తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎలా సాగుతున్నాయో చూస్తున్నారు కదా..? అసెంబ్లీ లోపల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కి చేరింది. హరీష్ రావు, కేటీఆర్ అసెంబ్లీలో స్పీకర్ పోడియం ముందు మైకులు పట్టుకుని యుద్ధం చేస్తుంటే.. అసలు ఈ కథలో మెయిన్ హీరో, లీడర్ ఆఫ్ అపోజిషన్ మన గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఎక్కడ ఉన్నారో తెలుసా..? కరెక్ట్ గా గెస్ చేశారు.. ఎప్పటిలాగే ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో రిలాక్స్ అవుతున్నారు.
అయితే ఈసారి రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఫామ్‌హౌస్ రెస్ట్‌కి గట్టిగా ‘చెక్’ పెట్టేందుకు ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. ఏంటా ప్లాన్..? కేసీఆర్ ప్రతిపక్ష నేత కుర్చీ ఎలా కదులుతోంది..? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ముచ్చట. సాధారణంగా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తాయి.. కానీ హిస్టరీలోనే మొదటిసారి ప్రతిపక్ష నేత మీద అధికార పార్టీ ధర్నాలు చేయడం మనం ఈ రోజే చూస్తున్నాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను పిలిచి మరీ ఇందిరా పార్క్ దగ్గర ‘మహా ధర్నా’ చేయించారు. ఎందుకు..? "కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం లేదు.. ఆయన ఎల్‌ఓపీ హోదాకు రాజీనామా చేయాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయించారు.
ఇక్కడ రేవంత్ రెడ్డి జనాల్లోకి ఒక గట్టి లాజిక్ వదిలారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1000 రోజులు దాటుతున్నా.. కేసీఆర్ అసెంబ్లీ మొహం చూడలేదు కానీ.. ఇప్పటివరకు జీతాలు, సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌ల రూపంలో ఏకంగా 22 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వాడేశారట. "ఒక సాదాసీదా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక్క వారం ఆఫీస్‌కి రాకపోతేనే సస్పెండ్ చేస్తారు.. మరి 1000 రోజులుగా అసెంబ్లీకి రాని కేసీఆర్ ను ఏం చేయాలి బాసూ?" అంటూ రేవంత్ రెడ్డి వేసిన వెటకారపు డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
అయితే రేవంత్ రెడ్డి ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి వదిలేసే రకం కాదు కదా. ఆయన వెనకాల లీగల్ టీమ్‌ను పెట్టి అసెంబ్లీ రూల్స్ బుక్ తిరగేయించారు. అక్కడే ఒక ఇంట్రెస్టింగ్ రూల్ బయటకు వచ్చింది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం.. ఒక ప్రతిపక్ష నేత నిరంతరాయంగా 50 రోజులకు పైగా సభకు హాజరు కాకపోతే.. ఆ ఎల్‌ఓపీ హోదాపై లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు సరిగ్గా ఇదే పాయింట్‌ను ప్రస్తావిస్తూ లీగల్ పొజిషన్‌పై చర్చ పెంచుతున్నారు. "సభకు రాకుండా జీతాలు తీసుకుంటూ.. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైతే.. అసలు ఆ ప్రతిపక్ష హోదా మీకు ఎందుకు? దాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?" అంటూ కాంగ్రెస్ లీడర్లు అసెంబ్లీ వేదికగా గట్టి స్కెచ్ వేస్తున్నారు.
నిజానికి ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక పక్కా పొలిటికల్ సైకలాజికల్ గేమ్. కేసీఆర్ ను ఎలాగైనా అసెంబ్లీకి రప్పించాలి.. వస్తే అక్కడ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు మధ్య లైవ్ డిబేట్ పెట్టి కార్నర్ చేయాలనేది రేవంత్ ప్లాన్. ఒకవేళ కేసీఆర్ రాకపోతే.. "చూశారా.. ఆయనకు ప్రజా సమస్యల కంటే ఫామ్‌హౌస్ పడకే ముఖ్యం.. ఆయన హోదా వేస్ట్" అని జనాల్లో బ్యాడ్ ప్రొజెక్షన్ ఇవ్వొచ్చు. అటు రాలేక.. ఇటు ప్రతిపక్ష హోదా కాపాడుకోలేక గులాబీ బాస్ ఇరకాటంలో పడేలా రేవంత్ రెడ్డి పక్కాగా పావులు కదిపారు.
"మీ వల్ల కాకపోతే ఆ ప్రతిపక్ష నేత పదవిని మీ కొడుకు కేటీఆర్‌కో లేక అల్లుడు హరీష్ రావుకో ఇచ్చేయండి.. అంతేకానీ కుర్చీని ఖాళీగా ఉంచకండి" అంటూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కౌంటర్లు వేస్తున్నారు. ఏదేమైనా.. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి మార్క్ అగ్రెసివ్ పాలిటిక్స్ ఇప్పుడు పీక్స్‌లో కనిపిస్తున్నాయి. అటు సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను స్పీకర్‌ను అవమానించారనే నెపంతో సస్పెండ్ చేయించారు, ఇటు సభ బయట కేసీఆర్ ఎల్‌ఓపీ కుర్చీకే ఎసరు పెట్టేలా స్కెచ్ వేశారు. చట్ట ప్రకారం 50 రోజుల రూల్‌ని గనుక కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాడితే.. కేసీఆర్ ప్రతిపక్ష హోదా రద్దు కావడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. మరి రేవంత్ రెడ్డి వేసిన ఈ మాస్టర్ ప్లాన్‌ని తిప్పికొట్టడానికి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ ఎలాంటి బుల్లెట్ లాంటి స్ట్రాటజీతో బయటకు వస్తారో చూడాలి.