వారీగా పెరిగాక అది సూపర్ ఎల్‌నినోకి దారి తీస్తుంది. అంటే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అర్థం. సూపర్ ఎల్‌నినో దశలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఊహించని విధంగా వర్షాలు పడతాయి. వరదలు ముంచెత్తుతాయి. మరో చోట తీవ్ర కరవు వస్తుంది. వర్షం జాడే ఉండదు. మరి కొన్ని చోట్ల ఎండలు మండిపోయి ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరుగుతాయి. కార్చిచ్చులూ ఏర్పడీ అడవులన్నీ దహించుకుపోతాయి. ఎల్‌నినో ప్రభావం పెరిగే కొద్దీ వీటి తీవ్రత తగ్గడమో, పెరగడమో జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది ఏర్పడనున్న సూపర్ ఎల్‌నినో జూన్‌-ఆగస్టు మధ్యలో మొదలై దాదాపు సంవత్సరం చివరి వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాదు ఈ సమయంలో పసిఫిక్ సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 2.5 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతుంది. అయితే ఈ సారి మాత్రం సముద్ర జలాల ఉష్ణోగ్రతలు అంతకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నది ఓ అంచనా.

 

Published : 
  • 28 April 2026, 11:28 AM IST