పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనే బుక్ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి మిస్టరీ వీడింది. శ్రీనివాస్‌ది ప్రమాదం కాదని.. ప్లాన్ చేసి చంపేశారని పోలీసులు నిర్ధారించారు. పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా బుక్ రాసిన రచయిత చనిపోవడంతో అందరి ఫోకస్ జనసేన మీదకు వెళ్లింది. కానీ ఈ కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ను బయటపెట్టారు పోలీసులు.ప్రముఖ రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనది ప్రమాదం కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని కూసుమంచి పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డితో పాటు మరో ముగ్గురు సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమని తేలింది. నిందితుడు వేణుమాధవ రెడ్డికి, శ్రీనివాస్‌కు మధ్య ఉన్న నగదు సంబంధించి గొడవులు జరుగుతున్న క్రమంలో నిందితులు ఆయనను హత్య చేసినట్లు ఖమ్మం పోలీసులు చెప్తున్నారు. బొగ్గుల శ్రీనివాస్ జీఎస్టీ పర్మిషన్ను మాధవరెడ్డికి ఇచ్చాడు. జీఎస్టీ కట్టకపోవడంతో అధికారులు బొగ్గుల శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చారు. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం డబ్బు ఇవ్వాలని, మరోవైపు క్లోజ్ అయిన జీఎస్టీ అకౌంట్ తిరిగి ఓపెన్ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. తనను డబ్బులు తిరిగివ్వాలని అడగటంతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందని బొగ్గుల శ్రీనివాస్‌ను హత్య చేయాలని మాధవరెడ్డి నిర్ణయించుకున్నాడు.
బొగ్గుల శ్రీనివాస్‌ను కారులో విజయవాడ వెళ్తుండగా నార్కెట్‌పల్లి వద్ద సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించాడు మాధవ రెడ్డి. అనంతరం పాలేరు రిజర్వాయర్‌లో కారు తోసేసి.. ప్రమాదంలో బొగ్గు శ్రీనివాస్ చనిపోయాడని అందర్నీ నమ్మించాలని చూశారు. శ్రీనివాస్‌ను సుపారీ గ్యాంగ్ హత్య చేయడంతో పాటు అనంతరం సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు చూసినా చివరికి దొరికిపోయారు. ఈనెల 14న కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లినట్టు పోలీసులు సమాచారం వచ్చింది.
ప్రమాద సమయంలో ఓ వ్యక్తి కారు నుంచి కిందపడిపోయి అక్కడినుంచి పరారైనట్లు కొందరు మత్స్యకారులు గుర్తించారు. తరువాత కారును బయటకు తీయగా వెనుక సీట్లో శ్రీనివాస్ డెబ్ బాడీ లభ్యమైంది. నేలకొండపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. తన సోదరుడు శ్రీనివాస్ మృతిపై అనుమానాలున్నాయని అబ్బులయ్య ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యేనని, ప్రమాదంలో ఆయన చనిపోలేదని విచారణలో తేలింది.
ఈ హత్యతో సంబంధం ఉన్న సుపారీ గ్యాంగ్ సహ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అంతా ఆరోపించినట్టు బొగ్గుల శ్రీనివాస్ హత్యకు పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. బొగ్గుల శ్రీనివాస్ గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై.. ''పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో'' అనే పుస్తకం రాశాడు. కొంత కాలం తరువాత ఇప్పుడు శ్రీనివాస్ అనుమానస్పదంగా చనిపోయవడంతో.. జనసేన పార్టీకి ఈ హత్యతో సంబంధం ఉందని కొందరు ఆరోపించారు. అయితే, ఈ హత్యకు ఆయన పవన్ పై రాసిన పుస్తకానికి గానీ, రాజకీయాలకు గానీ ఎటువంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. జీఎస్టీ అకౌంట్ బిల్లులు పెండింగ్, ఆర్థిక లావాదేవీల కారంగానే బొగ్గుల శ్రీనివాస్ ను హత్య చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.