ఇజ్రాయిల్, అమెరికా – ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం తీవ్రత ఇప్పుడు మన దాయాది పాకిస్తాన్ పై తీవ్రంగా పడుతోంది. అసలే ఆర్ధిక ఇబ్బందులతో నానా కష్టాలు పడుతున్న పాకిస్తాన్ ప్రజలకు, ఇప్పుడు చమురు ధరల పెంపు మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. తాజాగా ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే.. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మార్చి 2026 నాటికి అక్కడి ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఏకంగా 55 పాక్ రూపాయలకు పెరగడం, ఆ దేశ చరిత్రలోనే తొలిసారి. పాకిస్తాన్‌కు చమురు కష్టాలు ఈ రేంజ్ లో ఉండటానికి.. మెయిన్ రీజన్స్ ఒక్కసారి చూస్తే.. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం కారణంగా.. హార్ముజ్ జలసంధిని బంద్ చేసిన, ఎఫెక్ట్ పాక్ పై తీవ్రంగా పడింది. ఈ యుద్ధం కారణంగా వరల్డ్ వైడ్ గా చమురు సప్లై కష్టంగా మారిపోయింది. ప్రపంచ ముడి చమురులో 20% సరఫరా హార్ముజ్ జలసంధి నుంచే జరుగుతోంది. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.
పాకిస్తాన్ తన చమురు అవసరాల కోసం ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈ లపై ఆధారపడుతుంది. ఈ సరఫరా మార్గాలన్నీ ప్రస్తుతం యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. అటు నిల్వలు కూడా భారీగా పడిపోతున్నాయి. పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు కేవలం 25 నుండి 28 రోజులకు మాత్రమే సరిపోతాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే వాస్తవానికి.. ముడి చమురు నిల్వలు ఇంకా తక్కువగా ఉన్నాయని సమాచారం. కేవలం 10 రోజులకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయని పాక్ లో చర్చ జరుగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల పాకిస్తాన్ నెలవారీ చమురు దిగుమతి బిల్లు 600 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. వీటికి తోడు రవాణా చేసే నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా భారీగా పెరగడం వల్ల అదనపు భారం పడింది. అసలే పాక్ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం. ఇలాంటి టైంలో ఈ సిచ్యువేషణ్.. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లే. పాకిస్తాన్ ప్రస్తుతం ఐఎంఎఫ్ నుండి తీసుకున్న రుణాలపై ఆధారపడి పాలన్ సాగిస్తోంది. ఐఎంఎఫ్ నిబంధనల ప్రకారం ఇంధనంపై ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకూడదు.
అందువల్ల అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు, ఆ భారాన్ని ప్రభుత్వం భరించలేక నేరుగా సామాన్యులపై వేయాల్సి వస్తోంది. పాకిస్తాన్ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మరీ దారుణంగా పడిపోతుంది. దీని కారణంగా కూడా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఇక చమురు వినియోగాన్ని తగ్గించే విధంగా వారానికి ఒకసారి సమీక్ష చేసి, కొత్త నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది అక్కడి ప్రభుత్వం. హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం సౌదీ, యూఏఈ మరియు ఒమన్‌లతో చర్చలు జరుపుతోంది పాక్. దీనితో పాక్ లో ఖర్చులు కూడా భారీగా పెరిగాయని సమాచారం. రవాణా ఖర్చులు, నిత్యావసరాల ధరలతో పాక్ లో అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. మరో వైపు ఆఫ్ఘన్ తో యుద్ధం కారణంగా పాక్ పరిస్థితి మరింత దిగజారిందని నిపుణులు చెప్తున్నారు.
పాకిస్తాన్ వస్తు రవాణా కోసం రైల్వే కంటే ఎక్కువగా ట్రక్కులపైనే ఆధారపడుతుంది. డీజిల్ ధరలు పెరగడం వల్ల కూరగాయలు, ధాన్యాల వంటి నిత్యావసరాల రవాణా ఖర్చులు పెరిగి, సామాన్యుడికి భారంగా మారాయి. చమురు నిల్వలు తక్కువగా ఉన్నాయనే వార్తలతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కడుతున్నారు. కొందరు వ్యాపారులు లాభాల కోసం పెట్రోల్‌ను అక్రమంగా నిల్వ చేయడం కూడా పాక్ దరిద్రానికి ప్రధాన కారణం.
పాకిస్తాన్‌లోని ఆయిల్ రిఫైనరీలు ఓల్డ్ టెక్నాలజీతో నడుస్తున్నాయి. ఇవి ముడి చమురును పూర్తిస్థాయిలో పెట్రోల్‌గా మార్చలేవు. అందుకే ఆ దేశం ఇప్పటికీ శుద్ధి చేసిన చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. పాకిస్తాన్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్లు ప్రధానంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ పై నడుస్తాయి. చమురు ధరలు పెరగడంతో, విద్యుత్ బిల్లులపై "ఫ్యూయల్ ప్రైస్ అడ్జస్ట్‌మెంట్" పేరిట ప్రజలపై అదనపు భారం పడుతోంది.