"కాలు జారితే వెనక్కు తీసుకోవచ్చు.. కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేం". ఈ పాత సామెత ఇప్పుడు పొరుగు రాష్ట్రం తమిళనాడులో అక్షరాలా నిజమైంది. సాధారణంగా సినిమాల్లో, వీధుల్లో మాత్రమే వినిపించే ఒక ముతక డైలాగ్‌ను, ఒక బాధ్యతాయుతమైన పబ్లిక్ లైఫ్‌లో.. అదీ బహిరంగ సభలో వాడి, ఇప్పుడు చినిగి చాటయ్యాక వెనక్కు తీసుకోలేక నానా తంటాలు పడుతోంది డీఎంకే పార్టీ. గతంలో సనాతన ధర్మంపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా రచ్చ రేపిన అదే చిన్న స్టాలినే, ఈసారి కూడా ఒక ఇండీసెంట్ కామెంట్‌తో బోనెక్కి నిలబడ్డాడు.
ఎప్పుడూ సీరియస్ పాలిటిక్స్ కి కేరాఫ్ అనుకున్న తమిళనాడు, ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇలాంటి సిల్లీ పాలిటిక్స్‌తో మోతెక్కిపోతోంది. అయితే, ఈ మొత్తం రాజకీయ యుద్ధంలో.. రాజకీయాలకు సమాన దూరంలో నిలబడ్డ ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సనాలిటీ మాత్రం నటి త్రిషా క్రిష్ణన్. అసలు ఉదయనిధి నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క మాట ఏంటి? అది తమిళనాట ఎలాంటి మంటలు రేపింది? కేవలం 24 గంటల్లోనే కేసులు, ఎఫ్ఐఆర్, అరెస్టులు, బెయిల్ దాకా వ్యవహారం ఎలా నడిచింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు, లోతైన విశ్లేషణతో తెలుసుకుందాం.
అసలు ఈ పొలిటికల్ రగడ ఎక్కడ మొదలైంది? ఎందుకింతలా ముదిరింది అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం కడుతున్న మేకేధాతు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే పెద్ద ఎత్తున రోడ్డెక్కి రచ్చ చేస్తోంది. ఈ నీటి సమస్యపై డీఎంకే నాయకులు నిరసనలు తెలుపుతూ, సభలు పెడుతూ పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, తాము ఇంతలా గొంతు చించుకుంటున్నా, అక్కడ కొత్తగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ మాత్రం ఈ విషయంపై నోరైనా ఎత్తడం లేదు, కనీసం స్పందించడం లేదనేది డీఎంకే వాదన.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి విజయ్ మౌనాన్ని టార్గెట్ చేయడానికి, ప్రజల్లో ఆయనను తక్కువ చేసి చూపించడానికి డీఎంకే ఒక భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. ఈ సభలోనే ఉదయనిధి స్టాలిన్ మైక్ ముందుకు వచ్చారు. సభలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. కావేరీ జలాలు, సీఎం విజయ్ మౌనంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అదే సమయంలో, సీఎం విజయ్‌కి మరియు స్టార్ హీరోయిన్ త్రిషకు ఉన్న పాత సినీ స్నేహాన్ని, వారి కాంబినేషన్ ను మనసులో పెట్టుకుని సభలో ఉన్న కొందరు కార్యకర్తలు ఒక్కసారిగా "త్రిష.. త్రిష" అంటూ గట్టిగా అరవడం, స్లోగన్స్ ఇవ్వడం ప్రారంభించారు.
ఆ సమయంలో అపోజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్ ఒక బాధ్యతాయుతమైన నేతగా వ్యవహరించాల్సింది పోయి, ఒక్క క్షణం అదుపుతప్పారు, నోరుజారారు. సినిమాల్లో వచ్చే ముతక డైలాగ్ లాగా.. "ఆ కావేరీ నీరు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. కచ్చితంగా 'అక్కడికి' మాత్రం చేరాలి" అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా, లైంగిక కోణంలో వ్యాఖ్యానించారు. ఆయన ఏమందామనుకున్నారో ఏమన్నారో, ఆయనన్నదాన్నుంచి ఏమని అర్థం వస్తుందో ఆయనకే తెలియాలి కానీ.. ఆలోగానే జరగాల్సిందంతా జరిగిపోయింది. జనాలు, మీడియా దీనిని త్రిషను కించపరిచేలా చేసిన ముతక వ్యాఖ్యగానే భావించారు.
ఉదయనిధి స్టాలిన్ అన్న ఆ ఒక్క మాటే ఇప్పుడు తమిళనాట ఊహించని రేంజ్ లో మంటలు రేపింది. ఎప్పుడైతే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందో, సినీ పరిశ్రమతో పాటు సామాన్య మహిళల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేవలం సోషల్ మీడియా విమర్శలతోనే ఇది ఆగలేదు.. చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడం, సమాజంలో విద్వేషాన్ని ప్రోత్సహించడం, ప్రజల మధ్య అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించడం… ఇలాంటి అత్యంత తీవ్రమైన అభియోగాలతో పోలీసులు ఉదయనిధి స్టాలిన్ పై కేసులు నమోదు చేశారు.
24 గంటలు తిరగకముందే పోలీసులు రంగంలోకి దిగి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉదయనిధిని అదుపులోకి తీసుకోవడంతో తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా ఆగమాగమైపోయింది. ఉదయనిధి అరెస్ట్ తో డీఎంకే శ్రేణులు భారీగా రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయనను కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. ఉదయనిధి తరపు న్యాయవాదులు గట్టిగా వాదించారు. తాను కేవలం కావేరీ నది నీటి సమస్య గురించే మాట్లాడానని, రాజకీయ కక్షతోనే తన మాటలను వక్రీకరించారని ఉదయనిధి కోర్టులో చెప్పుకొచ్చారు. తీవ్ర వాదోపవాదాల అనంతరం, చివరాఖరికి కోర్టు ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్ మంజూరు చేసింది. 24 గంటల లోపే కేసులు, అరెస్టులు, బెయిల్ అన్నీ జరిగిపోయాయి. బెయిల్ వచ్చి ఆయన బయటకు వచ్చినప్పటికీ, ఒక మహిళా స్టార్ హీరోయిన్ను రాజకీయాల్లోకి లాగి బుక్కయిన విధానంపై పడిన మరకను మాత్రం ఆయన అంత సులభంగా చెరుపుకోలేరు.