అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై సంచలన ప్రకటన చేసారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్, అదే సమయంలో ఒక కఠిన షరతును కూడా విధించారు. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరపాల్సిన భీకర దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గత రెండు రోజులుగా ఇరాన్‌తో జరిగిన చాలా మంచి, నిర్మాణాత్మకమైన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామంటూ ఇచ్చిన 48 గంటల గడువు ముగియనున్న తరుణంలో ట్రంప్ ఈ విరామాన్ని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు విజయవంతం కావాలి. ఒకవేళ చర్చల్లో పురోగతి లేకపోయినా లేదా ఇరాన్ మళ్ళీ కయ్యానికి కాలు దువ్వినా, ఈ 5 రోజుల గడువు ముగియక ముందే దాడులు మొదలవుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ తన ఆధీనంలో ఉన్న హర్మూజ్ జలసంధిని ఎటువంటి బెదిరింపులు లేకుండా పూర్తిగా తెరవాలనేది అమెరికా ప్రధాన డిమాండ్.
దీనితో సోమవారం సాయంత్రంతో ముగియాల్సిన 48 గంటల డెడ్‌లైన్‌ను ట్రంప్ తాత్కాలికంగా పొడిగించినట్లు అయ్యింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా ఇరు దేశాల మధ్య రహస్యంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని ట్రంప్ స్వయంగా రక్షణ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇరాన్ కూడా ఘాటుగా రియాక్ట్ అయింది. ఒకవేళ అమెరికా తమ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే, తాము కూడా ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలకు విద్యుత్ అందించే ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్ ఇచ్చింది.