మొయినాబాద్ డ్రగ్స్ కేసు..తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ప్రజాప్రతినిధులు ప్రైవేట్ పార్టీలో పట్టుబడటం...వారికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడంతో పంచ్ డైలాగ్స్ ఓ రేంజ్లో పేలుతున్నాయి. ఎన్టీఏ కూటమి ఎంపీ ఉండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఆ ఎంపీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? పొలిటికల్‌గా ఫుల్ స్ట్రాంగా ?హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ...రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఉండటమే నేరమైతే...డ్రగ్స్ టెస్టులో అతనికి పాజిటివ్ రావడం రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్...హై-ప్రొఫైల్ డ్రగ్స్ పార్టీకి వేదికైంది. ఇప్పుడే కాదు...గతంలోనే ఇక్కడ అనేకసార్లు పార్టీలు జరిగాయి. అదంతా ఒకెత్తయితే...ఇపుడు ఎంపీ మహేశ్ యాదవ్ పట్టుబడటం చర్చనీయంశంగా మారింది. 2024 ఎన్నికల్లో పుట్టా మహేశ్...ఏలూరు పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన అతి పిన్న వయస్కుల్లో ఈయన ఒకరు. డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో టీడీపీ అధిష్టానం కేసుపై ఆరా తీస్తోంది. అటు వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. పుట్టా మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
పుట్టా మహేశ్...1988 ఏప్రిల్ 10న కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించారు. తల్లిదండ్రులు పుట్టా విజయలక్ష్మి, పుట్టా సుధాకర్ యాదవ్. హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్....మైదుకూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గానూ పని చేశారు. పుట్టా మహేష్ యాదవ్...మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకి స్వయనా అల్లుడు. రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను మహేష్ కుమార్ వివాహం చేసుకున్నారు. ఈ బంధుత్వం కారణంగానే పుట్టా, యనమల కుటుంబానికి మధ్య రాజకీయంగా బలమైన సంబంధాలు ఉన్నాయి. పుట్టా మహేశ్...కేవలం రాజకీయ నాయకుడే కాదు వ్యాపారవేత్త కూడా. ఆయనకు అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. పీఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ & ప్రాజెక్ట్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టులు చేస్తోంది.
అటు యనమల రామకృష్ణుడు, ఇటు పుట్టా సుధాకర్ యాదవ్...ఇద్దరూ దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్నారు. ఇద్దరు కలిసి మహేశ్ టికెట్ కోసం అధిష్ఠానానికి విజ్ఞప్తులు చేశారు. వారిద్దరి కృషి ఫలించడంతో 2024లో రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే పుట్టా మహేశ్..ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. తొలి ఎన్నికల్లో విజయం సాధించి...పార్లమెంట్లో అడుగు పెట్టారు. యనమల...టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. నిజానికి పుట్టా కుటుంబం కడప జిల్లాకు చెందినప్పటికీ, వ్యూహాత్మకంగా ఆయనను ఏలూరు ఎంపీగా బరిలోకి దింపడంలో యనమల వ్యూహం ఉందనే చర్చ జరిగింది. అటు రాయలసీమ, ఇటు కోస్తా ప్రాంతాలకు చెందిన ఇద్దరు నేతలు... బలమైన బీసీ నాయకులుగా గుర్తింపు సంపాదించారు. పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబానికి మాజీ మంత్రి తలసాని కుటుంబంతో బంధుత్వం ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్‌తో మహేష్ కుమార్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి.