ప్రపంచ దేశాలు మరో మహా యుద్ధానికి సిద్ధమవుతున్నాయా..? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన అల్టిమేటమ్‌కు ఇరాన్ అస్సలు తగ్గడం లేదా..? అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. "మమ్మల్ని తాకాలని చూస్తే.. ఊహించని సర్ప్రైజ్‌లు ఉంటాయి" అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు అమెరికా, ఇరాన్ మధ్య ఏం జరుగుతోంది..? ట్రంప్ కేవలం ఒకే ఒక్క గంట దూరంలో ఆపేసిన ఆ దాడి ఏంటి..? ఇరాన్ నిజంగానే అమెరికాకు చెందిన అత్యంత అధునాతన F-35 యుద్ధ విమానాన్ని కూల్చేసిందా..?
విషయంలోకి వెళ్తే.. గత ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇరాన్ మధ్య సుదీర్ఘమైన యుద్ధం నడుస్తోంది. అయితే కొన్ని వారాలుగా తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. కానీ, ఈ శాంతి చర్చలు ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఇటీవల వైట్ హౌస్ లో మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్, తాము ఇరాన్‌పై మరోసారి దాడి చేయడానికి కేవలం ‘ఒక గంట’ దూరంలో ఉండి, ఆ తర్వాత ఆర్డర్‌ను వాయిదా వేసినట్లు స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, ఇరాన్‌కు కేవలం "రెండు నుంచి మూడు రోజుల" సమయం మాత్రమే ఇస్తున్నట్లు ఒక డెడ్‌లైన్ విధించారు.
ఈ లోగా శాంతి ఒప్పందానికి రాకపోతే, ఇరాన్‌పై మునుపెన్నడూ లేని విధంగా ఒక పెద్ద దాడి చేస్తామని ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. "యుద్ధంలో ఘోరంగా ఓడిపోతున్న దేశంతో చర్చలు జరిపితే ఎలా ఉంటుందో తెలుసా.. వాళ్లు టేబుల్ ముందుకు వచ్చి డీల్ కోసం అడుక్కుంటారు" అంటూ ట్రంప్ ఇరాన్‌ను తక్కువ చేసి మాట్లాడారు. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఏమాత్రం భయపడలేదు, సరే కదా అంతకంతకూ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ వేదికగా అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
గత కొన్ని నెలలుగా జరిగిన యుద్ధం నుండి తాము ఎంతో సైనిక నాలెడ్జ్ సంపాదించామని, ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ శక్తులు మళ్లీ యుద్ధానికి వస్తే.. ఈసారి వారి కోసం "ఎన్నో ఊహించని సర్ప్రైజ్‌లు" సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. దీనికి తోడు ఇరాన్ ఆర్మీ ప్రతినిధి మొహమ్మద్ అక్రామినాయ్ మాట్లాడుతూ.. ఈ కాల్పుల విరమణ సమయాన్ని తాము ఖాళీగా వదిలేయలేదని, తమ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకున్నామని చెప్పారు.
ఒకవేళ అమెరికా గనుక మళ్లీ దాడులు ప్రారంభిస్తే, తాము అమెరికాకు వ్యతిరేకంగా "కొత్త యుద్ధ రంగాలు" తెరుస్తామని హెచ్చరించారు. అంటే యుద్ధం కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా, మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా స్థావరాలన్నిటికీ విస్తరిస్తుందని ఇరాన్ పరోక్షంగా చెప్తోంది. ఈ హెచ్చరికల్లో అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. అమెరికా గర్వంగా చెప్పుకునే అత్యంత అధునాతన ‘F-35 స్టెల్త్ ఫైటర్ జెట్’ను కూల్చేసిన మొదటి దేశం ఇరానే అని అబ్బాస్ అరాగ్చీ క్లెయిమ్ చేశారు. సాధారణంగా F-35 విమానాలను రాడార్లు కూడా గుర్తించలేవు.
అలాంటిది కొన్ని బిలియన్ డాలర్ల విలువైన డజన్ల కొద్దీ అమెరికా విమానాలను తాము దెబ్బతీశామని ఇరాన్ అంటోంది. ఇది తాము సొంతంగా చెప్తున్న మాట కాదని, అమెరికా కాంగ్రెస్ విడుదల చేసిన ఒక అధికారిక రిపోర్ట్‌లోనే ఈ విమానాల నష్టం గురించి స్పష్టంగా ఉందని ఇరాన్ మంత్రి గుర్తు చేశారు. ఈ క్లెయిమ్ నిజమైతే గనుక, అది అమెరికా సైనిక రక్షణ రంగానికి ఒక పెద్ద అవమానంగా మారుతుంది. అందుకే ఇరాన్ సైన్యం ఇప్పుడు మరింత ధీమాగా అమెరికాకు సవాల్ విసురుతోంది.
ఒకవైపు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరిస్తున్నప్పటికీ, మరోవైపు ఈ యుద్ధాన్ని చాలా త్వరగా ముగించాలని చూస్తున్నారు. దానికి గల కారణం ఏంటో తెలుసా..? అమెరికా అంతర్గత రాజకీయాలు మరియు ఆర్థిక పరిస్థితి. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోయాయి. అమెరికాలో సాధారణ ప్రజలు తమ కార్లలో పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడానికి భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనివల్ల అమెరికన్ ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాబోయే నవంబర్ నెలలో అమెరికా కాంగ్రెషనల్ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ సమయంలో యుద్ధం ఇలాగే కొనసాగితే అది ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ట్రంప్ ఎలాగైనా ఇరాన్‌తో ఒక డీల్ కుదుర్చుకుని, అమెరికాను ఈ యుద్ధం నుండి బయటపడేయాలని చూస్తున్నారు. కానీ అదే సమయంలో ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకుంటామని కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే.. అమెరికా విధించిన రెండు-మూడు రోజుల డెడ్‌లైన్ ముగిసిపోతోంది. ఒకవేళ ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే, ట్రంప్ అన్నట్లుగా అమెరికా మరో పెద్ద దాడి చేస్తుందా..? లేక ఇరాన్ హెచ్చరించినట్లుగా అమెరికాకు ఊహించని ‘సర్ప్రైజ్ షాక్‌లు’ తగలనున్నాయా అనేది ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రశ్న. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం గనుక మళ్లీ మొదలైతే.. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కూడా లేకపోలేదు.