రాజకీయం అంటేనే ఒక నిప్పుల కొలిమి. ఇక్కడ గెలవాలంటే శత్రువులనే కాదు, సొంత మనుషుల నుంచి వచ్చే విమర్శలను, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే అవమానాలను కూడా భరించాలి. గడప దాటి బయటకు వచ్చేటప్పుడు ఇంటి మద్దతు లేకపోతే ఏ మనిషైనా కుంగిపోతాడు. కానీ, ఇద్దరు వ్యక్తులు మాత్రం చరిత్రను తిరగరాశారు. వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నమైనా.. నిలబడ్డారు, పోరాడారు, గెలిచారు. వారే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తమిళనాడు రాజకీయ విప్లవం విజయ్. ఇంటిని వదిలిన వాడు దేశానికి అంకితమవుతాడు అంటారు.. ఈ ఇద్దరు నాయకుల విషయంలో అది అక్షరాలా నిజమైంది.
రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన దాడులు జరిగాయి. ఆయన రేణు దేశాయ్తో విడిపోవడంపై ప్రత్యర్థులు 'ముగ్గురు భార్యలు' అంటూ నీచమైన విమర్శలు చేశారు. ఆ నిందలను, ఆ అవమానాలను భరిస్తూనే ఆయన జనసేన పార్టీని స్థాపించారు. అంతకు ముందు రేణు దేశాయ్.. వ్యక్తిగత విభేదాలతో పవన్ ను వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ అన్నాలేజోనోవోను వివాహం చేసుకున్నారు. 2014 నుంచి ఆమె.. పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడ్డారు.
2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు, వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ ప్రత్యర్థులు ఏకిపారేసినప్పుడు కూడా ఆయన వెనకడుగు వేయలేదు. ఆ బాధను దిగమింగుకుని, జనం కోసం నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో ఆయన చూపిన పట్టుదల, చేసిన త్యాగం నేడు ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంను చేశాయి. నిన్న ఎగతాళి చేసిన నోళ్లే నేడు 'సార్' అని పిలుస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ విజయం కాదు, ఆయన వ్యక్తిత్వానికి దక్కిన గౌరవం.
ఇక విజయ్ విషయానికి వస్తే.. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారనగానే ఆయన కుటుంబంలో కూడా కలతలు మొదలయ్యాయి. ఆయన భార్య సంగీతతో విభేదాలు ఉన్నాయని, ఆమె ఆయనకు దూరంగా ఉంటుందని మీడియా కోడై కూసింది. అగ్నికి ఆజ్యం పోసినట్లు నటి త్రిషతో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సొంత తండ్రితో కూడా న్యాయపరమైన పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా విజయ్ ఎక్కడా పొరపడలేదు, పలచబడలేదు. ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూనే తమిళగ వెట్రి కళగం పార్టీని నిర్మించారు.
ఎన్నికలకు ముందు భార్య సంగీత రోడ్డు మీదకు వచ్చారు. కోర్ట్ లో కేసు వేసారు. విజయ్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రత్యర్ధులు కూడా క్యారెక్టర్ పై విమర్శలు చేసారు. ఫైనల్ గా.. తాజా ట్రెండ్స్ ప్రకారం, విజయ్ 2026లో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ లాగే విజయ్ కూడా వ్యక్తిగత విమర్శలను తన ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకున్నారు.
రేణు దేశాయ్ అటు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేక, ఆయన ఎదుగుదలకు తోడుగా ఉండాల్సింది పోయి, విమర్శల పాలు చేయడం ద్వారా సామాన్య జనం దృష్టిలో చులకనయ్యారు. రెండేళ్ళ క్రితం పవన్ డిప్యూటీ సీఎంగా అఖండ విజయం సాధిస్తే.. ఆ విజయ గర్వంలో పాలుపంచుకునే అర్హతను ఆమె కోల్పోయారు. అటు తమిళనాడులోనూ సంగీత పరిస్థితి అలాగే ఉంది. దళపతి విజయ్ దశాబ్దాల కష్టానికి ఫలితం దక్కుతున్న వేళ, ఆయన పక్కన ఉండి ధైర్యం ఇవ్వాల్సింది పోయి, విభేదాలతో దూరం జరగడం ఆమె చారిత్రక తప్పిదమే. విజయ్ నేడు సీఎంగా పట్టాభిషిక్తుడు అవుతున్న వేళ.. అండగా నిలవాల్సిన భార్యే శత్రువులకు ఆయుధంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.