విశాఖ విజయనగరం మధ్య భోగాపురం దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేశారు. ఈనెల 17 నుంచి అక్కడ అన్ని రకాల విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి..... అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా అందుబాటులోకి రానుంది. అయితే ఈ విమానాశ్రయం చుట్టూ ఇప్పుడు పొలిటికల్ క్రెడిట్ వార్ నడుస్తుంది. విమానాశ్రయం కట్టింది మేమంటే మేమని టిడిపి, వైసిపి పార్టీలు సిగపట్లు పడుతున్నాయి. ఏదైనా ప్రచారం చేసుకోవడంలో దేశంలోనే అందరికంటే ముందుండే టిడిపి భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా మాదేనని నాలుగైదు నెలలుగా భీకర ప్రచారం చేస్తోంది. అయితే ఇదిగో వాస్తవాలు... మీరే చెప్పండి.... భోగాపురం ఎయిర్పోర్ట్ నడుం కట్టింది ఎవరో అని వైసిపి ప్రశ్నిస్తోంది. అసలు ఏది నిజం ఏది అబద్దం?
2019 ఎన్నికలకి సరిగ్గా మూడు నెలల ముందు అంటే 2019 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన చేశారు. అయితే ఆయన శంకుస్థాపన చేసిన చోటు ఇప్పుడున్న ఎయిర్ పోర్ట్ కి సరిగ్గా అర కిలోమీటర్ దూరం. 2015లోనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. చంద్రబాబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం 15 వేల ఎకరాలు సేకరించాలని ప్రణాళిక వేశారు. అదే ఆయన చేసిన పెద్ద తప్పు. నిజానికి ఎయిర్ పోర్ట్ కి మూడువేల ఎకరాల కన్నా భూమి అవసరం ఉండదు. అయితే భవిష్యత్తు అవసరాలు, విస్తరణ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఏది చేసినా భారీగా చేస్తారు. దీంతో రైతుల్లో వ్యతిరేకత వస్తుంది.
భోగాపురం విషయంలో కూడా భూసేకరణ దగ్గర చాలా అల్లరి అయింది . భూములు కోల్పోయిన రైతులు తరఫున అప్పటి వైసిపి అధినేత జగన్ గట్టిగా నిలబడ్డారు. ఎయిర్ పోర్ట్ కి 15000 ఎకరాలు ఎందుకు? ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తున్నారు అంటూ నిలదీశారు. అంతేకాదు రిజిస్టర్ భూములకు 28 లక్షలు ఇస్తానని, రిజిస్టర్ కాకుండా రైతుల స్వాధీనంలో ఉన్న భూములకు కేవలం 12 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తానని చంద్రబాబు పెట్టిన రూల్ కూడా జగన్ వ్యతిరేకించారు. దాంతో విమానాశ్రయం భూసేకరణ జరగలేదు.2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రతి రైతుకి ఎకరాకి 28 లక్షలు ఇచ్చి భూ సేకరణ సమస్యను, పునరావాసాన్ని జగన్ పరిష్కరించారు. అంతేకాదు ఎయిర్పోర్టుకి 15 వేల ఎకరాలు అవసరం లేదంటూ, విమానాశ్రయాన్ని 2500 ఎకరాలకు పరిమితం చేసి...2023 మే 3న మరోసారి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఎయిర్ స్ట్రిప్ ఉన్న భూమి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజు వియ్యంకురాలిది. జగన్ ఆమెను కూడా పిలిపించి మాట్లాడి రాజీ చేశారు.26 నాటికి విమానాశ్రయం పూర్తి కావాలని టార్గెట్ పెట్టారు
ఎర్ర బస్సు రానిచోట ఎయిర్పోర్ట్ ఎందుకని జగన్ కామెంట్ చేయలేదు. భూ సేకరణ నిరసిస్తూ ఒక మహిళా రైతు జగన్ తో మాట్లాడిన్నప్పుడు... ఆమె ఆ మాట అన్నారు.15000 ఎకరాల భూ సేకరణ వ్యతిరేకిస్తూ , నిర్వాసితుల కోసం జగన్ నిర్వహించిన సభలో ప్రస్తావన వచ్చింది.భోగాపురం విమానాశ్రయం నిర్మాణ కాంట్రాక్టును తీసుకున్న జిఎంఆర్ సంస్థ అనుకున్న సమయానికి ఎయిర్ పోర్ట్ ను పూర్తి చేసి ఇచ్చింది. నిజానికి విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చంద్రబాబు, జగన్ ఇద్దరికీ దక్కుతుంది.2019లో చంద్రబాబు శంకుస్థాపన చేస్తే, 2023 లో జగన్ ఆర్ఆర్ ప్యాకేజ్, రైతుల ఇతర సమస్యలు పరిష్కరించి తిరిగి శంకుస్థాపన చేసి 2026 కి టార్గెట్ పెట్టారు. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది ఏ ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యం కాదు. హైదరాబాద్ ఐటీ కూడా చంద్రబాబు ఒక్కరే చేయలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగించాయి. అలాగే ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం కూడా జగన్ చంద్రబాబు ఇద్దరూ చొరవతోనే నిర్మాణం పూర్తి అయింది. అయితే చంద్రబాబు దీనిని 15 వేల ఎకరాలు లో నిర్మించాలని ప్లాన్ చేస్తే.... జగన్ ఎక్కువమంది రైతులు నష్టపోకుండా 2500 ఎకరాల్లో ... భూ సేకరణ చేసి, రైతులకు నచ్చజెప్పి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. జిఎంఆర్ సంస్థ ఎయిర్పోర్ట్ నిర్మించింది. కానీ రాజకీయంగా లబ్ధి పొందడానికి వైసిపి టిడిపి రెండు పార్టీలు క్రెడిట్ వార్ చేస్తున్నాయి.