పెట్టుబడులకు ,నివసించడానికి, వ్యాపారానికి అన్నింటికీ దుబాయ్ అనువైన ప్రాంతం . కానీ దుబాయ్ పై ఇరాన్ డ్రోన్ అటాక్స్ ఇప్పుడు ఆ నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టాయి.
దుబాయిలో పర్యటన కోసం వెళ్లిన 20 వేల మంది టూరిస్టులు కొన్ని రోజులు పాటు అక్కడ చిక్కుకుపోయి తిప్పలు పడుతున్నారు. పశ్చిమాసియాలో దుర్భేద్యమైన ఓయాసిస్ గా ఒక బ్రాండ్ సంపాదించడానికి దుబాయ్ పాలకులు 25 ఏళ్ల పాటు శ్రమించాల్సి వచ్చింది.
ఒక బలమైన ఆర్థిక ,పర్యాటక విలాస కేంద్రంగా దుబాయ్ పేరు తెచ్చు కుంది. ఇప్పుడు ఆ పేరు అంతా గంగలో కలిసిపోయింది .ద్వీప సమూహమైన పాం జుమేరియా పై జరిగిన డ్రోన్ దాడిలో నలుగురు గాయాల పాలయ్యారు. ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫా కు సమీపంలో రేగిన పొగలు, పడిన బాంబులు దుబాయ్ పై నమ్మకాన్ని పోగొట్టాయి. ఆర్థిక, పర్యాటక కేంద్రంగా ఇన్నాళ్లు ప్రశంసలు అందుకున్న దుబాయ్ కి రక్షణ లేదని తేలిపోయింది.
దుబాయ్ లో నివసించే వాళ్ళలో 80 శాతం మంది విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లే. వాళ్లంతా దుబాయ్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ,అక్కడ పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రక్షణ ఉంటుందని, తమకు శాంతి సుస్థిరతులు ఉంటాయని. కానీ ఇప్పుడు మాత్రం దుబాయ్ నుంచి ఎప్పుడు బయటపడి పోదామా అని ఇన్వెస్టర్లు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాలను చుట్టుముట్టిన వేళ సంపన్నులు తమ ఆస్తుల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దుబాయ్ పై ఇరాన్ క్షిపని, డ్రోన్ల దాడులు జరిగిన తర్వాత అక్కడ స్థిరపడిన భారతీయ సంపన్న వ్యాపారవేత్త లు ఇతర ఆసియా దేశాల ధనవంతులు కూడా ప్రాంతాలకు తరలిపోయే పనిలో పడ్డారు. ఇన్నాళ్లు సేఫ్ హెవెన్ గా ఫేమస్ అయిన దుబాయ్ ప్రతిష్ట దాడులతో మసక బారింది. దీంతో ఇన్వెస్టర్లు సింగపూర్ హాంకాంగ్ కు పోతున్నారు.
దుబాయ్ లో ఇద్దరు భారతీయ పారిశ్రామికవేత్తలు రిస్క్ తగ్గించుకోవడానికి తమ బ్యాంకు ఖాతాలో నుంచి ఒక్కొక్కరు లక్ష డాలర్ల కంటే కంటే ఎక్కువ మొత్తాన్ని సింగపూర్ కు తరలించారని రాయిటర్స్ ఒక కథనం ప్రచురించింది. దాడుల వలన ఏర్పడిన టెక్నికల్ ఇబ్బందుల తో మొదట్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఆ తర్వాత ఇతర బ్యాంకుల ద్వారా వాళ్ళు డబ్బు ట్రాన్స్ఫర్ చేయగలిగారు.
వీళ్లే కాకుండా చాలామంది సంపన్న కుటుంబాలు తమ ఆస్తులను దుబాయ్ నుంచి తరలించేందుకు న్యాయ నిపుణులను, ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తున్నారు. కనీసం 50 మిలియన్ డాలర్ల ఆస్తులు కలిగిన దుబాయ్ వ్యాపారవేత్తలు చాలామంది తమ డబ్బు మొత్తం సింగపూర్ కు బదిలీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంతకాలం పన్ను ప్రయోజనాల కోసమే దుబాయ్ ని ఆశ్రయించిన వాళ్లు. ఇప్పుడు ఆ టాక్స్ సేవింగ్ కంటే ప్రాణాలు ,ఆశలు సేవ్ చేసుకోవడమే ముఖ్యమంటున్నారు. ఒకవేళ యుద్ధం ముగిసిన తర్వాత విమానాల రాకపోకలు మొదలైనప్పటికీ, తిరిగి భద్రతపై నమ్మకం రావడం కష్టమేననేది వాళ్ళ వాదన.
అయితే మరికొందరు మాత్రం దుబాయ్... యూఏఈ ఆర్థిక వ్యవస్థ పై ఇప్పటికీ నమ్మకంతోనే ఉన్నారు. యుద్ధం వలన దుబాయ్ కి కొంత నష్టం వచ్చినప్పటికీ , ఆ దేశం అంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కాదని... త్వరలోనే కోలు కుంటూందని కూడా చెప్తున్నారు. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా యుద్ధ భయం మాత్రం సంపన్నులను దుబాయ్ నుంచి సింగపూర్ తరలిపోయేలా చేసింది.
ఇక అతి ముఖ్యమైన విషయం... ఆంధ్ర తెలంగాణలో చాలామంది పొలిటిషన్లు, వ్యాపారవేత్తలు తమ బినామీ పెట్టుబడులన్నీ అక్కడే పెట్టారు. ముఖ్యంగా దుబాయ్ రియల్ ఎస్టేట్లో మన నేతలు చాలామంది పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు అవన్నీ ఎటు పోతాయో... ఏమైపోతాయో అర్థం కావటం లేదు. బహిరంగంగా బయటపడి వాటి గురించి మాట్లాడలేరు. ఇక్కడ కాంట్రాక్టులు, ఇతర దందాల్లో సంపాదించిన సొమ్మంతా పెట్టుబడులుగా పెట్టేశారు. అవి తిరిగి వస్తాయో లేదో... అసలు దుబాయ్ ఎప్పుడు కోలుకుంటుందో లేదో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు బినామీలు.