కొద్ది రోజుల్లో ఏపీ క్యాబినెట్ ని ప్రక్షాళన చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇద్దరు ...ముగ్గురు పాత మంత్రులను తొలగించి , కొత్త వాళ్లకు చోటు కల్పించబోతున్నారు.నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి క్యాబినెట్ విస్తరణలో చోటు ఖాయమని పక్కాగా తెలిసింది.నిజానికి ప్రశాంతికి 2024లో కూటమి సర్కారు ఏర్పడినప్పుడే మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే జిల్లా, కులాల సమీకరణాల్లో అప్పట్లో ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు చంద్రబాబు. అంతేకాక ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వేమిరెడ్డి దంపతులే రికమండు చేయడంతో , చివరికి ఆనంకి క్యాబినెట్లో చోటిచ్చి, ప్రశాంతి రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ లో సభ్యురాలిగా సభ్యురాలుగా నిర్మించారు.
ఇటీవలే టిడిపి పోలీస్ బ్యూరోలో కూడా వేమిరెడ్డి ప్రశాంతి చోటు సంపాదించారు. వైసిపి హయాంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత జగన్ నియంత పోకడలు భరించలేక ఆయనతో విభేదించి భార్యతో కలిసి టిడిపిలో చేరారు.2024 ఎన్నికల్లో వేమిరెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్, ఆయన భార్యా ప్రశాంతికి కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీని, ఆర్థికంగా చాలా ఆదుకున్నారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఎన్నికల ఖర్చు అంతా వేమిరెడ్డి దంపతులే భరించారు. నిజానికి మొన్న మే నెలలో టిడిపి మహానాడు వేమిరెడ్డి దంపతుల కోసమే నెల్లూరులో నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అది ఆ తర్వాత రద్దయింది. టిడిపి మహానాడు ఖర్చు కూడా మొత్తం తామే భరిస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే టికెట్ తో పాటు మంత్రి పదవి కూడా వేమిరెడ్డి ప్రశాంతికి ఇస్తామని ఎన్నికల ముందే చంద్రబాబు హామీ ఇచ్చి ఉన్నారు. ఆలస్యంగా నైనా అది ఇప్పుడు పూర్తి చేస్తున్నారు.కోవూరు వైసిపి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ప్రశాంతి రెడ్డికి బంధువే అవుతారు. మొన్నటి ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైనే భారీ మెజారిటీతో గెలిచారు. వేమిరెడ్డి ప్రశాంతిని టార్గెట్ చేస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి తరచూ వ్యంగంగా కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. గతంలో ప్రశాంతి రెడ్డిని విమర్శించినందుకు ఆమె అనుచరులు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడులు కూడా చేసి ఇల్లు ధ్వంసం చేశారు. ఆర్థికంగా బలమైన శక్తి కావడంతో వేమిరెడ్డి దంపతులు నెల్లూరు జిల్లాలో బలంగానే పాతుకు పోయారు. ముఖ్యంగా టిడిపిలో లోకేష్ కి ఈ కుటుంబం బాగా దగ్గరయింది. ఈ సమీకరణాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతి రెడ్డికి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించారు .
పార్టీలో చేరి రెండేళ్లు కాకుండానే... ప్రశాంతిని ఏకంగా పోలీట్ బ్యూరో సభ్యురాలు చేయడంపై పార్టీలో విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలను చంద్రబాబు లోకేష్ ఇద్దరు పెద్దగా లెక్క చేయలేదు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని సీనియర్ నేతలకు నచ్చ చెప్పారు త్వరలో ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరిగితే దాన్లో కూడా ప్రశాంతికి చోటు ఇస్తే మరికొన్ని విమర్శలు తప్పవు. కానీ పార్టీని అన్ని రకాలుగా ఆదుకుంటున్న వేమిరెడ్డి దంపతులకు కచ్చితంగా సముచిత స్థానం ఇవ్వాల్సిందేనని లోకేష్ బలంగా ఉన్నారు. వేమి రెడ్డి ప్రశాంతి మంత్రి అయితే టిడిపిలో చేరిన రెండేళ్లలో ఎమ్మెల్యే, టీటీడీ సభ్యురాలు, మంత్రి పదవులు దక్కించుకున్న ఏకైక నేతగా రికార్డు స్థాపిస్తారు. అయితే వేమిరెడ్డి ప్రశాంతి కూడా జిల్లాలో మిగిలిన నేతలు అందరిని కలుపుకొని పోవడం, ఎటువంటి విభేదాలు లేకుండా జిల్లాలో రాజకీయాలు చేయడం వల్ల ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు లోకేష్ ఇద్దరికీ తేలికైంది. జిల్లాలో కూడా మిగిలిన అసలు ఎవరూ ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు.