భారత్ లో నక్సలైట్ల శకం ముగుస్తుంది. మావోయిస్టు దళాలతో పాటు అగ్రనేతలు ఒక్కొక్కరు ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. మొండిగా సాయుధ పోరాటం చేస్తున్న వాళ్లు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. మావోయిస్టు పార్టీకి కళ్ళు చెవులు లాంటి దేవ్ జి, రాజిరెడ్డి తోబాటు మరో 17 మంది నక్సలైట్లు కూడా తెలంగాణ పోలీసులకు లొంగి పోయారు. అంతకంటే ముందు మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, హిడ్మా తో సహా అనేకమంది ఎన్కౌంటర్లో చనిపోయారు. మల్లోజులు వేణు, చంద్రన్న సహా మరికొందరు కూడా లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల్లో ముగ్గురే మిగిలి ఉన్నారు. మావోయిస్టు ఉద్యమం చివరి దశకు వచ్చేసిందని, ఇప్పుడు జరుగుతున్నది అంతిమ పోరాటమేనని కేంద్రం చెబుతోంది.
మార్చి 31 తర్వాత దేశంలో మావోయిస్టు అనే వాడు మిగలరని కేంద్రం ప్రకటిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి గురించి పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఇటు ప్రజల్లో, ప్రభుత్వంలో.... చర్చ జరుగుతుంది. అతని మావోయిస్టు పార్టీ మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రస్తుత పొలిటి బ్యూరో సభ్యుడు గణపతి. మావోయిస్టు దళపతి గణపతి ఎక్కడ? అన్న ప్రశ్నకు ఎవరికి స్పష్టమైన సమాధానం దొరకటం లేదు. గణపతి నేపాల్ లో ఉన్నాడని పోలీసులైతే లీక్ ఇస్తున్నారు కానీ అతను ఎక్కడున్నాడు అనేది స్పష్టంగా తెలియడం లేదు. గణపతి అనే వ్యక్తి దొరకనంత కాలం దేశంలో మావోయిస్టుల అంతం అయిపోయినట్లు ఎలా చెప్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎవరి గణపతి? ఈ తరానికి తెలియని గణపతి దేశంలో నక్సల్ ఉద్యమాన్ని ఎలా నడిపించాడు? 43 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న గణపతి అసలు ఎక్కడున్నాడు? ఉన్నాడా లేడా? ఉంటే ఎలా ఉండి ఉంటాడు.... ఇదే చర్చ ఇప్పుడు ప్రతి చోట జరుగుతుంది.
గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు కరీంనగర్ జిల్లా బీర్పూర్ ప్రాంతానికి చెందినవాడు. 1949లో పుట్టిన లక్ష్మణరావు వెలమ సామాజిక వర్గానికి చెందిన ఒక మధ్య తరగతి బీఈడీ టీచర్. ఆయన సోదరుడు నర్సింగ్ రావు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. విద్యార్థి దశ నుంచి ఉద్యమ భావాలు ఉన్న లక్ష్మణరావు టీచర్ అయ్యాక వాటిని వదిలిపెట్టలేకపోయాడు.1967 నక్సల్ బరి రైతాంగ ఉద్యమంతో ప్రభావితమయ్యాడు లక్ష్మణరావు. లక్ష్మణరావు కు భార్య ,కుమారుడు ఉన్నారు. ఉన్నత విద్య కోసం వరంగల్ వెళ్ళిన లక్ష్మణరావు కి నక్సల్ నాయకులు నల్ల ఆదిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య పరిచయం అయ్యారు. వారి ప్రభావంతో నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. 1983లో పీపుల్స్ వార్ ఏర్పడిన తర్వాత నక్సలు ఉద్యమంలో లక్ష్మణరావు మరింత ఎదిగారు. ఆయన పేరు గణపతిగా మారింది.2004లో పీపుల్స్ వార్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టుగా మరింది.
గణపతి భారత్ లోని మావోయిస్టులందరికీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. ఇప్పటివరకు మావోయిస్టుల్లో కూడా గణపతిని నేరుగా చూసింది చాలా తక్కువ మంది. జనరల్ సెక్రెటరీ అయిన తర్వాత రెడ్ బెల్ట్ ఆఫ్ ఇండియా బస్తర్ రీజియన్, చతిస్గడ్ ప్రాంతాలన్నిటినీ కలుపుకొని మావోయిస్టు బలగాలను విస్తరించాడు. భారత్లో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ గా గణపతి తలపై సుమారు 5 కోట్ల రూపాయలు రివార్డు ఉంది. చాలా తక్కువగా మాట్లాడే గణపతి నక్సలైట్ లో టాప్ క్యాడర్ కు మాత్రమే అందుబాటులో ఉండేవారు.1998లో బి బి సి, హలో బస్తర్ మ్యాగ్జైన్ కి మాత్రమే ఆయన మొదటిసారి చివరిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఉద్యమంలో ఆయన పేరు వాసు.
సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమానికి జనరల్ సెక్రెటరీగా వ్యవహరించిన గణపతి ఫోటోలు ఇప్పటివరకు రెండంటే రెండు మాత్రమే దొరికాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని విస్తరించడమే కాకుండా మావోయిస్టులతో... ఇతర ప్రాంతాల్లో ఉద్యమకారులతో సంబంధాలు పెట్టుకోవడంలో గణపతి నక్సల్ ఉద్యమాన్ని ఖండాంతర తీసుకెళ్లారు. 2018లో ఆరోగ్యం క్షీణించడంతో నంబాల కేశవరావు కి సెక్రటరీగా బాధ్యతలు అప్పజెప్పి... తాను పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. ఆ తర్వాత ఫిలిప్పీన్స్, నేపాల్ , కొలంబో లో గణపతి షెల్టర్ తీసుకున్నారని చెప్పుకుంటూ ఉంటారే తప్ప ఆయన్ని చూసినవారు గానీ, ఆయనతో కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు గాని లేరు. ఈమధ్య పోలీసులు ఒక లీక్ ఇచ్చారు. 77 ఏళ్ల గణపతి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారని, ఆరోగ్యం కూడా క్షీణించిందని, ఆయన నేపాల్ లో తలదాచుకున్నారని... ఇండియా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు.
కుటుంబాన్ని వదిలిపెట్టి మావోయిస్టులలోకి వెళ్లిపోయిన తర్వాత... గణపతి మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. ఎప్పుడు ఎవరిని కలవలేదు. ఆయన అత్యంత సన్నిహిత బంధువులు కూడా విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన కుమారుడు హైదరాబాదులో ఐటి ఉద్యోగం చేస్తున్నారు. భార్య క్యాన్సర్ తో కన్నుమూశారు. సుమారు 45 ఏళ్ల పాటు అజ్ఞాతవాసంలో ఉన్న గణపతి... ఉద్యమ కాలంలో కొండపల్లి సీతారామయ్య , సత్యమూర్తి, గద్దర్ తో పాటు మరికొందరితో విభేదించారు కూడా.
పీపుల్స్ వార్ లో చీలిక వచ్చినప్పుడు కూడా గణపతి వెంటే అందరూ నడిచారు. ఆయనతో విభేదించి కొండపల్లి ,సత్యమూర్తి లాంటి వాళ్ళు నక్సల్ ఉద్యమాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. ఉద్యమంలో కూడా అగ్రకుల పెత్తనమేనని గణపతి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కొన్ని సార్లు ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు పై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయితే ఆయన మాట గాని... వీడియో గాని ఇప్పటివరకు విన్న వారు లేరు చూసినవారు లేరు. దేశంలో మావోయిస్టు ఉద్యమం చివరి దశ కి చేరుకున్న సమయంలో ఇప్పటికైనా గణపతి జన జీవన స్రవంతిలోకి వస్తారా లేక ఒక అదృశ్య ఉద్యమ శక్తిగానే ఉండిపోతారా అన్నది వేచి చూడాలి.