Top Story: అయతుల్లా అలీ ఖమేనీ వారసుడెవరు ? సుప్రీం లీడర్‌ను ఎన్నుకునేదెవరు ?

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో వారసుడిపై చర్చ జరుగుతోంది. ఖమేనీ కుమారుడికి అవకాశం ఇస్తారా ? కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తారా ?

Post Published By: dialnews
Updated : 3 March 2026, 12:55 PM IST

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో వారసుడిపై చర్చ జరుగుతోంది. ఖమేనీ కుమారుడికి అవకాశం ఇస్తారా ? కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తారా ? లేదంటే కొత్త వాళ్లను నాయకుడిగా నియమిస్తారా ? షియా మత పెద్దలు తీసుకునే నిర్ణయం సర్వత్రా ఉత్కంఠగా మారింది.ఇరాన్‌ తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అలీ ఖమేనీ మరణంతో...కొత్త నాయకుడి నియామక ప్రక్రియ షురూ అయింది. అయితే సుప్రీం లీడర్‌ రేసులో ఐదుగురు కీలక నేతలుఉన్నారు. వీరందరికి ప్రభుత్వంలో అనుభవం ఉన్నప్పటికీ...మత పెద్దల కమిటీ నిర్ణయమే కీలకం కానుంది. అయితే సుప్రీం లీడర్‌ను ఎంపిక చేయడం...ఇరాన్‌లో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. 88 మంది షియా మతపెద్దలతో కూడిన కమిటీ...కొత్త అధ్యక్షుడి నియామకంపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోనుంది. సుప్రీం లీడర్‌ను తొలగించే పవర్స్ కూడా ఈ కమిటీకి ఉంటుంది.

సుప్రీం లీడర్‌కు ఏదైనా జరిగితే, వీలైనంత త్వరగా కొత్త సుప్రీం లీడర్‌ను నియమించాల్సిన బాధ్యత మతపెద్దల కమిటీకి ఉందని ఇరాన్ చట్టాలు చెబుతున్నాయి. మతపెద్దల కమిటీని మజ్లిస్ ఏ ఖోబ్రేగాన్ ఎ రహ్బరి అని పిలుస్తారు. ఇందులో మతపెద్దలను ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులు 8 సంవత్సరాల పాటు మతపెద్దల కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఇరాన్ అధ్యక్షుడు, న్యాయవిభాగం అధిపతి, సుప్రీం లీడర్‌కు సలహాలిచ్చే ఇరాన్ గార్డియన్ కౌన్సిల్‌లోని ఒక సభ్యుడు భాగంగా ఉంటారు. కొత్త సుప్రీం లీడర్ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు, ఆయన పనులన్నీ చేసేందుకు తాత్కాలికంగా నాయకత్వ మండలిని ఏర్పాటు చేస్తారు. తాత్కాలిక నాయకత్వ మండలి ఏర్పాటులో ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, న్యాయవిభాగం అధిపతి గులాం హుస్సేన్ ముహ్‌సినీ ఎజేయీ కీలక పాత్ర పోషించనున్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్‌ను తొలగించే పవర్ కూడా ఇరాన్ మతపెద్దల కమిటీకి ఉంటుంది. అయితే మెజారిటీ ఓటింగ్ ద్వారా నేరుగా ఇది జరుగుతుంది. ఈ కమిటీ పవర్ ప్రభావం వల్లే మాజీ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రూహానీకి...2024 ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లభించలేదు. 1989లో ఇరాన్ సుప్రీం లీడర్‌గా అయతుల్లా రూహుల్లా ఖమేనీ మరణంతో ఆ పదవిని అయతుల్లా అలీ ఖమేనీ దక్కించుకున్నారు. ఆ నియామకం వారసత్వం ప్రాతిపదికన జరగలేదు. రూహుల్లా ఖమేనీ చనిపోయే సమయానికి, ఇరాన్ అధ్యక్షుడిగా అలీ ఖమేనీ ఉన్నారు. ఆయన తన పవర్స్‌ను ప్రయోగించి...కీలకమైన సుప్రీం లీడర్ పదవిని కైవసం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.

ఈ సారి మతపెద్దల కమిటీలోని మెజారిటీ సభ్యులు ఎవరికి మద్దతు ఇస్తే...వారే సుప్రీం లీడర్‌గా ఎన్నిక అవుతారు. దీంతో ఖమేనీ కుమారులలో ఒకరైన 56 ఏళ్ల ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సుప్రీం లీడర్ పదవిని ఖమేనీ కుమారుడికి ఇస్తే...మతపెద్దల కమిటీపై ఇరాన్ ప్రజల్లో ఆగ్రహం పెరగొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఖమేనీ కుటుంబ వారసత్వాన్నే రాజకీయాల్లో ప్రోత్సహిస్తే, మళ్లీ ఇరాన్‌లోకి రాచరికాన్ని తెచ్చినట్టు అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని కూడా అంటున్నారు.

సుప్రీం లీడర్ రేసులో పలువురు నేతలు ఉన్నారు. ఖమేనీ కుమారుడి తర్వాత ఐదుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హుజ్జతుల్ ఇస్లాం మొహ్సేన్ కోమి...ఖమేనీకి సన్నిహిత సలహాదారుడు, విశ్వసనీయ వ్యక్తిగా గుర్తింపు సంపాదించారు. ఆయన తర్వాత అయతుల్లా అలీ రజా అరాఫీ..సీనియర్ మతాధికారి. గార్డియన్ కౌన్సిల్, మత పెద్దల కమిటీ రెండింటిలోనూ సభ్యుడిగా ఉన్నారు. ఇరాన్ మతపెద్దల వ్యవస్థకు అరాఫీ నాయకత్వం వహిస్తున్నారు. మూడో నేత అయతుల్లా మొహ్సేన్ అరాకీ. ఈయన మతపెద్దల కమిటీలో సీనియర్ సభ్యుడిగా ఉన్నారు.

నాలుగో నేత అయతుల్లా గులాం హుస్సేన్ మొహసేని ఎజీ...ఈయన ప్రస్తుతం ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. గతంలో కీలకమైన ప్రభుత్వ పదవులను నిర్వహించారు. పరిపాలనా అనుభవం ఎక్కువగా ఉంది. చివరి పేరుతో అయతుల్లా హషేం హోస్సేని బుషెహ్రి.. మతపెద్ద హోదాలో పవిత్ర నగరం ఖోమ్‌లో ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేయిస్తారు. మతపెద్దల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అయితే షియా మత పెద్దల కమిటీలో 45 మంది ఎవరికి మద్దతు ఇస్తే...వారే ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.

Published : 
  • 3 March 2026, 12:55 PM IST