తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కుటుంబం వల్ల క్రియేట్ ఐన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. సీఎం గురించి కొండా సురేఖ కూతురు సుష్మతి చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలపై సురఖకు వచ్చిన నోటీసులు చివరగా మంత్రి పదవి నుంచి తొలగించడం.. సింపుల్‌గా ఓ చిన్నపాటి థ్రిల్లర్ సినిమా స్థాయిలో నడిచింది డ్రామా. అయితే ఈ సీన్ మొత్తం క్రియేట్ అవ్వడానికి కేవలం కొండా సుష్మిత చేసిన కామెంట్సే కారణం. ఇక్కడ ఇంత సీన్ క్రియేట్ చేసి ఇప్పుడు సింపుల్‌గా లండన్ ఫ్లైట్ ఎక్కి సుష్మిత విదేశాలకు వెళ్లిపోవడం ఆసక్తికరంగానూ కాస్త ఆశ్చర్యకరంగానూ మారింది. వరంగల్, పరకాల నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలు, రాబోయే టికెట్ల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం నిర్ణయాలపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి బీజం వేశాయి.
"రేవంత్ రెడ్డి టికెట్లు ఇవ్వడానికి ఎవరు ? వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి నేనే పోటీ చేస్తా" అంటూ సుష్మిత మీడియా ముందు సవాల్ విసరడం, సీఎం మరియు పార్టీ కీలక నేతలను ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ సుష్మిత చేసిన వీడియోలు, కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, పీసీసీ నేతలు మరియు అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. దీనిపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కూతురు చేసిన వ్యాఖ్యలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఒక ఇండిపెండెంట్ అని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అధిష్టానం శాంతించలేదు. సొంత పార్టీ సీఎం పైనే విమర్శలు చేయడం, అధిష్టానాన్ని ప్రశ్నించడం వంటి వరుస ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కఠినంగా వ్యవహరించింది. చివరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బీసీ మహిళా నాయకురాలిగా ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ, కేవలం కుమార్తె ఆవేశం, ప్రవర్తన కారణంగానే పదవి కోల్పోవాల్సి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
తల్లి పదవి ఊడిపోయిన తర్వాత కొండా సుష్మిత మీడియా ముందుకు వచ్చి తీవ్రంగా స్పందించారు. "నేను మాట్లాడితే మా అమ్మను ఎందుకు బలి చేశారు ?", "నా తల్లికి తీవ్ర అన్యాయం జరిగింది" అంటూ బోరున ఏడుస్తూ, కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై శాపనార్థాలు పెడుతూ, తన తల్లికి మద్దతుగా నిలుస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు, ఆమె ఏడ్చిన వీడియోలు సోషల్ మీడియాలో మరింత వైరల్‌గా మారాయి. ఒకవైపు సురేఖ అభిమానులు, అనుచరులు తీవ్ర ఆవేదనలో ఉంటే, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఈ రచ్చను చూసి తలలు పట్టుకున్నాయి. ఇంత పెద్ద రాజకీయ సంక్షోభం రేపి, తల్లి సుదీర్ఘ రాజకీయ అనుభవానికి, మంత్రి పదవికి తీవ్ర గండి కొట్టిన సుష్మిత.. ఆ తర్వాత అనుసరించిన వైఖరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీలో ఈ వివాదం రగులుతుండగానే, తన వ్యాఖ్యల వల్ల తల్లి పదవి పోయిన మరుసటి క్షణమే సుష్మిత లండన్ బయలుదేరి వెళ్లిపోయారు.
ఇక్కడ రాజకీయ పరిస్థితులు సర్దుమనిగే వరకూ సుష్మిత లండన్‌లోనే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్గాలు, కొండా మురళి-సురేఖ అనుచరులు ఈ పరిణామంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో ఉంటే, సమస్య సృష్టించిన ప్రధాన వ్యక్తి మాత్రం సింపుల్‌గా లండన్‌కు వెళ్ళిపోవడంపై వరంగల్ పొలిటికల్ సర్కిల్స్‌లో సెటైర్లు పేలుతున్నాయి. "అమ్మ పదవి ఊడబెరికేసి.. తాను మాత్రం హాయిగా లండన్ వెళ్ళి కూర్చుంది" అంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. రాజకీయ వేడి తీవ్రంగా ఉన్న సమయంలో, ఇక్కడ సమస్యను సదరు నేతలు సర్దుబాటు చేసుకునే లోపే సుష్మిత లండన్ పయనం కావడం వల్ల కొండా కుటుంబం మరింత డిఫెన్స్‌లో పడిపోయింది. ముందూ వెనుకా ఆలోచించకుండా మాట్లాడి, సొంత తల్లి మంత్రి పదవికే ఎసరు తెచ్చిన కొండా సుష్మిత వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద పాఠంగా మారింది. ఒకవైపు తల్లి కెరీర్‌కు మచ్చ తెచ్చి, తెలంగాణలో అంత రాజకీయ రచ్చ రాజేసి, సుష్మిత కూల్‌గా లండన్‌లో వ్రత్యక్షమవ్వడంపై పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.